- మున్పిపల్ పోరుకు తొలగిన అడ్డంకి
- ప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్న నిమ్మగడ్డ
- గతంలో ఆగిన చోటనుంచే ఎన్నికల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంగి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు ఈ రోజు (ఫిబ్రవరి 26) కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడిచిపోయినందున కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో నామినేషన్లు వేసే వారిని అధికార పార్టీ నేతలు దౌర్జన్యంతో అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు. అయితే వాదనలు విన్న ధర్మాసనం పిటీషనర్ల వాదనలతో ఏకీభవించలేదు. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో యథావిధిగా మార్చి 10న పోలింగ్ మార్చి 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: స్టీల్ ప్లాంట్ భూములు అమ్మవద్దు: ఈఏఎస్ శర్మ
పాత నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చన హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయించారు. రేపటి (ఫిబ్రవరి 27) నుంచి మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాలత్లో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రతల్లపై ఎస్‌ఈసీ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించనున్నారు.
సీమలో తొలి ప్రాంతీయ సమావేశం:
రేపు ఉదయం తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల అధికారులతో తొలి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 5.30 వరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఐదు జిల్లాల్లో గుర్తింపు, రిజిస్ట్రేషన్ పొందిన రాజకీయ పార్టీల నేతలతో ఎస్‌ఈసీ భేటీ అవుతారు.
Also Read: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
విజయవాడలో రెండో సమావేశం :
ఈనెల (ఫిబ్రవరి) 28న విజయవాడ ఎస్ఈసీ కార్యాలయంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు నాలుగు జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతారు.
వైజాగ్ లో మూడో సమావేశం:
మార్చి 1న విశాఖపట్నం లో మూడో ప్రాంతీయ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. ఈ భేటీలో తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం 3.15గంటల నుంచి 5.30 వరకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం 6గంటలకు నాలుగు జిల్లాల్లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ సమావేశమవుతారు.
Also Read: కుప్పంలో ఘోర ఓటమి-తమ్ముళ్లకు ధైర్యం నూరి పోస్తున్న చంద్రబాబు
భద్రతా ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్ష:
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత, నిఘా ఏర్పాటు, మద్యం సరఫరా నియంత్రణ, ఓటరు స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలివ్వనున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ, కొవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటు హక్కు వినియోగం కోసం ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈమేరకు రీజినల్ సమావేశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.