భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు కలిగిన మన దేశానికి లౌకికవాదమే సరైనది. 1976 లో 42 వ రాజ్యంగ సవరణద్వారా అప్పటి ప్రధాని ఇందిరాగాందీ రాజ్యాంగంలో ‘సెక్యులరిజం’ అనేపదాన్ని చేర్చారు. అంటే రాజ్యపాలనలో మతం జోక్యం ఉండరాదు. మతమూ, దేవుడూ వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి. రాజకీయం, మతం కలిస్తే మతరాజకీయం అవుతుంది. మతాన్ని రాజకీయాలకు కలిపితే వచ్చే అనర్ధాలను గతంలో ఎన్నొ చూశాం.
అయితే, ఈ రొజు భారతదేశ లౌకికవాదాన్ని భ్రష్టు పట్టించేవిధంగా మన పాలకులు వ్యవహరిస్తున్నారు. లౌకికవాదాన్ని రాజ్యాంగంలోనుండి తొలగించాలని మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా మత మౌఢ్యాన్ని, కుల ఛాందస భావాలను పాలకపార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వపరంగా మత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
అందుకు ఎన్నోఉదాహరణాలు చెప్పుకోవచ్చు. ప్రధాని మొదలుకొని ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఐఏఎస్ లు దొంగబాబాల చుట్టూ, అమ్మల ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ, గేట్ల దగ్గర కాపలా కాస్తున్న పరిస్తితి చూస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు లేనివిధంగా ప్రజలను మూఢులుగా చేస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనను అపహాస్యం చేసేవిధంగా వ్యవహరిస్తున్నారు. విదేశీ శక్తులకంటే కూడా మతోన్మాదం చాలా ప్రమాదకరం. శాస్త్రీయ విఙ్ఞానం ద్వారా కనిపెట్టబడిన టీవీలలో అజ్ఞానంతో కూడిన ప్రసారాలు వస్తున్నాయి.
రంగురాళ్ళు మీజీవితాలని మారుస్తాయి, రుద్రాక్షలు వేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లొ తాండవిస్తుంది, సంఖ్యాశాస్త్రం పేరుతొ పేరు మార్చుకుంటే అదృష్టం మారుతుంది, అడ్డమైన బాబాసూక్తులు ప్రజలను ఆలోచించకుండా చేస్తున్నాయి. ఆలాగే వాస్తూ, జ్యోతిష్యం పేరుతొ మనిషిని తమ శక్తి సామర్ధ్యాలు ఏమిటో తెలుకొనీయకుండా చేస్తున్నాయి. ప్రభత్వాధినేతలే ఫీఠాధిపతులకు సాష్టాంగపడుతుంటే, ఇక సామాన్యుడు ఏమిఅలోచిస్తాడు?
ఈతీరు మారాలి. రాకెట్ ను పైకిపంపె ఇస్రో చైర్మన్ చెంగాలమ్మకి దణ్ణంపెట్టిగాని పైకిపంపటంలేదు . కారణం శాస్త్రీయ దృక్పధం లేకపోవటమే. ప్రతిఒక్కరిలో శాస్త్రీయ దృక్పథం పెరగాలంటే, ప్రాధమిక విద్య నుండి విద్యార్థులకు శాస్త్రీయ విద్యను అందించాలి. కులమతాలకు అతీతంగా, మూఢ నమ్మకాలకు అతీతంగా, పుక్కిటిపురాణాలకు అతీతంగా, మహిమలు మాయలు, అతీంద్రీయ శక్తులకు అతీతంగా విద్యను విద్యార్థులకు అందించాలి. అపుడే శాస్త్రీయ విద్యార్థి తయారవుతాడు. సమాజాన్ని శాస్త్రీయంగా ముందుకు తీసుకపోతాడు. ప్రభుత్వం ఆవిధంగా ఆలోచించాలి.
నార్నెవెంకటసుబ్బయ్య