వోలేటి దివాకర్
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సీట్ల మార్పు పై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. సీట్లు మార్చడం అంత ఈజీ కాదని, ఇందుకు ఎంతో నేర్పు కావాలన్నారు. తెలంగాణా ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను మార్చకపోవడం వల్ల ఓటమిపాలైందని విశ్లే షించారు. శనివారం ఆయన విలేఖర్ల సమావే శంలో మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాంతరం ముఖ్యమంత్రి పదవి కోసం సోనియాగాంధీని కలిసినపుడు వైఎస్ జగన్ ముఖం ఎలా ఉందో సీట్లు మారిస్తే ఎమ్మెల్యేల ముఖాలు కూడా అలాగే ఉంటాయని వ్యాఖ్యానించారు. తెలంగాణా ఎన్నికల ఫలితాల ప్రభావం ఎపిలో కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎపిలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. నేటి పరిస్థితుల్లో నీతిగా రాజకీయాలు చేయడం వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. అందుకే జగన్ నేరుగా ప్రజలకే నగదు పంపిణీ పధకాలకు శ్రీకారం చుట్టారని, తాము అధికారంలోకి వస్తే నగదు పధకాలను రెట్టింపు చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు చెబుతున్నారన్నారు. నిజాయితీపరుడైన సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ప్రకటించిన ‘జై భారత్’ పార్టీ వల్ల ఏంతోకొంత ప్రభావం ఉంటుందని ఉండవల్లి విశ్లేషించారు. విశాఖపట్నం పరిధిలో గత ఎన్నికల్లో జన సేన అధినేత పవన్ కల్యాణ్ కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ ఓట్లు సాధించారని గుర్తుచేశారు.
Also read: రూరల్ సీటు నాదే…కాదంటారా?!
ఉండవల్లి నోటీసు స్వీకరించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టులో తన పిల్పై విచారణలో భాగంగా ప్రతివాదులందరికీ నోటీసు జారీ చేశారని ఉండవల్లి వెల్లడించారు. అయితే ఈ కేసులో జైలుకు వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మినహా ప్రతివాదులెవరూ నోటీసులు స్వీకరించలేదని చెప్పారు. గోపాలపురం నియోజకవ ర్గంలోని బీమోలులో పట్టాదారులు, కౌలుదారులకు మధ్య ఏర్పడిన వివాదంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు, ఇప్పుడు కూడా పట్టాదారులు, బాధితులు ఒకరేనని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక విచారణాధికారిని నియమించి, ఇరువర్గాలతో చర్చించి, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన భూహక్కు చట్టంలో ప్రభుత్వ రికార్డులే అంతిమమని, ప్రజలు న్యాయం కోసం స్థానిక కోర్టులను ఆశ్రయించే అవకాశాన్ని తొలగించడం దారుణమని, సామాన్య ప్రజలు హైకోర్టును ఆశ్రయించడం వ్యయప్రయాశలకు గురిచేస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. భూములు ఆన్లైన్లో నమోదు, యాజమాన్య హక్కుల మార్పు, తదితర వ్యవహారాల్లో సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి చెప్పినా లంచాలు ముట్టచెప్పాల్సిందేనన్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా చెట్లు నరికివేయడాన్ని నిరోధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం పర్యటన సందర్భంగా, ఇతరత్రా కారణాలతో ఎందుకు చెట్లు కొట్టివేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
Also read: అధికార పార్టీలో అంతా అయోమయం!
వైఎస్ దేవుడిగా భావించిన నెహ్రూను దూషించిన వైసిపి ఎంపి
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడిగా భావించిన మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూను ఆయన కుమారుడు జగన్ స్థాపించిన వైసీపీకి చెందిన ఎంపి విజయసాయిరెడ్డి దూషించడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విభజనపై జరిగిన చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి నెహ్రూను బిజెపి వారి కన్నా దారుణంగా దూషించారన్నారు. బిజెపిని మెప్పించేందుకు వైసిపి ఆపార్టీ విధానాలను సమర్థిస్తోందని, ఈ విధానం దేశానికి, రాష్ట్రానికి తీవ్ర అనర్థదాయకమని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి పేదల సంక్షేమ పథకాలకు మంగళం పలికి, పెద్దల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చే పెట్టుబడిదారీ పార్టీ అని విమర్శించారు. పార్లమెంటులో గలాభా సృష్టించిన వారికి విజిటర్స్ పాస్ జారీ చేసిన బిజెపి ఎంపిని ప్రశ్నించకుండా ఈవిషయమై ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన 150 మంది ఎంపిలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం దారుణమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిణామాలతో బిజెపి హయాంలో దేశం నియంతృత్వం వైపు సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: కమ్మవారంతా కలిస్తే….?