మడకశిర, జూన్ 17: చోళ రాజులు చేపట్టిన రాజదండానికి నోలంబ పల్లవ ప్రభువుల రాజ చిహ్నం ‘పద్మ నంది’ మూలమై వుండవచ్చని చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి సన్నిధిని సందర్శించిన తర్వాత నోలంబ రాజచిహ్నం గురించి మడకశిరలో విలేఖరులతో శుక్రవారంనాడు ఆయన మాట్లాడారు.
నోలంబ పల్లవ శిల్పకళపై పరిశోధన చేస్తున్న తాను సిద్ధేశ్వరాలయ స్తంభాల మండపంలో నోలంబుల రాజచిహ్నాన్ని గుర్తించినట్టు పరిశోధకుడు ప్రకటించారు. అగ్రమండపంగా పిలువబడుతున్న స్తంభాల మండపంలో ఉత్తరానికి ఎదురుగా రాజచిహ్నం వుంది. వికసించిన పద్మంలో నంది కూర్చొన్న విధంగా శిల్పాన్ని మలిచారు. నందికి ఆలంబనగా రాజలాంఛనం ఛత్రం (గొడుగు) వుంది. నoదికి ముందు వెనుక మరో రాజలాంఛనం చామరలున్నాయి. నంది దిగువ కీర్తిముఖం (మొసలితల) వుండగా, అటూ ఇటూ సింహాల సూక్ష్మ శిల్పాలున్నాయి. కీర్తి ముఖం కింద వినాయకుడు, కుమార స్వామి శిల్పాలు న్నాయి.
రాజ చిహ్నం పద్మనంది బొమ్మ నోలంబ పల్లవులు ముద్రించిన బంగారు నాణాల్లో కూడా వున్నట్టు, బంగారు నాణాలు మ్యూజియంలకే పరిమితమయినట్టు మైనాస్వామి వివరించారు. చోళులు రూపొందించిన రాజదండం తలభాగంలో పద్మంపై కూర్చొన్న నంది బొమ్మ వుంది. హేమావతిలోని పద్మ నందికి – రాజ దండంలోని నందికి సమీప సారూప్యతలున్నాయి. క్రీ.శ. 730 నుంచి క్రీ.శ. 1052 వరకు హేమావతి (హెంజేరు) రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాలను నోలంబ పల్లవులు పాలించారు. గంగ, బాణ, వైదుంబ, చోళ రాజులతో యుద్ధాలు చేస్తూ, సుస్థిర రాజ్యం స్థాపించారు. అయితే ఒకటో రాజాధి రాజ (1044-1052), తమ్ముడు రెండో రాజేంద్రతో కలిసి వచ్చి నోలంబ, చాళుక్య రాజ్యాలపై దాడి చేసి ఆక్రమించాడు. హేమావతిలోని సుమారు 40 సుందర శిల్ప స్తంభాలను రెండో రాజేంద్ర తరలించుకుపోయి తమిళనాడు తంజావూరు దగ్గరగల తిరువయ్యూరులో ఆలయాన్ని నిర్మించాడు. అందుకు సంబంధించిన శాసనాలున్నాయి. సెంగోల్ గా ఖ్యాతి గాంచిన రాజదండం చాళుక్యుల శిల్పాల్లోనూ వున్నా, హేమావతి పద్మనంది రాజ చిహ్నంతోనే చోళరాజులు స్ఫూర్తి పొంది.. రాజదండాన్ని రూపొందించి వుండవచ్చని చరిత్రకారుడు అభిప్రాయ పడ్డారు. —- MyNaa Swamy, Historian Mob. 95026 59119