రిచర్డ్స్ బ్రాన్సన్ తో పాటు అంతరిక్షంలోకి వెళ్ళేవారిలో ఒక తెలుగు యువతి ఉన్నది. ఆమె పేరు శిరీష బండ్ల. డాక్టర్ మురళీధర్ బండ్ల, అనూరాథ బండ్ల దంపతుల కుమార్తె. అమెజాన్ అధినేత జెఫ్ బికాస్ కంటే ముందే తాను అంతరిక్షయానం చేయబోతున్నట్టు వర్జిన్ గెలాక్టిక్స్ కంపెనీ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటించారు. ఆ సంపన్నుడితో కలిసి అయిదుగురు అంతరిక్షయానం చేయబోతున్నారు. వారిలో ఒకరు శిరీష. బ్రాన్సన్ కంపెనీలోనే ప్రభుత్వ వ్యవహారాల విభాగం అధిపతిగా, పరిశోధనల బాధ్యురాలిగా శిరీష పని చేస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్స్ లో శిరీష 2015లో చేరారు. వర్జిన్ ఆర్బిట్ వాషింగ్టన్ వ్యవహారాలను ఆమె సమర్థంగా పర్యవేక్షిస్తూ ప్రమోషన్లు సంపాదించారు.
గుంటూరులో జన్మించిన శిరీష అంతరిక్షయానం చేయబోతున్న రెండో భారతీయ మహిళ. మొదటి మహిళ కల్పనా చావ్లా కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో చనిపోయారు. 747 విమానంతో అంతరిక్ష ఉపగ్రహాన్ని తయారు చేసిన వర్జిన్ ఆర్బిట్ వ్యవహారాలను కూడా శిరీష చూసుకుంటున్నారు. ఆమె జార్జిటౌన్ యూనివర్శిటీలో మేనేజ్ మెంట్ లో ఎంఎస్ చేశారు.
‘‘ఆమెను చూసి మేము గర్వపడుతున్నాం. విశేషం ఏమంటే బిలియనీర్ బ్రాన్సన్ కు ఆమె చాలా దగ్గర. వారు క్షేమంగా అంతరిక్షానికి వెళ్ళిరావాలని ఆకాంక్షిస్తున్నాం,’’ అని శిరీష సమీప బంధువు కన్నెగంటి రామారావు ‘ఇండియా టుడే’తో అన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కార్యక్రమాలలో శిరీష చురుకుగా పాల్గొంటారు. కంపెనీకి ఆమె ఉపాధ్యక్షురాలు. కొన్నేళ్ళ క్రితం యూత్ స్టార్ అవార్డుతో శిరీషని తానా సత్కరించింది.
రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన తొలి భారతీయుడు. ఇండియన్ అమెరికన్ సునీతా విలియమ్స్ అంతరిక్షానికి వెళ్ళి రాకేశ్ శర్మ లాగే జయప్రదంగా భూమిపైకి వచ్చారు. వీఎస్ఎస్ యూనిటీ అనే వ్యోమనౌకలో జులై 11న అంతరిక్షంలోకి ప్రయాణం ఉంటుందనీ, అందులో తమ యజమానితో పాటు మరి అయిదుగురు ఉంటారనీ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
నేను చిన్నతనం నుంచీ అంతరిక్షంలో ప్రయాణం చేయాలని కలలు కన్నాను. నేను హూస్టన్ లో పెరిగాను. అక్కడ జాన్సన్ స్పేస్ సెంటర్ ఉంది. అక్కడి నుంచి చాలాసార్లు క్షేత్రపర్యటనలు చేశాం. అంతరిక్షం ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు తెలుసు,’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా చేరి తర్వాత నాసాలో చేరిపోవాలని అనుకున్నారు. అది కంటి చూపు లోపం కారణంగా అది కుదరలేదు.