Saturday, December 21, 2024

భారత్ జోడో న్యాయ్ యాత్ర అసలు యాత్ర కంటే ఎక్కువ విజయం నిశ్శబ్దంగా సాధించింది

జోడో యాత్ర 2.0 పట్ల మీడియా దృష్టి పెట్టకపోవడానికి కారణాలు తెలుసుకోవాలంటే కుట్ర సిద్ధాంతాలు వల్లించనక్కరలేదు. లోక్ సభ ఎన్నికలపైన దాని ప్రభావం బట్టి పరిశీలిస్తే మాత్రం అది జయప్రదంగా ముగిసింది.

యోగేంద్రయాదవ్

భారత జోడో న్యాయయాత్ర అంతకు పూర్వం ప్రసిద్ధిగాంచిన భారత్ జోడో యాత్ర  (బీజేవై)కంటే ఎక్కువ సాధించిందా? మార్చి 17న యాత్ర ముగిసిన తర్వాత బొంబాయి నుంచి తిరిగి వస్తూ ఈ  ప్రశ్నను నాకు నేను వేసుకున్నాను. బీజేవై పైన దిలీప్ డిసౌజా రాసిన ట్రావెలగ్ ‘రోడ్ వాకర్: భారత జోడో యాత్రలో కొన్ని మైళ్ళు’ నా ప్రయాణంలో నా వెంట ఉన్నది.

ఈ ప్రశ్న అంత ఆసక్తి కలిగించేది కాదు, బీజేఎన్ వై, రెండో విడత యాత్ర, అంతగా ప్రజల దృష్టిని ఆకర్షించలేదు. మొదటి యాత్ర జయప్రదం కావడానికి దోహదం చేసిన కారణాలలో చాలా రెండవ యాత్రలో కూడా ఉన్నాయి. రాహుల్ గాంధీ మొత్తం 6,700 కిలోమీటర్ల పొడవునా స్థానిక, రాష్ట్రస్థాయి, జాతీయ నాయకుల మధ్య యాత్ర సాగించారు. బాగా ఆకర్షించిన ప్రదర్శనలు మధ్యమధ్యలో ఉన్నాయి. ముంబయ్ శివాజీపార్ట్ లో ‘న్యాయమంజిల్’ దగ్గర ఇండియా కూటమి ఆధ్వర్యంలో  బ్రహ్మాండమైన బహిరంగసభతో యాత్ర ముగిసింది.
మొదటి యాత్రలొ లాగానే కొన్ని ఆవేపూరితమైన సన్నివేశాలు ఉన్నాయి. మణిపూర్ మహిళల మొహాలలో కనిపించిన ఆశాభావం నాకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇప్పటికీ గ్రామాలలో చెప్పులు  లేకుండా నడిచే దురాచారాన్ని పాటిస్తున్న ఒక దళిత మహిళకు మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లో రాహుల్ తన చెప్పులు ఇచ్చివేయడం మనసును కదిలించే సన్నివేశం. ప్రజలు ఆప్యాయంగా స్వాగతం చెబుతూ అక్కున చేర్చుకున్న సందర్భాలు, స్థానిక ప్రజలతో కొన్ని విషయాలపైన రాహుల్ లోతుగా చర్చించిన సమయాలు అద్భుతమైన వీడియోలలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా ఈ యాత్రను పట్టించుకోలేదు. ప్రత్నామ్నాయ మీడియా సైతం ఇదివరకటి యాత్ర  సందర్భంగా ప్రదర్శించిన ఉత్సాహం ఈ సారి చూపలేదు.  

Also read: నిరుద్యోగం ఇప్పుడు ఎన్నికల అంశం
మీడియా ఆసక్తి చూపకపోవడానికీ, దృష్టి సారించకపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి కుట్ర సిద్ధాంతాలు వల్లెవేయనక్కరలేదు. అసలు యాత్ర కంటే దాని పొడిగింపు ఆసక్తి కలిగించదు. మొదటి బీజేవై విజయం అసాధ్యమైన స్థాయికి అంచనాలను పెంచివేసింది. పైగా వాహనంలో చేసే యాత్ర పాదయాత్రతో సమానంకాదు. లోక్ సభ ఎన్నికలకు సమీపంలో రెండవ యాత్ర జరిగింది. అంతకు ముందు రాష్ట్రాలశాసనసభలకు జరిగిన ఎన్నికలలో ఫలితాలు అంత ఉత్సాహజనకంగా లేవు. అప్పటికే ఇండియా కూటమి ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ మాత్రమే యాత్ర నిర్వహించడం  ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇదంతా యాత్రకు అనుకూలమైన రాజకీయ వాతావరణం సృష్టించలేదు.

ఇటువంటి పరిస్థితులలో సాగిన యాత్ర గంగానదిలో దావానలం సృష్టించలేదు కానీ గణనీయమైన విజయాలు  సాధించింది.
భారత్ జోడో యాత్ర ఏమి సాధించింది?

అసలు బీజేవై సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ డిసౌజా మూడు అంశాలు చెబుతాడు. ‘‘మొదటిది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించేవారిని సవాలు చేయడడం, రెండవది ప్రజలు చెప్పేది సహనంతో సంపూర్ణంగా ఆలకించడం, వారి సమస్యలు, విద్య, ఆరోగ్య సమస్యలు. మహిళాసమస్యలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, తదితర అంశాలను ప్రజలు చెప్పుకుంటుంటే ఓపికగా వినడం. మూడవది, ప్రజలు ప్రస్తావించిన సమస్యలను కాంగ్రెస్ ఎట్లా పరిష్కరించాలనుకుంటున్నదో వివరించడం. దేశంకోసం కాంగ్రెస్ విజన్ ను ఎరుకపరచడం.’’ డీసౌజా తీర్పు ఏమంటే మొదటి రెండు అంశాలలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా తన పాత్ర పోషించింది. మూడో అంశంలో ఇంకా ఎక్కువ విషయం అవసరం. భారత దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించగోరేవారికి ఆశాభావం కలిగిస్తూ సంఘర్షణ కొనసాగించే శక్తి తమకు ఉన్నదని రాజకీయ నాయకత్వం ప్రజలకు విశ్వాసం కలిగించడంలో బీజేవై విజయం సాధించింది.
ఆ యాత్ర గురించి ఈ కాలమ్ లో రాశాను. అది మూడు విజయాలు సాధించిందని చెప్పాను. దేశానికి అది ఆశాభావం తెచ్చింది, కొత్త ప్రేమభావన. సరికొత్త భాష. తొత్తుల్లా ఉండే పెట్టుబడిదారుల పేర్లు బయటపెట్టడానికి సాహసించారు. కాంగ్రెస్ పార్టీకి ఆ యాత్ర మూలంగా పని వచ్చింది. దాని కార్యకర్తలకూ, నాయకులకూ ఆత్మవిశ్వాసం కలిగించింది. రాహుల్ గాంధీని ‘పప్పు’ అంటూ ఏద్దేవా చేయడం మాని సిరియస్ నాయకుడిగా పరిగణించడం ప్రారంభించారు. తాను అనువంశికంగా ఏ వారసత్వన్ని పొందాడో దాన్ని నిరూపించుకున్నాడు.  

ఈ యాత్ర జయాపజయాలను పాత యాత్రను పరిగణించిన తీరులో లెక్కించడం సరికాదు. అదే విధంగా వచ్చే ఎన్నికలపైన దాని ప్రభావాన్ని బట్టి తర్పు చెప్పడం కూడా సరికాదు. ఆ విషయానికి వస్తే అసలు చెప్పుకోవలసిన విషయం స్పష్టమే. ఏ యాత్ర అయినా ఢిల్లీలో సమావేశాలు నిర్వహించడం కంటే మెరుగైనదే. ప్రజల సమీకరణ గురించి ఆలోచిస్తే యాత్ర పొడవునా జనం బాగానే వచ్చారు.   ఇటీవలికాలంలో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ సాధించిన ఎన్నికల విజయాలతో పోల్చితే యాత్రలో పాల్గొన్న జనం అధికంగా వచ్చినట్టే. అయితే వీధిలో పాల్గొన్న జనసంఖ్య ప్రాతిపదికగా ఉత్సాహంగా యాత్ర జరిగిందని చెప్పడం సరికాదు. వీధి ప్రదర్శనలో కానీ రోడ్ షో లో కానీ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నంతమత్రాన వారు ఎన్నికలలో సదరు పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని అంచనా వేసుకోవడం పొరబాటు.

అదే విధంగా రాహుల్ ప్రయాణాన్ని (నెహ్రూ భారత ఆవిష్కరణ – డిస్కవరీ ఆఫ్ ఇండియా- పోలిన రాహుల్ యాత్ర ఇంకో అడుగు ముందుకు సాగింది. నిజజీవితంలో నిత్యకృత్యం ఎదురయ్యే సమస్యలను ప్రజలతో చర్చించి వారితో సంబంధాన్ని మరింత దృఢపరచుకున్నారు. బహిరంగ ప్రసంగాలలో తనదైన  పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలతో సంభాషణ చేసినట్టు ప్రసంగాలు ఉంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొట్టే ప్రసంగాల కంటే భిన్నంగా ఉంటున్నాయి.

Also read: రైతు ఉద్యమం ఫలితంగా ఎంఎస్ పీపై చర్చ ‘ఎందుకు’ నుంచి ‘ఎట్లా’కు మారింది. చివరి గమ్యం ‘ఎప్పుడు’ అన్నది

ఇదంతా రాజకీయ పరిశీలకులకు అసక్తి కలిగించే విషయం. కానీ రాహుల్ యాత్రను అంచనా వేయడానికి ఇవి సరైన కొలబద్దలు కాజాలవు. మొదటి భారత జోడో యాత్ర ను అంచనా వేసిన అంశాలతో ఈ యాత్రను సైతం అంచనావేయాలన్న ఉబలాటాన్ని అణచుకోవాలి.
బీజేవై 2.0 నిజమైన విజయం

యాత్ర బీజేపీ-ఆరెస్సెస్ పెత్తనాన్ని  సవాలు చేయడానికి ఉద్దేశించిందని బీజేఎన్ వై ప్రారంభమైనప్పుడు ఈ కాలమ్ లో రాశాను. ‘‘ఆలోచనలకోసం సాగే యుద్ధంలో ప్రతిపక్షాలు గెలవాలి, కొత్త తరం పౌరులకు కొత్త భాషలో రాజ్యాంగ విలువల గురించి తెలియజెప్పాలి. జాతీయభావాన్ని వారు మళ్ళీ ప్రోదిచేసుకోవాలి. సాంస్కృతిక వారసత్వంలో అత్యుత్తమమైన అంశాలను వారు హృదయగతం చేసుకోవాలి. మన  రిపబ్లిక్ ను తిరిగి పొందాలనుకునేవారు మన సైద్ధాంతిక దృశ్యం యావత్తూ పట్టుకోవాలి.’’ ఇది ఒక రోజులో సాధ్యం కాదు. అద్భుతాలు ఆశించరాదు. కానీ ఎవరో ఒకరు దీన్ని మొదలుపెట్టాలి. ఆక్రమిత స్వభావాన్ని అనేకవిధాలుగా ప్రశ్నించే తత్త్వాన్ని విస్తృతం చేసిన యాత్రగా దీని విజయాన్ని చూడాలి.

భారతీయ జనతాపార్టీ మెజారిటేరియన్ విధానాలకు వెనకగా నిలవాల్సిన పరిస్థితికి నెట్టబడిన ప్రతిపక్షాలు బలహీనంగా వ్యవహరిస్తున్న దశలో మతం నుంచి రాజకీయ దూరం పాటించడం ద్వారా రాజ్యాంగ విలువలను పాటించడం ఎట్లాగో ఈ యాత్ర వివరించింది. ప్రధానంగా అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన విషయంలో అధికారపార్టీ కావాలని చేస్తున్న హడావిడి కారణంగా ఇది అవసరం. తన మతవిశ్వాసాలను వదులుకోకుండా రాహుల్ గాంధీ లౌకికవిధానాలకు అండగా ఎట్లా నిలబడాలో నిరూపించారు.

న్యాయంకోసం కట్టుబడి ఉంటామని చెబుతూన మహబ్బత్ అనే ప్రేమానురాగాలు వర్థిల్లడాని కి అవసరమైన వాతావరణం సృష్టించడం గురించి యాత్ర మాట్లాడింది.
రెండవది అన్యాయానికి బలైనవారిని గుర్తించి దర్ద్ కా రిస్టాతో సహజీవన సౌందర్యాన్ని అనుసంధానం చేయడం యాత్ర సందేశాలలో ఒకటి. అన్యాయంలొనే విద్వేషరాజకీయాల పుట్టుక ఉన్నదని సందేశం. ఈ యాత్ర రాజ్యహింసకు గురైనవారితోనూ, కుల హింసకు గురైనవారితోనూ, లింగవివక్షకు గురైనవారితోనూ, ప్రాంతీయ నిర్లక్ష్యానికి గురైనవారితోనూ, ఆర్థిక అసమానత్వాలకు గురైనవారితోనూ, ఇతర వివక్షలకు గురైనవారితోనూ మట్లాడి వారి బాధను అర్థం చేసుకొని వారికి సానుభూతి ప్రకటించింది. మొదటి యాత్రా తొత్తులైన పెట్టుబడిదారుల విషయం బహిరంగంగా మాట్లాడటానికి ప్రజలను ప్రోత్సహిస్తే రెండో యాత్రలో ఆర్థిక అసమానతలపైన దండోరా మోగించారు.  
మూడోది, న్యాయం గురించి ఊకదంపుడు ఉపన్యాసాల స్థాయిని మించి ఈ యాత్ర స్పందించింది. అయిదు సామాజిక వర్గాల (యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడినవర్గాలు) గురించి మాట్లాడుతూ న్యాయం ఏ విధంగా చేయబోతోందో చెప్పింది. ప్రతి వర్గానికీ ఒక గ్యారంటీ ఇచ్చింది. ఉదాహరణకు లీగల్ కనీస మద్దతు ధర (ఎంఎస్ఫీ), ఒక సంవత్సరం వేతనంతో కూడిన అప్రెంటిస్ షిప్, ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, కులగణన, పట్టణ ఉద్యోగ హామీ వంటివి కొంతకాలంపాటు జాతీయ అజెండాలో భాగాలవుతాయి. బీజేపీ ఇప్పటికే కొన్ని డిమాండ్లను గుర్తించి అమలు చేయక తప్పలేదు. ఈ అజెండాను తొసిరాజనం అంత తేలిక కాదు కనుక బీజేపీ మరిన్ని డిమాండ్లను చేపట్టబోతున్నది.
చివరిగా, దేశ ప్రధాన ప్రతిపక్షాన్ని తన సామాజిక స్థావరం- భారత సామాజికార్థిక పిరమిడ్ అడుగు భాగం- వైపు నడిపించింది. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. సామాజిక పునాదిని తిరిగి కైవసం చేసుకోవడం అంత తేలిక కాదు. సంస్థాగతమైన పునర్నిర్మాణం, వివిద నాయక శ్రేణుల పునర్నియామకం అవసరం. అదే విధంగా ఇందులోని రిస్కును తగిన విధంగా అంచనావేయాలి. సమాజంలో అన్నీ ఉన్నవాళ్ళు దెబ్బకొట్టినంత వేగంగా బడుగులు సమీకరించుకొని ఒక శక్తిగా వ్యవహరించలేరు. కానీ మనం జీవిస్తున్న సమాజంలో ఆధిపత్య వ్యతిరేక రాజకీయాల నిర్మాణానికి మరో దారి లేదు. భారత్ జోడో న్యాయ యాత్ర ఈ ప్రయాణం ప్రారంభించింది.

Also read: శివాజీలాగా రాహుల్ గాంధీ కూడా ఒక చివరి నుంచి నరుక్కొస్తున్నాడు. అది చిన్నాచితకా రాజకీయమా?

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles