- మాణికం టాగూర్ కు అంతు చిక్కని నేతల మనస్తత్వం
- మసకబారుతున్న పార్టీ ప్రతిష్ఠ
బండారు రాం ప్రసాద్ రావు
అధికార పీఠం ఇక అందదు అని తెలిసినా కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో పదవుల ఆశలు చావలేదు…జిహెచ్ఏంసి ఎన్నికల్లో చావుదెబ్బతిన్న తరువాత కాంగ్రెస్ లో ఇంకా ఏవో ఆశలు ఉన్నాయని అంటే..నాయకుల అస్తిత్వ పోరాటం తప్ప మరొకటి కాదు! గులాం నబీ ఆజాద్ కు తెలిసినంతగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు మరెవరికి తెలియవు. ఆయనని అధిష్ఠానం పార్టీలో పక్కన బెట్టి ఎప్పుడైతే కుంతియాను పంపారో అప్పటి నుండి కాంగ్రెస్ పతనం ప్రారంభం అయింది! ఏలికేస్తే కాలుకు వేసే దిగ్గజాలు ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్త ఇంఛార్జి మాణికం టాగూర్ తో ఆడుకుంటున్నారు! ఆయనకు రాష్ట్ర వ్యవహారాల పట్ల పరిపక్వత అంతంత మాత్రం ఉండడం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల నైజం తెలిసే వరకు కాంగ్రెస్ ప్రతిష్ట మొత్తం మసకబారి పోయెట్టుగా ఉంది! తన భార్యను గెలుపించుకొలేని ఉత్తమ కుమార్ రెడ్డి…జిహెచ్ఎంసి ఎన్నికల తరువాత పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేసి చేతులు దులుపుకున్నారు. కానీ కొత్త నేత ఎంపికలో నడుస్తున్న రాజకీయం సెంట్రల్ కాంగ్రెస్ కు పితురీలు చెప్పే వరకు వెళ్ళి పోయింది..
మొదట కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తరువాత తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు పిసిసి చీఫ్ గా వినిపిస్తున్నప్పటికి వీరి ముగ్గురు కాంగ్రెస్ ను నడిపించే సత్తా లేని వారీగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి చెప్పి, వాళ్ళ పరపతిని దెబ్బతీసే లా వ్యవహరించే లా చేస్తున్న శకుని మామ ల వల్ల ఇపుడిపుడే పిసిసి చీఫ్ పదవి భర్తీ చేసే ఆలోచనకు కాస్తా విరామం ఇచ్చారు! ఈ లోపు వీళ్ల మైండ్ సెట్ ను చూడడానికి వచ్చిన మాణికం టాగూర్ కు కళ్ళు బైర్లు కమ్మే విషయాలు తెలుస్తున్నాయి…ఎవరికి పదవి ఇచ్చినా అసమ్మతి గుప్పు మని బడా నేతలు మరో పార్టీ శిబిరానికి జంప్ అవుతారని సంకేతాలు రావడం, పార్టీలో ఉన్నా కూడా ఒకరి కాలు మరొకరు పట్టుకొని లాగే పరిస్థితి కనబడుతుంది.
రేవంత్ రెడ్డి పార్టీకి వలస వచ్చిన వ్యక్తి మేము సీనియర్లను అనే భావన కొంత మందికి ఉంది. హనుమంతరావు లాంటి వ్యక్తి…జానారెడ్డి లాంటి దిగ్గజం, రాజనరసింహ, గీతారెడ్డి లాంటి సీనియర్లు రేవంత్ మాట వినడం మాట దేవుడెరుగు, కనీసం ఆయన పెట్టే మీటింగ్ లకు కూడా హాజరయ్యే పరిస్థితిలో లేరు! ఇక జగ్గారెడ్డి, వెంకటరెడ్డి, పేర్లు తెరమరుగు కావడం తో ఇపుడు రేవంత్ రెడ్డి ని అధిష్ఠానం పిలిచిందో లేదో ఇక్కడ జానారెడ్డిని అక్కున చేర్చుకోవడానికి అటు టీఆర్ఎస్, ఇటూ బిజెపిలు గాలం వేశాయి. మరో వైపు శ్రీధర్ బాబు ను కూడా టీఆర్ఎస్ పిలుస్తోంది. తన శిబిరం లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామనే ఆశలు కూడా శ్రీధర్ బాబు కు కల్పిస్తుంది. ఇలా కాంగ్రెస్ ప్రతిష్ట పదవుల వ్యూహం లో కొట్టు మిట్టాడుతుంది. మరో వైపు ఇప్పుడు ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి నే కొనసాగిద్దాం అంటే ఆయన ఆ పదవిలో ఉండడానికి అయిష్టం వ్యక్తం చేయడమే కాకుండా, ఒక వేళ కొనసాగినా వచ్చే ఎన్నికలలో అయన కేసీఅర్ కు దీటైన ప్రచారం చేసే స్థితిలో లేరు! తూర్పు తెలంగాణలో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయన ఉనికిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. మరో వైపు జిల్లాల పార్టీ నాయకుల దృష్టిలో వరుస ఓటములతో ఉత్తమ కుమార్ రెడ్డి చులకన అయిపోయారు! శ్రీధర్ బాబు పై అధిష్ఠానం వర్గం మొగ్గు చూపుతున్నప్పటికి ఆయన స్వతహాగా ఈ పదవికి దూరంగా ఉండాలని భావిస్తున్నారట.
మొదట్నుంచీ రెడ్డి సామాజిక వర్గం మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ ను నడిపించింది. ఇపుడు బ్రాహ్మణుడు, సౌమ్యుడు అయిన శ్రీధర్ బాబు ఈ వర్గాల ను కూడా గట్టు కోవడం కష్టం. ఇక ఏకైక ఆశాదీపం గీతారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపిన ఆమె ససేమిరా అంటోంది. వయసు మీద పడడం, దానికి తోడు తన ఒకప్పటి అనుచరులు అరుణ బిజెపిలో, సబితా టీఆర్ఎస్ లో లైంలైట్ లోకి రావడం తో వచ్చే ఎన్నికల నాటికి గీతారెడ్డి కూడా మరో పార్టీ తీర్థం పుచ్చుకోవడం తథ్యం అనే పుకార్లు వస్తున్నాయి. ఇన్ని నేపథ్యాల మధ్య రాష్ట్ర కాంగ్రెస్ టీఆర్ఎస్ కు దీటైన వ్యక్తిని ఎంచుకొలేక పడుతున్న అవస్తవల్ల బిజెపి ఇక్కడ బలపడే అవకాశాలు దండిగా కనబడుతున్నాయి.