- భట్టి సుదీర్ఘ పాదయాత్ర ముగింపు, రాహుల్ చేతులమీదుగా సన్మానం
- పొంగులేని శ్రీనివాసరెడ్డి, ఇతరులకు కాంగ్రెస్ లోకి రాహుల్ స్వాగతం
- వృద్ధాప్య పించను 4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ నేతల హామీ
- ఖమ్మం గర్జన సభకు జనసముద్రం
బీఆర్ ఎస్ బీజేపీకి బీ-టీం అని, బీజేపీనీ, దాని బీటీమ్ నీ వచ్చే ఎన్నికలలో ఓడిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇటీవల పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ ని ఆహ్వానించాలని కొన్ని ప్రతిపక్షాలు సూచించాయనీ, బీఆర్ఎస్ ను ఆహ్వానించిన పక్షంలో కాంగ్రెస్ హాజరు కాబోదని స్పష్టంగా చెప్పామని రాహుల్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె, చంద్రశేఖరరావు (కేసీఆర్) అవినీతి చిట్టా అంతా మోదీ దగ్గర ఉన్నదనీ, కానీ మిత్రపక్షం కనుక దానిపైన చర్యలు తీసుకోరనీ అన్నారు. త్వరలో తయారయ్యే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అన్ని అంశాలనూ అమలు పర్చుతామని రాహుల్ చెప్పారు. కర్ణాటకలో ప్రజలు చేసిన విధంగానే అధికార పార్టీని తెలంగాణ ప్రజలు సైతం ఓడించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
ఖమ్మంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన సభలో 1350 కిలోమీటర్ల పాదయాత్ర ముగించిన సీఎల్ పీ నాయకుడు భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ శాలువతో సత్కరించి అభినందించారు. అంతకు ముందు పార్లమెంటు మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, ఆయన అనుచరులనూ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాపరిషత్ చైర్మన్, మాజీ ఎంఎల్ఏలు, ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు.
కాంగ్రెస్ నాయకుడు దుర్గాకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ముందు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. అనంతరం శ్రీనివాసరెడ్డి, భట్టి విక్కమార్క, రాహుల్ గాంధీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ ప్రసంగాన్నిఉత్తమ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. చివరలో ఉత్తమ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. జానారెడ్డి, రేణుకా చౌదరి, షబ్బీర్ అలీ, తదితర కాంగ్రెస్ నాయకులు పెద్ద హాజరైనారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏఐసీసీ పర్యవేక్షకుడు ఠాక్రే కూడా వేదికపైన ఉన్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఇంటికి పంపించడం కాంగ్రెస్ వల్ల మాత్రమే అవుతుందనీ, అందుకు తాను ఆరు మాసాలు మండల స్థాయి సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాననీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. తన సుదీర్ఝ పాదయాత్రలో ఆదివాసుల, దళితుల, వెనకబడినవర్గాల కష్టాలను విన్నాననీ, ఆదివాసులు ప్రభుత్వంపైన చాలా కోపంగా ఉన్నారనీ భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలోనూ, దేశంలోనూ కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వక్తలందరూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాగాయకుడు, వాగ్గేయకారుడు గద్దర్ రాహుల్ గాంధీని ముద్దాడి, కౌగలించుకొని,ముందు వరుసలో కూర్చున్నారు. నాయకులందరూ వృద్దాప్య పింఛను రెండు వేల నుంచి నాలుగువేల రూపాయలకు హెచ్చిస్తామని హామీ ఇచ్చారు.