- శాంతిసుస్థిరతలు ఉంటేనే ప్రగతి
- భిన్నత్వంలో ఏకత్వమే భారత సౌదర్యం
భిన్నత్వమే భారతీయ సంస్కృతిలోని సౌందర్యం. సర్వమత సహనమే మన సిద్ధాంతం. సమత, మమత, దార్శనికతలే మన వెలుగు దివ్వెలు.”నైతిక సరిహద్దులు ఛిద్రమైపోయిన రోజుల్లోకి మనం వచ్చేశాం” అని ఒక పాశ్చాత్య దార్శనికుడు ( మన బ్రహ్మంగారి లాంటివాడు) ఏనాడో అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో సహనాన్ని, సమతుల్యతను మరచి ప్రవర్తించినప్పుడు జరిగే నష్టాలు ఒక్కొక్క పర్యాయం అంచనాలను మించి పోతూ ఉంటాయి. భారతదేశంలో అధిక సంఖ్యాకులైన వర్గం- అల్ప సంఖ్యాకులైన వర్గం పట్ల పెద్దన్న పాత్రను పోషించాలి. తక్కువ సంఖ్యాకులైన వర్గాలు ఎక్కువ సంఖ్యాకులైన వర్గం పట్ల చిన్నతమ్ముడులా వ్యవహారించాలి.. ఈ మాటలు అన్నది సర్దార్ వల్లభాయ్ పటేల్. ” కులం -ప్రాంతం -మతం పరిధులను దాటి పయనించండి “..అని ఆయన ఇంకోమాట కూడా అన్నారు. ఇవన్నీ జాతిహితాన్ని,దేశప్రగతిని, సామాజిక శాంతిని దృష్టిలో పెట్టుకొని చెప్పిన ఆణిముత్యాలు.వాటి వెనకాల అచంచలమైన దేశభక్తి, రేపటి పట్ల భయం, బాధ్యత, జాగరూకతలు దాగిఉన్నాయన్నది సత్యం.
Also read: నూతన రాష్ట్రపతి ఎవరో?
ప్రవక్తపై వ్యాఖ్యాలు తెచ్చిన ప్రకంపనలు
నేడు, మహమ్మద్ ప్రవక్తపై బిజెపి మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యల అంశం దావానలంగా మారింది. ఒక ఛానల్ డిబేట్ లో పాల్గొన్న ముస్లిం మతానికి చెందిన ఒక పెద్ద ‘శివలింగాకారం’ గురించి వీరి కంటే ముందుగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనీ, దానికి ప్రతిస్పందనగా నూపుర్ శర్మ, నవీన్ కుమార్ (ట్వీట్ ద్వారా) అంతే ఘాటుగా విరుచుకుపడ్డారని చర్చ జరుగుతోంది. ఈ రెండు వర్గాల మధ్య జరిగిన మాటల యుద్ధం హద్దులు దాటి, నేటి యుద్ధవాతావరణానికి మూలస్థంభంగా నిలిచిందని వార్తలు, కథనాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సామాజిక మాధ్యమాల వేదికల్లో పెద్దరచ్చ జరుగుతోంది. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు హడలిపోతున్నాయి. కశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకూ ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ‘అధికారప్రతినిధి,’ సోషల్ మీడియా నిర్వాహకుడి పదవులను కోల్పోయారు. వీరిద్దరినీ తక్షణమే అరెస్టు చేయాలనే డిమాండ్ తో ముస్లింలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. బంద్ లు, కర్ఫ్యూలు, నిషేధాజ్ఞలతో పలు ప్రాంతాలు సంచలన వార్తా కేంద్రాలవుతున్నాయి. దిల్లీ నుంచి గల్లీ వరకూ సాగుతున్న ఈ నిరసనలు వెంటనే ఆగిపోవాలి. దేశమంతా శాంతి నెలకొనాలి. ఆ దిశగా అందరూ కలిసిరావాలి. లేనిపక్షంలో జరుగబోయే విపరీత, విపత్కర పరిస్థితులు ఊహాతీతంగా ఉండవచ్చునని కొందరు పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. దేనినీ తెగే దాకా లాగకూడదు, రచ్చ దాకా తెచ్చుకోకూడదు. అతిసున్నితమైన అంశాల పట్ల వ్యాఖ్యలు చేసే క్రమంలో అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. మత విద్వేషాల వల్ల మన దేశం ఇప్పటికే చాలా నష్టపోయింది. పలుమార్లు జరిగిన విదేశీయుల దాడులకు, దోపిడీలకు సంపద, సంస్కృతి కోల్పోయాం. అతి కష్టం మీద ఎంతో కొంత నిలబెట్టుకున్నాం. ఇస్లామిక్ తీవ్రవాదం/ ఉగ్రవాదం రోజురోజుకూ పెరుగుతున్న వేళ, మరింత అప్రమత్తంగా ఉండాలి.
Also read: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కసరత్తు ప్రారంభం
అన్ని వ్యవస్థలూ సంయమనం పాటించాలి
నేటి ఆందోళనలకు మూలమైన వ్యాఖ్యల విషయంలో ఇరువర్గాల తప్పు ఉందని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల చోటు చేసుకుంటున్న పరిణామాల్లో పోలీసింగ్ ను కూడా కొందరు తప్పు పడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థల పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి. పోలీసులకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ఇవ్వడం పాలకుల బాధ్యత. ఎలాగూ చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టానికి, న్యాయానికి ఎవ్వరూ అతీతులు కారనే విషయాన్ని విస్మరించడమే విషాదమని సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ బయలుదేరిన 80-20 నిష్పత్తి అంశం కూడా కార్చిచ్చులను రేపింది, రేపుతోంది. కశ్మీర్ కాష్టం కాలుతూనే ఉంది. మన దేశంలో ఎలా ఉన్నప్పటికీ,ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గణాంకాలను చూస్తే, క్రిష్టియన్, ఇస్లామిక్ వర్గాల సంఖ్య హిందువుల కంటే ఎక్కువగా ఉంది. మనం వేసే ప్రతి అడుగు, మాట్లాడే మాట, చేసే వ్యాఖ్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సాగడమే వివేకం. కేవలం మన దేశంలో ఉన్న గణాంకాలను బట్టి మాత్రమే ముందుకు వెళ్లడం అన్ని వేళల క్షేమదాయకం కాదు. భవిష్య పరిణామాలు, భావి తరాలను దృష్టిలో ఉంచుకొనే మనం వర్తించాలని విజ్ఞులు చేసే సూచనలను గౌరవించడమే కర్తవ్యం. సహనమంటే చేతకానితనం, చేవచచ్చిన గుణం కావు. అదే సమయంలో, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో ప్రపంచ దేశాలన్నీ కదిలి సాగాలి,కలిసి రావాలి. ఈరోజు జరుగుతున్న ఈ దారుణకాండను రేపోమాపో మిగిలిన దేశాలు కూడా చవిచూస్తాయి. ఇప్పటికే అగ్రరాజ్యమైన అమెరికాకు అనుభవంలోకి వచ్చింది. ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో, అరాచక, సంఘవిద్రోహ, దేశ విద్వేషశక్తులు కూడా జొరబడి ఉంటాయని పరిశీలకులు అనుమానిస్తున్నారు. సర్వమత సహనంతో, సర్వహిత భావంతో, సమతుల్యతతో సాగడమే శ్రేయస్కరం. శాంతి వర్ధిల్లనంతకాలం ప్రగతి ప్రశ్నార్ధకమవుతుంది. రాజకీయాలకు అతీతంగా కదలాల్సిన సందర్భం ఇది!
Also read: కశ్మీర్ లో ఘోరకలి