Monday, December 30, 2024

లౌకికవాదులు నా వెంట పడటం- భారత దేశంలో దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వానికి నిదర్శనం

లౌకికవాద రాజకీయాలు మరింతమంది స్నేహితులను పోగుచేసుకోవలసిన సమయంలో మనం శత్రువులను పెంచుకునే కళలో ఆరితేరుతున్నాం.

మన చుట్టూ ఉన్న నిరాశావాద రాజకీయ వాతావరణం గురించి ఇటీవలి ప్రత్యక్ష ఆన్ లైన్ అనుభవం నాకు గుణపాఠం నేర్పింది.

తాజాగా ఆదివారంనాడు ‘సండే సత్సంగ్’ పేరుతో నేను నా ఫెస్  బుక్. ట్విట్టర్, యూట్యూబ్ లలో వారంవారం పెట్టే విడియో అది. దాని టైటిట్ ‘‘ఖలిస్థాన్, ఘ్వాజా-ఇ-హింద్ అవుర్ హిందూ రాష్ట్ర: భారత్ కే స్వధర్మ్ పర్ ఆక్రమణ్ కే తీన్ ముఖౌటే (ఖలిస్థాన్, ఘ్వాజా-ఇ-హింద్, హిందూ రాష్ట్ర: భారత్ అనే భావనపైన దాడికి మూడు ముసుగులు). హిందూ రాష్ట్ర కోరుకుంటున్నవారు ఖలిస్థాన్ వాదం తలెత్తడానికి బాధ్యులంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చేసిన ప్రకటన చుట్టూ నా కథ అల్లాను.

Also read: ఆశావహంగా హిందీ బాల సాహిత్యం

‘‘సండే సత్సంగ్’’ ఎడిషన్ లో ఒక మామూలు వాదన వినిపించడానికి గెహ్లోత్ ప్రకటనను వినియోగించుకున్నాను. భారత్ అనే భావనకు ఖలిస్థాన్ వాదమైనా, ఘ్వాజా-ఇ-హింద్ వాదమైనా,  హిందూ రాష్ట్రవాదమైనా పూర్తిగా భిన్నమైనవి. అయితే, ఈ మూడు వాదనలలో కూడా తేడా ఉన్నది. ఘ్వాజా-ఇ-హింద్ అంటే భారత ముస్లింలలో ఎవ్వరూ అంగీకరించరు. ఖలిస్థాన్ అనేది తేలిపోయిన నినాదం. సిక్కులలో అత్యధికులు తిరస్కరించిన సిద్ధాంతం. కానీ భద్రతాసంస్థలు తవ్వి వెలికితీసే ఆధారాలతో ఖలిస్థాన్ వాదానికి మద్దతునిచ్చే వారిని శిక్షించాలని ప్రయత్నిస్తున్నాయి. హిందూరాష్ట్రవాదం దేశానికి తక్కువ వ్యతిరేకమైనదేమీ కాదు. కానీ ఆ వాదాన్నిబహిరంగంగా ఆమోదిస్తారు. భారత్ అనే భావనకు ఇది నిజమైన ప్రమాదమని నా సూచన. ఖలిస్థాన్, ఘ్వాజా-ఇ-హింద్ వాదాలను సజీవంగా ఉంచే కారణం హిందూరాష్ట్రవాదం కావచ్చు.

ఇప్పుడు, నామీద దాడి చేసింది ఎవరనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఐటీ విభాగంవారా? కాదు. మీ అంచనా తప్పు. హిందూరాష్ట్ర అభిలాషులు వారు మామూలుగా తిట్టే తిట్లు తిట్టారు. కానీ ఈ సారి దాడి లౌకికవాదులలో చిన్నదే కానీ నోరున్న విభాగం నుంచి వచ్చింది. ఘ్వాజా-ఇ-హింద్ ని హిందూ రాష్ట్రతో సమానస్థాయిలో ఉంచడం ద్వారా ఇప్పటికే బదనాం అయిన ముస్లిం సామాజికవర్గంపైన ఇంకా బురదపోస్తున్నావని తిట్టారు. ఈ మూడు భావనలనూ సమానంగా చూడవద్దనేదే నా విడియో తాత్పర్యం. ఘ్వాజా-ఇ-హింద్ అనే మాటను అల్ ఖాయిదావాదులూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మాత్రమే ఉపయోగించారు. ముస్లిం నాయకుడు కానీ, పార్టీ కానీ, సంస్థ కానీ, చివరికి ఏ ఇస్లామిక్ మతసంస్థకానీ ఉపయోగించలేదని స్పష్టం చేశాను. విడియో మొత్తం చూసిన కొంతమంది విమర్శకులు నాకు సారీ చెప్పారు. కానీ చాలామంది విడియోలో ఏమున్నదో చూడకుండానే దాడి ప్రారంభించారు. ముసుగువీరులు అనే మాట హెడ్డింగులో ఉన్న సంగతి గుర్తించడానికి కూడా వారు సిద్ధంగా లేరు.

Also read: అద్భుతమైన తెలివితేటలు కలిగిన మూర్ఖులు

హడావిడిగా హెడ్డింగు చదివేసి, అందులో ఘ్వాజ్వా-ఇ-హింద్ అనే మాట చూసేసి విచారణ చేసి శిక్ష విధించడానికీ, మాటలతో వధించడానికీ సిద్దపడుతున్నారు. భీరువు అనీ, కోతులను ఆడించేవాడిననీ,  ఉదారవాదపక్షిననీ, దొంగసంఘీననీ, ముస్లింద్వేషిననీ తిట్టారు. మిగతా తిట్లు ఇక్కడ ప్రస్తావించి మిమ్మల్ని విసిగించను. సోదరభావాన్ని పాటించాలంటూ నీతులు చెప్పే నాకు తిక్క బాగా కుదిరిందని ‘ఓప్ఇండియా’ సంబరం చేసుకున్నది. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ తుపాను మొత్తం ట్విట్టర్ కే పరిమితమైంది. నాకు తెలిసినంతవరకూ ఫేస్ బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, నిజజీవితంలో కానీ అది ప్రతిఫలించలేదు.

నిరాశారాజకీయాలు చాలా దూరం వెళ్ళాయి

దేశంలో చర్చ ఎంత నీచంగా జరుగున్నదనే విషయంపైన మీకు ఫిర్యాదు చేయడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. మనవాళ్ళు అన్నట్టు ‘‘మనం భారతీయులం ఇట్లాగే ఉంటాం.’’ అర్ణాబ్ గోస్వామి వంటి వాచాలుడు ఆవిర్భావం అనంతరం ఆధారాలు, వాస్తవాలు చూపించాలనీ, మర్యాదగా మాట్లాడాలనీ ఆశించడం తప్పు. ప్రజాజీవితంలో ఉండాలనుకుంటే చాలా చెత్తాచెదారం వినడం నేర్చుకుంటే మంచిది. ఇంతకంటే మరింత లోతైన విషయం గురించి నేను చింతిల్లుతున్నాను. మోదీ వ్యతిరేక శిబిరంలో ఎంత నిరాశావాదం ఉన్నదో ఈ చిన్న విషయం స్పష్టంగా వెల్లడిస్తున్నది.  ప్రజాజీవితంలోని ప్రతిమూలలోనూ గత తొమ్మిదేళ్ళుగా మోదీ ప్రభుత్వం నట్లు బిగిస్తూ వచ్చింది. మన ప్రజాజీవితం విషమయం అయిపోయింది.  రాజ్యాంగ దృక్పథం ఉన్నవారు సంస్థాగత వ్యవహారాలలోనూ, సామాజిక జీవితంలోనూ ఎందుకూ కొరగాకుండా పోతున్నారు. ముస్లింలు అయినవారు తీవ్రమైన నిరంతరాయమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇది భౌతికంగానూ, సంకేతప్రాయంగానూ జరుగుతున్నది. వారు దాడికి గురి అవుతున్నట్టు భావిస్తున్నారు ఎందుకంటే దాడి నిజంగానే జరుగుతోంది కనుక.

Also read: భారత ప్రజలు రాహుల్ గాంధీని గుండెకు హత్తుకున్న వేళ!

దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వాన్ని సూచించే కొన్ని లక్షణాలను ఇది చూపిస్తుంది. ‘ఇతరులతో’ (మనవాదనను అంగీకరించకుండా ఇతర వాదనలు చేసేవారితో) సంభాషణ బాధామయంగా తయారైంది. వారిని సాధ్యమైనంతవరకూ తప్పించుకొని తిరుగుతాం. మనలో నాటుకుపోయిన భావాలతో ఏకీభవించే సమాన భావజాలం ఉన్న చిన్న చిన్న బృందాలతో మనం వ్యవహారం చేయడానికి ఇష్టపడతాం. మన భావాలను ప్రతిధ్వనించే బృందాలతో సంభాషించడానికి సోషల్ మీడియా సహకరిస్తుంది. ఈ బృందాలలోని సభ్యులు ఎంత సన్నిహితం అవుతారో ‘ఇతరులకు’ మనం అంత దూరం జరుగుతాం. ఇతరులంటే ఈ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు లేదా బీజేపీ సానుభూతిపరులు.

ద్వైదీభావానికి అద్దం

దాడికి గురి అవుతున్నామనే భావన నలుపు-తెలుపు రంగులలో ఆలోచించడాన్ని ప్రోత్సహిస్తుంది. సందిగ్థానికి అవకాశం ఉండదు.  బీజేపీ ప్రతినిధి నూపూర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని భావించినవారికి సైతం ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిపడిన బీజేపీ వ్యతిరేక మద్దతు పెద్దగా ఉత్సాహం కలిగించకపోవచ్చును. ఇటువంటి వివాదాస్పదమైన అంశాలపైన ఎవరైనా సూత్రబద్ధమైన వైఖరి ప్రదర్శించినట్లయితే- ఉదాహరణకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పైన నిషేధం విధించాలన్న అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే- వారిని కోతుల ఆట ఆడేవాడంటూ నిందిస్తాం. సమతుల్యం పాటించడం అన్నది దురలవాటుగా పరిగణించి సమతుల్యంగా ఉండాలనే మనస్తత్వాన్ని కోల్పోతాం. బయటివారికి వింతగా, హాస్యాస్పదంగా కనిపిస్తాం.

Also read: భారత రాజకీయాలలో ఇది ప్లాస్టిక్ యుగం, ఫ్లెక్సీలలో అర్థాలు వెతక్కండి!

ప్రస్తుతం సాగుతున్న భావజాల దాడులను ఎదుర్కొనడానికి అవసరమైన మన సాంస్కృతిక వనరులను మనం ఇతరులకు అప్పగించవలసి వస్తున్నది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ద్వయం జాతీయతాభావనను ఉద్దీపింపజేస్తుంది, ఎల్లప్పుడూ భారత వారసత్వాన్ని గుర్తు చేస్తుంది కనుక మనం మన సంస్కృతి నుంచీ, వారసత్వం నుంచీ ఏదైనా శక్తిమంతమైన ప్రతీకలను ఉదహరిస్తే వాటితో మీకేం సంబంధం అన్నట్టు ఆగ్రహంగా చూస్తారు. ఆలోచనల అంగడిలో మనం బిత్తరపోయి నిలబడి ఉంటాం. చాలా విలువైన ద్రవ్యాన్నీ, కరెన్సీ నోట్లనూ జేబులలో నుంచి ఖాళీ చేసినవారిలాగా బిక్కచచ్చిపోయి మిగిలిపోతాం.

ఇటువంటి మనస్తత్వం విధేయతకు సంబంధించిన అంశానికి దారితీస్తుంది. ప్రస్తుత పాలకులు ఆడుతున్న రాజకీయ క్రీడలో అవిశ్వాసం అన్నది చాలా లోతుగా పాతుకొనిపోయి ఉన్నది. మన విధేయతకు ప్రతి కొత్త పరిణామం, ప్రతికొత్త వివాదం పరీక్ష పెడతాయి.  ఈ విభజన రేఖలో మీరు ఎటువైపు ఉండాలో అటువైపు ‘‘కానీ, కాకపోతే’’ అనేటటువంటి సందేహాలూ, శశభిషలూ లేకుండా గట్టిగా నిలబడగలరా? విద్వేషపూరిత వాతావరణాన్ని ఎదిరించి లౌకికవాదంవైపు నిలబడటం అంటే మైనారిటీల పక్షాన, వారి ప్రతినిధుల పక్షాన నిలబడినట్టు లెక్క. మీరు ఎంత గింజుకున్న ఆ లెక్క మారదు.  మనం ఏ ద్వైదీభావాన్ని వ్యతిరేకిస్తున్నామో అదే భావంలో అల్పసంఖ్యాకుల రాజకీయాలకు అద్దం పడతాం. మనలో శత్రువులకోసం అన్వేషిస్తాం. నిజానికీ, నిస్పక్షపాతానికీ పట్టం కట్టాలన్న మౌలిక ధర్మాన్ని సైతం విస్మరిస్తాం. లౌకికవాద రాజకీయాలకు మరింత మంది మిత్రుల  సహకారం అవసరమైన సమయంలో కొత్త శత్రువులను సృష్టించుకునే కళను అభ్యసిస్తాం.

ఇది రాజకీయపరమైన సంక్షోభం. ప్రజలలో ఈ తరహావారితో, ముఖ్యంగా మన గణతంత్రాన్ని నిలువునా పాతరవేసే ఆలోచనకు దన్నుగా నిలిచిన హిందువులతోఅర్థవంతమైన సంభాషణ కొనసాగించవలసి ఉంటుంది. చాలా లోతుగా ఈ సంభాషణ కొనసాగించడం చాలా కష్టతరమైన బాధ్యత. కానీ మనం మన భావజాలానికి అనుగుణంగా ఉన్నవారితోనే వ్యవహారం చేయడానికి అలవాటు పడ్డాం కనుక మనతో ఏకీభవించనివారితో వ్యవహారం ఇష్టం ఉండదు. ఇది పరాజిత రాజకీయాలకు దారితీస్తుంది.  మనం రాబోయే పరిణామాల పట్ల భయపడుతున్నాం కనుక కష్టకాలం అన్నది నిజం కాబోయే జోస్యం.

Also read: భారత్ జోడో యాత్ర ప్రభావం గణనీయం

కొత్త కర్తవ్యాల పట్టిక

దాడులు జరుగుతున్నప్పుడు దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వాన్ని విడనాడటం ఎట్లా? ఈ  ప్రశ్నకు తేలికైన సమాధానాలు లేవు. రామ్ మనోహర్ లోహియా రచించిన విఖ్యాతమైన ఒకానొక వ్యాసం శీర్షిక ‘‘నిరాశా  కే కర్తవ్యా  (నిరాశావాదుల కర్తవ్యాలు).’’ ఆదే విధంగా చీకటి రోజులలో గణతంత్రవ్యవస్థను రక్షించాలని కోరుకునేవారు కొత్త కర్తవ్యాల పట్టికను పాటించాలి. లౌకికవాదులుగా మారినవారితో విస్తృతమైన, లోతైన, అనారోగ్యకరమైన చర్చలలోకి దిగకుండా లౌకికవాద రాజకీయాలను కాపాడుకోవాలి.  విద్వేషపూరితమైన, ద్వైదీభావంతో నడిచే రాజకీయాలవైపు తాత్కాలికంగా మళ్ళిన మెజారిటీ హిందువులతో చర్చలు జరపాలి. మన సంస్కృతిక వనరులను పరరక్షించుకుంటూ, జాతీయవాద భాషాజాలాన్ని తిరిగి పటిష్ఠపరుచుకుంటూ, సత్యాన్ని, హేతువునూ, నిస్పక్షపాతాన్నీ, సమతౌల్యాన్ని పునఃస్థాపించే ప్రయత్నం చేయాలి. మనం దాడికి గురి అవుతున్నామనే విషయం అంత సూటిగా కనిపించేది కాదు. దాడిని ఎదుర్కోవడంలో మనం అనుకున్నంత బలహీనులం కూడా కాదు.

నిరాశానిస్పృల వల్ల మనపైన కొన్ని బాధ్యతలు ఉంటాయి: మన కాలంలో నిజమైన సవాళ్ళ నుంచి మనలను దూరం చేయడానికి ప్రస్తుత పాలకులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కానీయకండి.

Also read: ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles