- ఏపీలో ఎస్ఈసీ, ప్రభుత్వానికి మధ్య ముదురుతున్న వివాదం
- అధికారుల వీడియో కాన్ఫరెన్స్ కు అనుమతిన ఇవ్వని ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికీ ఎన్నికల సంఘానికీ మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ రాశారు. కలెక్టర్లు జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు గురించి అందులో ప్రస్తావించినట్లు సమాచారం. ఎస్ఈసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. వీడియో కాన్పరెన్స్ లో పాల్గొనేందుకు కలెక్టర్లు ఉన్నాతాధికారులకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. రెండోసారి కూడా వీడియో కాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు చేయగా ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు.
కోర్టుకు వెళ్లే యోచనలో నిమ్మగడ్డ
అయితే ఈ వ్యవహారంపై నిమ్మగడ్డ మరోసారి కోర్టు కెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసినా స్పందించలేదని కోర్టుకు విన్నవించనున్నట్లు తెలుస్తోంది.
కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు
ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు, వీడియో టేపులను గవర్నర్ కు పంపారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని అయినా ఉద్యోగులను ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో స్పష్టం చేశారు.