Sunday, December 22, 2024

శాస్త్రవేత్తల్లో జోష్ నింపిన ప్రధాని పర్యటన

  • జైడస్, భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ లను సందర్శించిన మోదీ
  • ప్రధాని రాకతో హర్షం వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు
  • స్వదేశీ కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిని తెలుసుకున్న ప్రధాని
  • టీకా పంపిణీకి శాస్త్రవేత్తల నుంచి సూచనలు
  • కరోనా టీకా పురోగతిపై సమీక్ష జరిపిన ప్రధాని

హైదరాబాద్ : కొవిడ్-19 కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం దేశమంతా కోట్ల కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సమీక్ష ముగిసింది. శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె  నగరాలలో  కరోనా టీకాలను అభివృద్ధి చేస్తున్న జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ , సీరం  సంస్థలను సందర్శించారు. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ప్రధాని స్వయంగా పర్యవేక్షించారు. సూది మందును త్వరగా మార్కెట్లో కి తెచ్చేందుకు ప్రయత్నించాలని శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నింపారు. ప్రధాని పర్యటనపై పీఎంవో ట్విటర్ లో సమాచారమిచ్చింది.

అహ్మదాబాద్ లో  ‘జైడస్ బయోపార్క్’ ను సందర్శించిన మోదీ

పర్యటనలో భాగంగా ప్రధాని మొదట అహ్మదాబాద్ లోని జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్ ను సందర్శించారు. అహ్మదాబాద్ కు 20  కిలోమీటర్ల దూరంలో ఉన్న చంగోదర్ పారిశ్రామిక ప్రాంతానికి ఉదయం 9.30 గంటలకు చేరుకున్నారు. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన “జైకోవ్ – డి” టీకా ప్రయోగాల గురించి శాప్త్ర వేత్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని పీపీఈ కిట్ ధరించి వ్యాక్సిన్ ప్రయోగ శాలను పరిశీలించారు. అంతకు ముందు సంస్థ ప్రతినిధులతో మోదీ చర్చలు జరిపారు. జైడస్ టీకా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని, ఆగస్టులో తొలి దశ ప్రయోగాలు పూర్తయ్యాయని జైడస్ తెలిపింది.

దేశీయ డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ తయారీ గురించి తెలుసుకునేందుకు జైడస్ బయో పార్క్ ను సందర్శించి   వారి శ్రమ అంకితభావాన్ని ప్రధాని అభినందించారు. పీపీఈ కిట్ ధరించి వ్యాక్సిన్ అభివృద్ధిని పరిశీలించిన మోది భారత ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాలా చేయూతనిస్తుందని ట్వీట్ చేశారు.

హైదరాబాద్ లో  ‘భారత్ బయోటెక్’ సందర్శన

అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని జినోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ ను సందర్శించారు. సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ ఎల్లా కృష్ణ, శాస్త్రవేత్తలతో మోదీ సంభాషించారు. ఈ సంస్థ “కొవాగ్జిన్” వ్యాక్సిన్ పురోగతిపై భారత్ బయోటెక్ శాస్త్ర వేత్తలతో మోదీ చర్చించారు. ప్రస్తుతం కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్ జరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ సన్నద్ధత, ట్రయల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 పర్యటన ముగిసిన అనంతరం భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ బృందం ఐసీఎంఆర్ తో కలిసి పనిచేస్తోందని కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు.

పుణెలో ‘సీరం’ సందర్శన

భారత్ బయోటెక్ సందర్శన అనంతరం హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి పుణె బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పుణె సీరం ఇన్ స్టిట్యూట్ ను సందర్శించారు. అక్కడ సంస్థ ఛైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా, ఆయన కుమారుడు సీఈవో అధర్ పూనావాలా ప్రధానికి స్వాగతం పలికారు.

సీరం ఇన్ స్టిట్యూట్ లో వ్యాక్సిన్ తయారీ బృందాన్ని కలిశారు. టీకా తయారీలో వారు సాధించిన ప్రగతి గురించి నాకు వివరించారు. ‘వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి తెలుసుకున్నా. అంతే కాకుండా తయారీ కేంద్రాన్ని సందర్శించా’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ నే సీరం ఉత్పత్తి చేస్తోంది. సీరం సందర్శన తరువాత పూణె నుంచి ప్రధాని ఢిల్లీ చేరుకున్నట్టు పీఎంవో అధికారులు ట్విటర్ లో  తెలిపారు.

సీరం ముందస్తు దరఖాస్తు

ఎమర్జెన్సీ వినియోగం కోసం తమ కరోనా టీకా ‘కొవిషీల్డ్’ కు అనుమతినివ్వాలని కోరుతూ వచ్చే రెండు వారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధర్ పూనావాలా తెలిపారు. టీకా కోసం ప్రపంచ ప్రఖ్యాత  ఔషధ సంస్థ ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో సీరం సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ సంస్థలు ఇచ్చే సమాచారం ఆధారంగా ఎమర్జెన్సీ వినియోగానికి లైసెన్స్ లభిస్తుందని ప్రస్తుతం ఆ సమాచారాన్ని ఔషధ నియంత్రణ సంస్థకు అందజేసే ప్రక్రియలో ఉన్నామని పూనావాలా తెలిపారు.

యూరప్ మార్కెట్ వ్యవహారాలను ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ చూసుకుంటాయన్న పూనావాలా అన్ని రకాల వ్యాక్సిన్ లు  50 నుంచి 60 శాతం భారత్ లోనే తయారవుతున్నాయని చెప్పారు. దీంతో తక్కువ ధరకు లభించే కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారని పూనావాలా స్పష్టంచేశారు.  కేంద్ర ప్రభుత్వం ఎన్ని డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేస్తుందన్న విషయంపై ప్రస్తుతానికి ఒప్పందమేదీ లేదని తెలిపారు. వచ్చే ఏడాది జులై వరకు 30 నుంచి 40 కోట్ల డోసుల వ్యాక్సిన్ కోనుగోలు చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles