- మంత్రుల వ్యాఖ్యలతో మసకబారుతున్న ప్రభుత్వ పరువు
- సభలు, సమావేశాలు నిర్వహించరాదన్న ఎస్ఈసీ
- మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని సూచన
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలు ప్రభుత్వ పరువును మంట గలుపుతున్నాయి. ప్రజల సంక్షేమం కోసం విశాల హృదయంతో అన్ని వర్గాల ప్రజలకు అందేవిధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే ఆవేశంలో విచక్షణ కోల్పోయి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సీఎం ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి.
నోటి దురుసు తెచ్చిన తంటా :
పెద్దిరెడ్డి ఘటన మరువకముందే కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఎన్నికల సంఘం కొరడా ఝలిపించింది. ఈ నెల (ఫిబ్రవరి) 13న రెండో విడత ఎన్నికలు ముగిసేవరకు మీడియా సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. సభలు, ప్రచారాల్లో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జోగి రమేశ్ అభ్యర్ధులు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఎమ్మెల్యేపై మూడు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని ఎస్ఈసీ తెలిపారు. ఈ నెల 10న కృత్తివెన్ను మండలం నీలిపూడిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. వీడియో క్లిప్పింగులను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జారీ చేసిన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఎస్ఈసీ వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం, ఎన్నికల సంఘం “ఢీ” అంటే “ఢీ”
మాకు అడ్డొస్తే పథకాలు కట్ చేస్తాం-జోగి
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వచ్చాయి. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. అమ్మఒడి, పెన్షన్లు, కాపునేస్తంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని జోగి రమేశ్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో ఎస్ఈసీ చర్యలు తీసుకుంది. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ చర్యలు తీసుకుంది. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.
ఇదీ చదవండి:మంత్రుల దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్