భగవద్గీత–85
తన తల నరుక్కోవడానికి అర్జునుడు తన చేతిలో ఉన్న కత్తి పైకెత్తాడు. ‘‘ఆగరా నీ దుంపతెగ. ఏం చేస్తున్నావు నువ్వు. ఏమిటీ తొందరపాటు’’ అంటూ మేనత్త కొడుకు చేయిగట్టిగా పట్టుకున్నాడు మాధవుడు. “మా అన్నను అనరాని మాటలన్నాను. నేనిక బ్రతికి వృధా. అంత ధర్మాత్ముడిని, అన్ని మాటలని నేనిక బ్రతకడం దండగ. నన్ను వదులు బావా“ అని చేయి లాక్కుంటున్నాడు అర్జునుడు. (యుద్ధం జరిగేటప్పుడు ఒక సందర్భంలో ధర్మరాజును బాగా తిడతాడు అర్జునుడు)
“ఒరేయ్ నాయనా, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అంతే కదా. అయితే నీకొక మార్గం చెపుతాను. పదిమందిలో నిన్ను నువ్వు గట్టిగా పొగుడుకో. నిన్ను నువ్వు పొగుడుకుంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం“ అని మాధవుడు అంటాడు.
Also read: చనిపోయినప్పుడు గీత వినిపించడం కాదు, బతకాలంటే వినాలి
ఒక్కసారి ఆలోచించండి…
మన మధ్యలో ఎవడైనా బాగా తనను తాను పొగుడుకుంటున్నాడు అనుకోండి. మనము ఏమనుకుంటాం? “ఓరినీ కోతలు తగలబడా. ఏం కోతలురా నాయనా. పూర్వజన్మలో పిట్టలదొరవేంరా నువ్వు“ అని వాడి విలువ సున్నా చేస్తాం. విలువ సున్నా అయిన మనిషి బ్రతికితే ఎంత పోతే ఎంత?
నేను ఫలానా పని చేశాను, నేనింతవాడిని, అంతవాడిని అని ప్రతీ సంవత్సరం పెట్టుకోవాలి. అదేనండీ… పనితీరు అంచనాలు (performance appraisals). ఎవడికి వాడు వ్రాసుకోవాలి వాళ్ళు చేసే ఉద్యోగాలలో.
ఇక ప్రతిరోజూ టివీలలో తనను తాను పొగుడుకునే నాయకులకు కొదవేలేదు. వారు చెప్పిందే వేదం, అదే ప్రమాణికం, అదే శాస్త్రం. అంతే అంతే అనే అంతేవాసులకైతే కొదవేలేదు.
Also read: మన ధర్మమె మనకు రక్ష
ఇలా ఎవడికివాడు తనను తాను పొగుడుకోవడం ఆసురీ ప్రవృత్తి!
ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్
‘‘తమకు తామే గొప్పవారమని భావించుకొనుచూ గర్వోన్మత్తులై ధనదురహంకారముతో కన్నుమిన్నుగానుక శాస్త్రవిరుద్ధమైన ఆడంబర ప్రధానమైన పనులు చేస్తూ ఉంటారు…’’