వోలేటి దివాకర్
- ఉండవల్లి పిటిషన్ పై వచ్చేవారం నుంచి సుప్రీం కోర్టు లో విచారణ
- మరో రాష్ట్రానికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడండి!
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రాష్ట్రాల విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై ఉండవల్లి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.
ఏపీ పునర్విభజన సమయంలో తప్పులు జరిగాయని.. విభజన ప్రక్రియ సరిగా జరగలేదంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినందున భవిష్యత్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని ఉండవల్లి సవరణ పిటిషన్ వేశారు.
ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం ముందు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. పిటిషన్ దాఖలు చేసి చాలా కాలం అయిందని ఆయన గుర్తుచేశారు. ప్రశాంత్‌భూషణ్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ.. దీనిపై త్వరితగతిన విచారణకు జరిపేందుకు అంగీకారం తెలిపారు. వచ్చేవారం లిస్ట్ లో ఈ పిటిషన్‌ను పొందుపరిచేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.