వోలేటి దివాకర్
ఎట్టకేలకు సీనియర్ తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పంతంపట్టి మరీ రాజమహేంద్రవరం రూరల్ సీటు సాధించుకున్నారు. సిట్టింగ్‌లకే సీట్లు అని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారని, సిట్టింగ్ ఎమ్మెల్యేగా రూరల్ సీటు తనదేనని గోరంట్ల ముందు నుంచి తెగేసి చెబుతూ వచ్చారు. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు బుజ్జగించినా…జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా తమ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు సీటు కేటాయించనున్నట్లు ప్రకటించినా… గోరంట్ల వెనక్కి తగ్గలేదు. పైపెచ్చు దుర్గేష్‌కు సీటు కేటాయించినట్లు వచ్చిన వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కూడా ఇవ్వడం గమనార్హం. చివరకు అనుకున్నది సాధించారు. పొత్తు విచ్ఛిన్నమయ్యే పరిస్థితుల్లో కూడా టిడిపి అధినేత మాట కూడా వినకుండా గోరంట్ల అనుకున్నది సాధించుకున్నారు. దీన్ని బట్టి బాబును కూడా దారిలో పెట్టే గట్టి గాడ్‌ఫాదర్ ఎవరో గోరంట్ల వెనుక ఉన్నారని భావిస్తున్నారు.
Also read: గోరంట్ల తగ్గేదేలే….
దుర్గేష్ అసంతృప్తి
ఈ నేపథ్యంలో దుర్గేష్‌ను నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా టిడిపి అధినేత, జనసేనాని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిడదవోలు నుంచి పోటీకి దుర్గేష్ ఆసక్తి చూపించడం లేదు. మొదటి నుంచి రూరల్‌లో కేడర్ ఉన్న ఆయన నిడదవోలులో మళ్లీ మొదటి నుంచి రాజకీయాలు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అక్కడ కాపు సామాజిక వర్గీయులు రూరల్ కన్నా తక్కువగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నిడదవోలులో పోటీకి అదే వర్గానికి చెందిన గోరంట్లను పంపితేనే బాగుంటుందని దుర్గేష్‌తో పాటు, జనసేన కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు సీటు మార్పుపై దుర్గేష్ తో పాటు, జనసైనికులు కూడా తీవ్ర అసంతృప్తికీ, ఆగ్రహానికీ గురయ్యారు. గోరంట్ల, జనసేనాని, టిడిపి తీరుపై కాపులు తమదైన శైలిలో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో దుర్గేష్‌కే రాజమహేంద్రవరం రూరల్ సీటు కేటాయించాలంటూ నియోజకవర్గంలో మంగళవారం జనసైనికులు, కాపు సామాజిక వర్గీయులు భారీ పాదయాత్ర జరిపారు. పాదయాత్రకు పిలుపునిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే వేలాది మంది స్వచ్చందంగా పాల్గొనడం గమనార్హం.
Also read: ఇద్దరూ…ఇద్దరే…
స్వయంగా జనసేనానే సీటు ఖరారు చేసినా..జనసేన పార్టీలో తృతీయ స్థానంలో ఉన్న దుర్గేష్‌కే గతంలో ఆయన పోటీ చేసిన సీటే దక్కలేదంటే కూటమిలో సీట్ల సర్దుబాటు ఏవిధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చని కాపులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గేష్‌కు సీటు ఇప్పించుకోలేని పవన్ తీరును తప్పుపడుతున్నారు. కాపు సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్న రూరల్ నియోజవర్గాన్ని కాపులు సొంత నియోజకవర్గంగా భావిస్తారు. అలాంటి స్థానంలో దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తరువాత 15 ఏళ్లుగా ఓట్ల చీలిక వంటి కారణాల వల్ల కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవరూ ఎమ్మెల్యేగా గెలవలేదు. ఇప్పుడు దుర్గేష్‌కు అవకాశం వస్తే అడ్డుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
పట్టువదలని విక్రమార్కుడు
సీట్ల పంచాయితీ కారణంగా ఓట్ల బదిలీ జరగకపోతే పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టి మరీ సీటు సాధించుకున్న గోరంట్ల రూరల్‌లో సాధించేదేమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ ప్రభావం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గీయులు, జనసైనికులు ఇదే రీతిన ఆలోచిస్తే టిడిపి, జనసేన కూటమి మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు కూటమికే చేటు చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. బాబు అధికారంలోకి రాకుండా పరోక్షంగా అడ్డుకోవడం ద్వారా టిడిపి వ్యవస్థాపకుడు, తమ అభిమాన నేత పన్టీ రామారావు ఆత్మకు శాంతి చేకూర్చేందుకే గోరంట్ల ఈవిధంగా వ్యవహరిస్తున్నారేమోనని జనసైనికుడు పసుపులేటి కృష్ణ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also read: కాపుల ఆవేదన…కమ్మవారి ఆందోళన!