——————
(‘SELF KNOWLEDGE’ FROM ‘THE PROPHET’ BY KHALIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
———————————–
ఒక మనిషి ఆల్ ముస్తఫాను ఇలా అడిగాడు ” మాకు స్వీయ జ్ఞానం గురించి చెప్పండి.”
ఆల్ ముస్తఫా ఇలా చెప్ప సాగాడు
” దివా రాత్రాల రహస్యాలను
మీ హృదయాలు
నిశ్శబ్దంలో తెలుసుకుంటాయి.
కానీ,
మీ హృదయ జ్ఞానం చేసే
శబ్దం కోసం మీ చెవులు
దాహార్తితో ఉంటాయి.
మీ ఆలోచనా స్రవంతిలో
మీరు ఎప్పుడూ తెలుసు కున్నదే
ఇప్పుడు మాటల్లో తెలుసుకుంటారు.
మీ స్వప్నాల అనాచ్ఛాదిత రూపాన్ని
మీ వేళ్ళతో స్పృశిస్తారు.
మీరలా చేయటం బాగుంటుంది !
మీ ఆత్మ అనే
రహస్య ఊట బావి నుండి
(ఆవశ్యకమైనప్పుడు)
జ్ఞానం సాగరం వైపు
నిలకడగా, గుసగుసలతో
సాగిపోతుంది!
మీలోని అగాధపు నిధులు
నయనాలకు గోచరిస్తాయి.
మీ రహస్య జ్ఞాన నిధిని
తూచే సాధనాలు ఉండవు!
మీ జ్ఞానపు లోతుల్ని కొలిచే
సాధనం కోసం వెతకవద్దు!
ఎందుకంటే,
ఆత్మ జ్ఞానం హద్దుల్లేని,
కొలవలేని — ఒక సాగరం.
” మేము సత్యాన్ని కనుగొన్నాం”
అని చెప్పకండి.
” మేము ఒక సత్యం కనుగొన్నాం ”
అని చెప్పండి.
“ఆత్మ మార్గం కనుగొన్నామ”ని చెప్పకండి.
“మా దారిలో నడుస్తూ… ఆత్మను కలిసాం”
అని చెప్పండి!
ఎందుకంటే —
ఆత్మ అన్ని మార్గాలలోను సంచరిస్తుంది.
ఆత్మ ఒక గీతపై నడువదు.
రెల్లులా పెరగదు.
ఆత్మ — అనంతమైన రేకలున్న
పద్మంలా విచ్చుకుంటుంది!
Also read: తత్త్వ వేత్త మరియు చెప్పులు కుట్టేవాడు
Also read: కప్పలు
Also read: చట్టాలు మరియు చట్ట నిర్మాణం
Also read: మతి లేని మనిషి
Also read: చట్టాలు