Monday, December 30, 2024

దైవంకోసం వెతుకులాట

My Confession

                           ————————-

                                               By Leo Tolstoy

                                               ————————-

                              నా సంజాయిషీ

                              ———————-

                                               లియో టాల్స్టాయ్        

            

                            —————————

తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                                  చాప్టర్ 12

                                  ————–

                      సహేతుక జ్ఞానంలో లోపం ఉందనే స్పృహ — పనీపాటా లేని అనవసరమైన తర్కాల నుంచి బయటపడడానికి నాకు సహకరించింది. సత్యం గురించిన జ్ఞానం — బ్రతికితే గాని కనబడదు అనే నమ్మకం  నా జీవితం యొక్క ధర్మం గురించి నాకు సందేహం ఏర్పరిచింది. నేను నా భిన్నత్వం నుండి బయటపడి, సామాన్య శ్రామికుల నిజజీవితాలను చూసి — అదే నిజమైన జీవితం అని అర్థం చేసుకున్నాను. జీవితం, దాని అర్థం తెలుసుకోవాలని కోరుకుంటే నేనొక పరాన్న జీవిగా బ్రతకకూడదు. నిజమైన జీవితం గడపాలి. దాన్ని(నిజమైన మానవ కోటి జీవితానికి ఇచ్చిన అర్థం తీసుకొని, దానిలో నన్ను నేను కలుపుకోవాలి) — ధ్రువీకరించుకోవాలి.

                       ఆ సమయంలో నాకిలా జరిగింది. ఉరి లేక బుల్లెట్ తో జీవితాన్ని అంతం చేసుకోకుండా ఉండాలా — అని ఆ సంవత్సరం అంతా ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. దాంతోపాటు నేను ఇది వరకే చెప్పిన ఆలోచనా స్రవంతి,  మరియు పరిశీలనతో ఆ సమయం అంతా నా హృదయం బాధాకరమైన, అణిచివేయబడిన  భావనతో ఉంది. దాన్ని నేను భగవంతుని కోసం వెతుకులాటగా చెప్పగలను.

Also read: అనర్థం, అరిష్టం మనిషి జీవితం!

                         భగవంతుని కోసం వెతుకులాట సహేతుకం కాదు. అది ఒక భావన మాత్రమే. ఎందుకంటే, ఆ వెతుకులాట నా ఆలోచనల నుంచి వచ్చింది కాదు (పైగా వాటికి విరుద్ధమైనది కూడా). హృదయంనుండి వెలువడింది. అది ఒక రకమైన భయము, దిక్కులేని తనము, ఒక అపరిచిత స్థలంలో ఒంటరిగా ఉన్న భావన, మరియు ఎవరినించో సాయం వస్తుందని ఆశతో ఉండడం లాంటిది.

                           దైవత్వం యొక్క ఉనికిని నిరూపించడం అసాధ్యమని నేను నమ్ముతున్నా గానీ- (కాంట్ చెప్పిన దాని ప్రకారం దానిని నిరూపించలేమని నేను అర్థం చేసుకున్నాను) నేను దేవుని కోసం వెతికాను. అతనిని నేను కనుగొనాలని ఆశించాను. పాత పద్ధతిలో ప్రార్థనలు చేశాను. అయినా గాని కనుగొనలేదు. నేను నా మనసులో కాంట్ మరియు స్కోపెన్ హైయర్ లా — దేవుని కనబడడం అసాధ్యమనే వాదనలను మళ్ళా తలుచు కున్నాను. వాటిని పరిశీలించడం మరియు ఖండించడం మొదలు పెట్టాను. హేతువు (కారణం) అనేది స్థల, కాలాదుల లాగా వర్గీకరణలో వచ్చే ఆలోచన కాదు. నేను ఉనికిలో ఉన్నానంటే దానికి ఒక కారణం ఉండి ఉండాలి. ఇంకా ఆ కారణాలకు మరొక కారణం ఉండాలి. అన్నిటికన్నా మొదటి కారణాన్ని మనుషులు ” దైవము ” అని పిలిచారు. నేను ఆలోచన దగ్గర ఆగిపోయి, ఆ కారణం యొక్క ఉనికిని కనుగొనటానికి నా శాయ శక్తులా ప్రయత్నించాను. నేను ఒక  ‘ శక్తి ‘ అధీనంలో ఉన్నానని గుర్తించిన వెంటనే, నేను జీవించవచ్చు అనే భావన నాకు కలిగింది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను: ఆ కారణం, ఆ శక్తి ఏమిటి? నేను దాని గురించి ఎలా ఆలోచించాలి? నేను ” దైవం ” అనుకునే దానితో నా సంబంధాలు ఎట్లా ఉండాలి? మామూలు సమాధానాలే నాకు తట్టాయి: ” ఆయన సృష్టించేవాడు మరియు సంరక్షించేవాడు.”  ఈ సమాధానం నన్ను సంతృప్తి పరచలేదు. నా జీవితానికి అవసరమైనదేదో కోల్పోతున్నాను అనే భావన నాకు కలిగింది. నేను భయపడిపోయాను. ఎవరైతే నాకు సాయం చేయాలనుకున్నానో ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టాను. నేను ప్రార్ధించిన కొద్దీ నాకు అర్థమైంది ఏమిటంటే, ఆయన నా ప్రార్థనలు వినలేదు. నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. నా హృదయంలో నిరాశతో దేవుడు లేడనే విషయం జీర్ణించుకోలేక నేను ఇలా అన్నాను:

“దేవుడా! నా మీద దయ ఉంచు! నన్ను కాపాడు! “

ఎవరూ దయ చూపలేదు. నా జీవితం నిలిచిపోసాగింది.

                      కానీ మరలా, మరలా అన్ని వైపుల నుండి ఆలోచించి “ఏ కారణం, హేతువు లేక అర్ధమూ — లేకుండా నేను ఈ లోకంలోకి వచ్చి ఉండను”అనే ముగింపుకే వచ్చాను: కొత్తగా రెక్కలు

వచ్చిన పక్షి తన గూడు నుంచి పడిపోయినట్లు పడిపోయానని అనుకోలేకపోయాను. (లేదా) మెత్తటి గడ్డి పై వెల్లకిలా పడుకుని ఏడ్చే అలాంటి ఒక పిల్ల పక్షి నైనా — నేనేడిచేది ఎందుకంటే — నన్ను ఒక తల్లి తనలో మోసి, పొదిగి, వెచ్చదనం, ఆహారం ఇచ్చి ప్రేమించిందని తెలియడం వల్ల. ఆమె (ఆ తల్లి) ఎక్కడ? ఒకవేళ నేను ఒంటరిగా వదిలివేయబడితే — నన్ను ఎవరు వదిలివేశారు? నన్ను ‘ఎవరో ఒకరు’ మోసి, ఆహారమిచ్చి, ప్రేమించారనే విషయం నా నుంచి నేను దాచ లేను. ఆ ‘ఒకరు’ ఎవరు? మరలా ‘దైవం’? అతనికి నా వెతుకులాటలు, నిరాశ, కష్టాలు తెలుసు. చూస్తున్నాడు.

Also read: శ్రమజీవుల జీవితాలే సార్థకం

                    “దేవుడున్నాడు” , నాకు నేను అనుకున్నాను. నేను ఒకే క్షణం అలా అనుకుంటే, నాలో నూతనోత్సాహం కలిగింది, ప్రాణం లేచి వచ్చినట్లయింది. కానీ, దేవుడి ఉనికిని ఒప్పుకున్న తర్వాత, నాతో అతని (దైవం) సంబంధం కోరుకున్నాను; మరలా నేను దేవుణ్ణి ఊహించాను

(మూడు కాలాల్లోనూ సృష్టికర్త; రక్షకుడిని మనకు పంపించిన వాడు) — మరలా ఆ దైవం ఈ లోకం నుండి, నా నుండి వేరుగా ఉన్నవాడు. మంచు ముద్దలా కరిగిపోయాడు. నా కళ్ళముందే

కరిగిపోయాడు. మరలా ఏమీ మిగలలేదు. జీవితంలో మరలా వసంతం ఎండిపోయింది. నేను నిరాశ పడ్డాను. ‘నన్ను నేను చంపుకోవటం తప్ప చేసేదేమీ లేదు’ అనిపించింది. అన్నిటికన్నా అధమం ఏమిటంటే — అది నేను చేయలేను అనిపించింది.

                    రెండు మూడు సార్లు కాదు, పదులు, వందలసార్లు ఈ పరిస్థితులను ఎదుర్కొన్నాను. మొదట ఆనందం, ఉత్సాహం — తర్వాత నిరాశ, జీవించడం అసాధ్యం అనే నిస్పృహ.

                    వసంతకాలం మొదట్లో అని నాకు గుర్తు: నేను అడవిలో చెట్ల మధ్య శబ్దాలు వింటూ ఒంటరిగా ఉన్నాను. ఆ శబ్దాలు వింటూ, ఇంతకుముందు మూడు సంవత్సరాలు ఆలోచించిన విషయమే మళ్ళీ ఆలోచించాను. అదేమిటంటే — మరలా నేను దైవాన్ని వెతుకుతున్నాను.

Also read: అందరం జ్ఞానం కలిగిన అవివేకులం

                     “మంచిది; దైవం లేడు” నాలో నేను అనుకున్నాను; “నా ఊహల్లో కాక నా నిజ జీవితం లాగా ఎవరూ లేరు. దేవుని ఉనికి లేదు. ఏ అద్భుతాలూ అతని ఉనికిని నిరూపించలేవు’’ (ఎందుకంటే — అద్భుతాలు నా ఊహ కావచ్చు. అవి హేతు విరుద్ధం కావచ్చు.)

                      “నేను కోరుకునే దైవం యొక్క అవగాహన నాకు ఎక్కడి నుంచి వచ్చింది?” అని

నన్ను నేనే అడిగాను. మరలా ఈ ఆలోచనతో ఆనందపుటలలు నాలో పెల్లుబికాయి. నా చుట్టూ ఉన్నదంతా ఉత్సాహభరితమైంది. ఒక అర్థం నా జీవితానికి కనబడింది. కానీ నా ఆనందం ఎక్కువసేపు ఉండలేదు. నా మనసు తన పని మానలేదు.

                     “దేవుడు అనే భావన దేవుడు కాదు”

అని నేననుకున్నాను. “భావన అనేది నా లోపల జరిగేది. భావనను నాకు నేను మనసులో తలుచుకోవచ్చు. దానికి దూరంగానూ ఉండవచ్చు. నేను కోరుకునేది అది కాదు. ఏది లేకపోతే జీవితం ఉండదో, దాన్ని నేను కోరుకుంటున్నాను.” మరలా నాలోను, నా చుట్టూరా అంతా నిర్జీవమైపోసాగింది.

మరలా నేను ఆత్మహత్య చేసుకోవాలని కోరుకున్నాను.

                       మరలా నేను నా మీద దృష్టి పెట్టాను. నాలో ఏం జరిగిందో తరచి చూసుకున్నాను. జీవితం ఆగిపోవడం, మరలా వందలసార్లు ఉత్సాహభరితమవడం గుర్తు తెచ్చుకున్నాను. దైవాన్ని నమ్మినప్పుడు నేను జీవించానని గుర్తు తెచ్చుకున్నాను. ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది; బ్రతకడానికి దేవుడున్నాడనే స్పృహ నాకు కావాలి. దైవాన్ని మరిచిపోయినా, నమ్మకపోయినా — నేను చచ్చిపోతాను.

                        జీవం కలిగి ఉండటం ఏమిటి? చనిపోవడం ఏమిటి? దైవం ఉనికి పట్ల నమ్మకం చెదిరితే నేను బ్రతకను. దేవుని కనుగొంటాననే చిరు ఆశ లేకపోతే — నన్ను నేను ఎప్పుడో అంతమొందించుకునేవాడిని. నేను నిజంగా బ్రతికేది– దేవుణ్ణి  భావించినప్పుడు, కోరుకున్నపుడూను!

 “నువ్వు ఇంకా ఏమి కోరుకుంటున్నావు?” —  నా లోపలి స్వరం పలికింది. “అదే దేవుడంటే. ఏది లేకపోతే ఎవరూ  బ్రతకలేరో అదే దేవుడు. దేవుణ్ణి తెలుసుకోవడం, బ్రతకడం  — రెండూ ఒకటే.” దేవుడే జీవితం.

                    “దేవుడిని అన్వేషిస్తూ బ్రతుకు. అపుడు దేవుడు లేకుండా నువ్వు బ్రతకవు.” ఇంతకుముందు కంటే ఎక్కువగా నాలోనూ, నా చుట్టూతా వెలుగు ప్రసరించింది. ఆ వెలుగు మరలా నన్ను వదిలి పోలేదు.

Also read: అహేతుక జ్ఞానమే విశ్వాసం

                       నేను ఆత్మహత్య నుండి రక్షింపబడ్డాను. ఎప్పుడు, ఎలా ఈ మార్పు జరిగిందో నేను చెప్పలేను. తెలియకుండా — ఇంతకు పూర్వం క్రమక్రమంగా నాలోని జీవశక్తి ఎలా నశించిపోయిందో, బ్రతకడం అసాధ్యం అనిపించిందో, జీవితం ఆగిపోయి నాకు ఆత్మహత్య ఆవశ్యకము అనిపించిందో — అంతే తెలియకుండా క్రమక్రమంగా — ఆ జీవశక్తి మరలా తిరిగి వచ్చింది. వింత  ఏమిటంటే — నాకు తిరిగి వచ్చిన జీవశక్తి కొత్తది కాదు. మొదటి రోజుల నుండి నాతో వచ్చిన పాత జీవశక్తియే!

                          నేను — నా చిన్నతనం, యుక్త వయసులోకి మరల వచ్చేసాను. నన్ను పుట్టించిన, నా నుంచి ఏదో ఆశించిన సంకల్పం మీద నమ్మకానికి తిరిగి వచ్చేసాను. ముఖ్యమైన ఒకటే లక్ష్యం గల నా నమ్మకానికి తిరిగి వచ్చేసాను. ఆ లక్ష్యం ఏమిటంటే — ఇంకా బాగా బ్రతకాలి తర్వాత, అంటే — ఆ, నా సంకల్పానికి అనుగుణంగా బ్రతకాలి. మానవాళి తన మార్గదర్శకం కోసం తయారుచేసిన (ఇంతకు పూర్వం నా నుండి దాచబడింది) — ఆ సంకల్పం యొక్క వ్యక్తీకరణను కనుగొనగలననే నమ్మకానికి తిరిగి వచ్చాను. అంటే దైవం పై నమ్మకానికి నైతిక పరిపూర్ణత, జీవితార్థాన్ని అందజేసే సంప్రదాయంలోకి. తేడా ఏమిటంటే అప్పుడు ఇదంతా అసంకల్పితంగా అంగీకరించబడేది.

ఇప్పుడది లేకుండా నేను బ్రతకలేనని నాకు తెలుసు.

                    నాకు జరిగిందంతా ఇలా చెప్పవచ్చు: నేను ఒక పడవలో కూర్చోబెట్టబడ్డాను (ఎప్పుడనేది గుర్తులేదు). ఒక తెలియని తీరం నుండి నీటిలోకి తోయబడ్డాను. ఆవలి గట్టు దిక్కు చూపబడింది. అలవాటు లేని నా చేతులకు రెండు తెడ్లు ఇచ్చి, ఒంటరిగా వదిలివేయబడ్డాను. నాకు సాధ్యమైనంతగా తెడ్లు వేస్తూ ముందుకు వెళ్లాను; ప్రవాహం మధ్యలోకి వచ్చేటప్పటికి, నీటి వేగం నన్ను గమ్యం నుంచి దూరంగా తోసివేయసాగింది. తరచుగా తోసి వేయబడిన నాలాంటి వాళ్లను చాలామందిని చూశాను. కొద్దిమంది తెడ్లు వేయడం ఆపకుండా కొనసాగించారు. మిగిలిన వారు తెడ్లని వదిలేశారు; జనంతో నిండి ఉన్న పెద్ద పడవలు, చాలా నౌకలు ఉన్నాయి. కొంతమంది ప్రవాహానికి ఎదురీదారు. మిగిలిన వారు దానికి లొంగిపోయారు. ప్రవాహంలో  కొట్టుకుపోతున్న వారిని చూస్తూ నేను నా గమ్యం, దిక్కు మరచి పోయాను. సరిగా ప్రవాహం మధ్య దిగువకు కొట్టుకుపోయే పడవలు, నౌకల సందోహాల మధ్య నేను నా దిక్కు కోల్పోయాను. తెడ్లు వదిలేసాను. నా చుట్టూ అన్ని వైపులా ఉల్లాసంగా ఆనందంతో తెడ్లతోనూ తెరచాపలతోనూ ప్రవాహం దిగువకు వెళుతున్నవారు కనిపించారు. అదికాక వేరే మార్గం లేదని ఒకరికొకరు భరోసా ఇచ్చుకుంటూ నాకు కూడా చెప్పారు. నేను వారితో ప్రయాణించాను. నేను చాలా దూరం తీసుకుపోబడ్డాను; ఎంత దూరం అంటే — నాకు ప్రవాహ గర్జన వినిపించింది. తునా తునకలైన నావలు కనిపించాయి. జరిగిందంతా గుర్తుకు తెచ్చుకున్నాను. ఏమి జరిగిందో నాకు చాలా కాలం అర్థం కాలేదు. నేను వెళ్లే మార్గంలో విధ్వంసం తప్ప నాకు  ఏమీ కనబడలేదు. నేను భయపడ్డాను. నాకు ఎక్కడా రక్షణ కనపడలేదు. ఏమి చేయాలో తెలియలేదు; కానీ వెనక్కి చూసుకుంటే , నాకు- ఆగకుండా నిరంతరం శ్రమిస్తూ, ప్రవాహానికి అడ్డంగా వెళుతున్న చాలా నావలు కనిపించాయి. ఇంకా నాకు గమ్యం,  తెడ్లు, దిక్కు గుర్తుకు వచ్చి ప్రవాహానికి ఎదురీదుతూ గమ్యం వైపు సాగాను. ఆ తీరం దైవం; ఆ దిశ సంప్రదాయం; నాకు ఇవ్వబడిన స్వేచ్ఛ నాకు గమ్యం చేరడానికి, దైవంతో కలవడానికి ఇవ్వబడిన తెడ్లు. నాలో జీవశక్తి తిరిగి వచ్చింది. నేను మరలా బ్రతకడం మొదలుపెట్టాను.

Also read: ఎంతకీ అర్థం కాని జీవితం!

                 ———-    —————-

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles