కరోనా వైరస్ విరుగుడు దిశగా ప్రారంభించిన చర్యలలో రెండవ డోస్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అత్యంత కీలకమైన వ్యాక్సినేషన్ లో పురోగతి సాధించడం శుభ పరిణామం. కరోనా వైరస్ కబంధ హస్తాల నుంచి దేశం మెల్లగా బయటకు వస్తోంది. గత నెల 16వ తేదీన తొలి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొట్ట తొలిగా ఇచ్చారు. 28 రోజుల తర్వాత రెండవ డోస్ ఇస్తామని అప్పుడే ప్రకటించారు.
ప్రకటించినట్లుగానే రెండవ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. తొలి డోస్ ప్రక్రియలో అక్కడక్కడా కొన్ని మరణాలు సంభవించాయి. కొందరిపై దుష్ప్రభావాలు చూపించాయి. సంఖ్యాపరంగా చూస్తే వికటించిన ఘటనలు చాలా తక్కువేనని చెప్పాలి. ఏ కొత్త వ్యాక్సినేషన్ వచ్చినా, కొత్తల్లో కొందరికి వికటించటం సర్వసాధారణమైన విషయమే. అయితే, కరోనా వ్యాక్సిన్ రూపకల్పన, పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియలు అసాధారణ పద్ధతుల్లో జరిగాయి.
Also Read : లాక్ డౌన్ అవస్థలు…చులకన అవుతున్న పురుష పుంగవులు
ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే, ఎన్నో సంవత్సరాల సమయం పట్టేది. ఇది గత చరిత్ర. నేడు కరోనా వ్యాక్సిన్లు అత్యంత స్వల్పకాలంలోనే అందుబాటులోకి వచ్చాయి. దీన్ని ఒక చారిత్రక సందర్భంగా చూడాలి. రెండవ డోస్ ప్రక్రియ కూడ ప్రారంభం కావడం గొప్ప సందర్భం. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకముందే భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ను వినియోగించడంపై ఎన్నో సందేహాలు, మరెన్నో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇండియాలో అందుబాటులోకి తెచ్చిన ఫైజర్, భారత్ బయోటెక్ కంపెనీలు ప్రారంభంలో నాణ్యత విషయంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకొని అలజడి సృష్టించారు. దీనితో ప్రజలు వ్యాక్సిన్లపై భయాందోళనలకు గురయ్యారు. తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగి, వారి వివాదాలను సద్దుమణిగేలా చేసింది. ఇంకా అనేక కంపెనీలు తయారీలో తలమునకలై ఉన్నాయి. త్వరలో బహు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
Also Read : కరోనా ప్రపంచానికి నేర్పిన సంస్కారం మన నమస్కారం
కరోనా వైరస్ ఇప్పటికే అనేక మార్పులకు గురిఅయ్యింది. కొత్త వైరస్ లు విజృంభిస్తూ, సెకండ్ వేవ్ నడుస్తున్నా, ప్రమాదకర పరిణామాలు సంభవించక పోవడం సంతోషించాల్సిన అంశం. లాక్ డౌన్ వల్ల పలు నష్టాలు, కష్టాలు వచ్చినా, కరోనా కట్టడిలో మంచి ఫలితాలే వచ్చాయాని భావించాలి. లాక్ డౌన్ నిబంధనలను వివిధ దశల్లో సడలించు కుంటూ వచ్చారు. ఈ క్రమంలో ప్రజల క్రమశిక్షణా రాహిత్యం వల్ల వైరస్ వ్యాప్తి పెరిగింది. అయినప్పటికీ, కాలక్రమంలో వైరస్ తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా రోజువారీ కొత్త కేసులు, మరణాల సంఖ్య బాగా తగ్గింది.కేరళ, మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంది.
ప్రస్తుతం, మరణాల సంఖ్యలోనూ మహారాష్ట్ర, కేరళ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండడం కలచివేసే అంశం. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే, పాజిటివ్ కేసులు -1.08 కోట్లు నమోదయ్యాయి. మరణాల సంఖ్య -1,55,550 ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి 97.32 శాతం మంది రికవరీ అయ్యారు. ఈ తీరుపై డబ్ల్యూ హెచ్ ఓ మొదలు వివిధ దేశాలు భారతదేశం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. మన దేశంలోని వాతావరణం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, జన్యు వ్యవస్థ మనల్ని రక్షించాయని చెప్పాలి. వాతావరణం సహా ఈ అంశాలు గతంలో కంటే మన దగ్గర ఎన్నోరెట్లు పాడైపోయినా, మనల్ని చాలా వరకూ రక్షించాయి.
Also Read : వ్యాక్సినేషన్-వైరస్ లో మార్పులు
యోగ సాధన, ధ్యానం మనసుపై, ఆలోచనలపై గొప్ప ముద్రను వేస్తాయి. శారీరక ఆరోగ్యంపై మానసిక ఆరోగ్యం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యశాస్త్రం కూడా చెబుతోంది. వ్యాయామం, ఆహారం, నిద్ర ప్రభావం కూడా చాలా కీలకమని వైద్యులు చెబుతూనే ఉన్నారు. సంగీతం, సాహిత్యం, కళలు కూడా ఆరోగ్యప్రదాయినులే. వీటన్నింటినీ మేళవించుకొని సాగితే శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాలు అద్భుతంగా ఉంటాయని పెద్దలు చెబుతున్న మాటలను ఆచరిద్దాం. కరోనా ఇంకా పూర్తిగా మన దేశం నుంచి పోలేదు, అన్న స్పృహలో ఉండడం చాలా ముఖ్యం.
మాస్కులను ధరించడంలో కొంత క్రమశిక్షణ పాటిస్తున్నా, భౌతికదూరం పాటించడంలోనూ, ఆహారపరమైన అంశాల్లోనూ క్రమశిక్షణ లోపిస్తోంది. ఎయిర్ పోర్ట్ లో నిబంధనలు కొంత మేరకు సాగుతున్నా, విమానంలో భౌతికదూరం పాటించే పరిస్థితులను ఆయా విమానయాన సంస్థలు కల్పించడం లేదు. విమానాలు కిక్కిరిసిగా ఉంటున్నాయి. సీట్ల మధ్య భౌతికదూరం అనే అంశాన్ని తుంగలో తొక్కేసారు. మాస్కులు, రక్షణా దుస్తులతో సరిపెడుతున్నారు. వాళ్ళ వ్యాపారం కోసం ప్రజలను రిస్క్ లో పెడుతున్నట్లుగానే భావించాలి. సినిమా హళ్ళల్లో సైతం 100% సిటింగ్ కు అనుమతి ఇవ్వడం కూడా అంత శ్రేయస్కరమైన అంశం కాదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం ఫ్రంట్ లైన్ సిబ్బందికే అందుబాటులోకి వచ్చింది.
Also Read : పొరుగు దేశాలకు ప్రారంభమైన టీకాల ఎగుమతి
మిగిలినవారికి కూడా మార్చిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినవస్తున్నాయి. దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్ రెండు డోస్ ల ప్రక్రియ పూర్తవ్వాలి. వ్యాక్సిన్లు ఎటువంటి సత్ఫలితాలను ఇస్తున్నాయో తేలాలి. మిగిలిన దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో గ్రహించాలి. వీటన్నింటిలో మంచి పరిణామాలు వచ్చేంత వరకూ కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. మెల్ బోర్న్ వంటి కొన్ని దేశాల్లో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని సమాచారం. కొన్ని దేశాల్లో లాక్ డౌన్ పాక్షికంగా అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ పూర్తిగా కట్టడిలోకి వచ్చేంత వరకూ వ్యక్తి స్థాయి నుంచి వ్యవస్థల వరకూ అప్రమత్తంగా ఉండడం జాతికి అవసరమని భావిద్దాం.
Also Read : భారత్ లో ప్రారంభమైన టీకా పంపిణీ