– డా. దేవరాజు మహారాజు
నూతన పార్లమెంటు భవనానికి
ప్రధాని శంకుస్థాపన చేసిన రోజే
దేశం ఉలిక్కిపడింది.
అశోక చక్రంపై సింహాలను
రౌద్రంగా మార్చినప్పుడే
దేశం కలవరపడింది.
మన భయాలు అపోహలు కాదని
అవి నగ్నసత్యాలని
ప్రతి ఉదంతం రుజువు చేస్తూనే ఉంది.
భవన ప్రారంభమూ ప్రధానే.
మరి,
రాష్ట్రపతి లేరెందుకు?
దేశాధ్యక్షులు,
త్రివిధ దళాల సుప్రీం దళపతి,
ఉభయసభలనుద్దేశించి ప్రసంగించ గలిగేది,
రాష్ట్రపతే కదా!
మరెందుకీ వివక్ష ?
ఓహో!
గిరిజన మహిళ అనా!
భర్త లేని మహిళ అనా!
ఇది లౌకిక దేశమా?
మనువాద మతఛాందస రాజ్యమా?
సెంగోల్ అంటే రాజదండం.
ప్రధాని రాజుగా పట్టాభిషిక్తుడైనట్లు ఊహించుకుంటున్నాడు.
ఇది ప్రజాస్వామ్యం కాదని
రాచరికమని నర్మగర్భంగా చాటాలని చూస్తున్నాడు.
ఊతకర్రను రాజదండంగా
స్వయంగా హోంమంత్రే
పచ్చి అబద్ధాలను వండి వార్చాడు.
ప్రథమ ప్రధాని నెహ్రూ
కేవలం చేతికర్రగా భావించి మ్యూజియంలో పెట్టారు.
ఆ మ్యూజియం సంరక్షకుడు ఓంకార్ అమాత్యుల అబద్ధాలను ఎండగట్టాడు.
నెహ్రూ రచనల సంపాదకుడు
చరిత్ర పరిశోధకుడు మాధవన్ కె పలట్
రాజదండం అన్న కల్లబొల్లి కబుర్లను కొట్టిపారేశాడు
వైస్రాయి మౌంట్ బాటన్ రికార్డులు
అమాత్యుల ఎంతటి అబద్దాలకోరులో స్పష్టంచేశాయి.
వెయ్యేళ్ల నాటి చోళరాజుల సెంగోల్ ను తవ్వి
నేటి 21వ శతాబ్దపు
లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగంపై
అధికారపార్టీ చేసిన సర్జికల్ స్ట్రైక్ సెంగోల్.
ఎల్లకాలం అబద్ధాలు నిలబడవు.
ప్రజలు ఎన్నికల్లో మరో సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నారు.
ఇంతకాలం ఏ అబద్ధాలు గెలిపించాయౌ
అవే అబద్ధాలు అమాత్యులకు
రాజకీయ మరణ శాసనాన్ని లిఖించబోతున్నాయ్ !!!
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే.