- నందిగ్రామ్ లో పోలింగ్ సందర్భంగా 144 సెక్షన్
- పరుపు నిలబెట్టుకునేందుకు మమత, సువేందు పాట్లు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో దశలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ సహా మొత్తం 30 నియోజకవర్గాల్లో గురువారం (ఏప్రిల్ 1) ఉదయం పోలింగ్ జరగనుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. రెండో దశలో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలన్నీ దక్షిణ 24 పరగణాలు, బంకురా, మేదినీపూర్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అందరిచూపూ నందిగ్రామ్‌పైనే నెలకొంది.
రెండో దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్లో మార్మోగుతున్న నియోజకవర్గం నందిగ్రామ్. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే నందిగ్రామ్ ఒక ఎత్తు. ఈ ఎన్నికల్లో ఉత్కంఠ పోరుకు తెరలేపిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి రెండో దశలో భాగంగా రేపు (ఏప్రిల్ 1) పోలింగ్ జరగనుంది. నందిగ్రామ్ నుంచి తృణమూల్ తరఫున సీఎం మమతా బెనర్జీ, గతంలో ఆమెకు అన్నింటా అండగా ఉన్న సువేందు అధికారి బీజేపీ తరపున పోటీపడనుండటంతో నందిగ్రామ్ ఎన్నిక ఆసక్తిగా మారింది. మమత తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకొని ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీచేయడం ఒక ఎత్తయితే ఆ ప్రాంత రాజకీయాలపై సువేందు కుటుంబానికి మంచి పట్టుంది. విజయం సాధించేందుకు రెండు పార్టీలూ తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నందిగ్రామ్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నందిగ్రామ్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
Also Read: పశ్చిమ బెంగాల్లో 79.79%, అసోంలో 72% పోలింగ్ నమోదు
నందిగ్రామ్ లో 144 సెక్షన్:
ప్రజలు భయం లేకుండా ఓటు వేసేందుకే 144 సెక్షన్ విధించినట్లు ఈసీ తెలిపింది. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. శుక్రవారం అర్థరాత్రి వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. పోలింగ్ పూర్తయ్యే వరకు నందిగ్రామ్ ఓటరు కాని ఏ వ్యక్తినీ నియోజరవర్గంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడరాదని ఈసీ ఆదేశించింది. హెలికాప్టర్లతోనూ నిఘా పెంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ దృష్ట్యా ఈ నియోజకవర్గంలో 22 కంపెనీల కేంద్ర బలగాలు పహరా కాస్తున్నాయి. వీరితో పాటు రాష్ట్ర పోలీసులు కూడా భారీగా మోహరించారు. నియోజకవర్గానికి వచ్చే అన్ని వాహనాలను అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అలర్లకు పాల్పడేందుకు ప్రయత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రెండో దశ ఎన్నికలు జరగనున్న 30 నియోజకవర్గాల్లో మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 152మంది పురుషులు కాగా 19మంది మహిళా అభ్యర్థులు. నందిగ్రామ్ నుంచి సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో నిలవగా.. లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా మీనాక్షి ముఖర్జీ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మార్చి 27న తొలి విడతలో 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా గురువారం మరో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
అసోంలో రెండో దశ ఎన్నికలు:
అసోంలోనూ రేపు రెండో విడత ఎన్నికలు 39 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. మొత్తం 126 స్థానాలు ఉన్న అసోంలో ఎన్నికల సంఘం ఈసారి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. తొలి విడతలో భాగంగా మార్చి 27న 47 స్థానాలకు ఎన్నిక ఎన్నికలు జరగ్గా రేపు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న మరో 40 స్థానాల్లో మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టనున్నారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ద్వంద్వ వైఖరి