‘‘అంతరిక్షం నుంచి భూగోళాన్ని చూడడం అద్భతమైన అనుభవం. ఇది జీవితాన్ని మార్చివేసే అనుభూతి,’’ అని ఇండియన్-అమెరికన్ వ్యోమగామి బండ్ల శిరీష వ్యాఖ్యానించారు. ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన 34 ఏళ్ళ శిరీష బండ్ల ఆదివారంనాడు బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తోనూ, మరి నలుగురితోనూ కలసి వర్జిన్ గెలాస్టిక్ రూపొందించిన వ్యోమనౌక స్పేస్ షిప్-2-యూనిటీలో అంతరిక్షంలో కొన్ని నిమిషాలు గడిపి జయప్రదంగా తిరిగి వచ్చారు. అమెరికాలోని న్యూమెక్సికో నుంచి అంతరిక్షం అంచువరకూ వెళ్ళి వచ్చిన ప్రప్రథమ వాణిజ్యం వ్యోమనౌక అది. న్యూమెక్సికో ఎడారిలో 88 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ దాకా వెళ్ళింది. ఆ ఎత్తు నుంచి భూగోళం గుండ్రంగా ఉండడాన్ని చూడవచ్చు. వ్యోమనౌకలో ఉన్నవారు కొన్ని నిమిషాలపాటు భారరాహిత్యాన్ని అనుభవించారు. అంతలోనే నౌక తిరుగుప్రయాణం ప్రారంభించింది.
‘‘నాకు ఇంకా అక్కడే ఉన్నట్టు అనుభూతి కలుగుతోంది. ఇక్కడికి తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది. నమ్మశక్యం కాని అనే మాట కంటే మెరుగైన పదబంధం దొరుకుతుందేమోనని ఆలోచిస్తున్నాను. అక్కడి నుంచి భూమిని చూడడం అనేది జీవితాన్ని మార్చివేసే అనుభవం. రాకెట్ మోటార్ ఇంజనీరింగ్ చేసిన అద్భుతం ఇది. అంతరిక్షానికి వెళ్ళిరావడం అద్భుతమైన అనుభవం,’’ అని శిరీష్ బండ్ల ఎన్ బీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అది ఒక ఆవేశభరితమైన క్షణం. ‘‘నా చిన్నతనం నుంచీ అంతరిక్షానికి వెళ్ళాలని కలలు కంటున్నాను. కల సాకారమైన క్షణాలు అనిపిస్తోంది,’’ అని ఆమె అన్నారు.
‘‘నాకు వ్యోమగామి కావాలనే ఆకాంక్ష బలంగా ఉండేది. కానీ సంప్రదాయబద్ధంగా నాసాలో చేరి వ్యోమగామిగా శిక్షణ పొందలేకపోయాను. నా దృష్టిలోపం అందుకు కారణం. అందుకని సంప్రదాయానికి బిన్నమైన అన్ని మార్గాలలో అంతరిక్షానికి వెళ్ళడానికి ప్రయత్నించాను. ఇక మీదట చాలామందికి ఇటువంటి అనుభూతి కలగబోతోంది. అందుకే మేము ఇక్కడ ఉన్నాం,’’ అని వివరించారు.
ఇది సంపన్నులకు మాత్రమే అందుబాటులోఉండే విహారమేనా అని అడగగా, ‘‘ఈ విఎస్ఎస్ నౌక ప్రయోగాత్మకంగా వెళ్ళవచ్చిన అంతరిక్ష నౌక. ఇటువంటివే మరి రెండు అంతరిక్ష నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా తయారైతే టిక్కెట్టు చార్జీలు తగ్గుతాయనుకుంటా,’’ అన్నారు.