డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ప్రపంచ ప్రసిద్ధుడైన పరిశోధకుడు, పంటల శాస్త్రవేత్త. భారత హరిత విప్లవానికి పితామహుడు. భారత దేశంలో ఆహారపు కొరతనూ, ఆకలి చావులనూ శాశ్వత ప్రాతిపదికపైన పరిష్కరించినవాడు.
మాంకొంబు సాంబశివన్ స్వామినాథన్ 07 ఆగస్టు 1925న పుట్టి కేరళ, మద్రాసు విశ్వవిద్యాలయాలలో చదివి, కేంబ్రిడ్జిలో పరిశోధన చేసి, అమెరికా విస్కాన్సిన్ లో పరిశోధనానంతర అధ్యయనం చేసిన మేటి శాస్త్రవేత్త. 1960లలో లల్ బహద్దూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నకాలంలో దేశంలో ఆహారం కొరత ఎక్కువగా ఉండేది. పిఎల్ 480 పథకం కింద అమెరికా ఓడలలో గోధుమలు పంపించేది. అటువంటి విపత్కర దశలో ఉన్న దేశాన్ని హరిత విప్లవం ద్వారా స్వామినాథన్ రక్షించారు. శాస్త్రి, ఇందిరాగాంధీల హయాంలో వ్యవసాయమంత్రులుగా ఉన్న సి. సుబ్రహ్మణ్య, జగ్జీవన్ రామ్ లతో కలసి స్వామినాథన్ సన్నిహితంగా పని చేశారు. ఆయన పరిశోధనల ఫలితంగా భారత దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి ఇబ్బడిదిబ్బడిగా పెరిగిపోయింది. ఇందిరాగాంధీ హయాంలో ఆహారకొరతను ఎదుర్కొనడానికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలైన ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో కుటుంబ నియంత్రణపైన ఏకాగ్రత తగ్గింది. ఇప్పుడు భారత దేశ జనాభా చైనాను దాటుకొని పోయి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. స్వామినాథన్ సెప్టెంబర్ 28న చెన్నైలో తన నివాసంలో కన్నుమూశారు. అంత్యక్రియలు శుక్రవారంనాడు జరుగుతాయి.
స్వామినాథన్ కు ముగ్గురు కుమార్తెలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యాస్వామినాథన్ వారిలో ఒకరు. బెంగళూరులో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న మధురాస్వామినాథన్ మరో కుమార్తె. ఇంగ్లండ్ లో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ లో పని చేస్తూ మార్చి 2022లో కన్నుమూసిన మీనా స్వామినాథన్ ఇంకో కుమార్తె.
భారత వ్యవసాయ, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా 1979 నుంచి 1982 వరకూ డాక్టర్ స్వామినాథన్ పని చేశారు. ఫిలిప్పీన్స్ లోని లాస్ బానాస్ లో రాకెఫెల్లర్ ఫౌండేషన్ నెలకొల్పిన అంతర్జాతీయ వరిపరిశోధనా కేంద్రంలో డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. తర్వాత భారత్ కు తిరిగి వచ్చిఅనేక కమిటీలకు అధ్యక్షత వహించారు. 2007లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. అప్పటికే ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషన్ అవార్డులు వరించాయి. మేగ్ సెసే అవార్డు కూడా వచ్చింది. ఒక్క నొబెల్ బహుమతి మినహా తక్కిన పురస్కారాలన్నీ దక్కాయి. అవార్డుల రూపంలో ఆయనకు వచ్చిన సొమ్మునంతా స్వామినాథన్ పరిశోధనాసంస్థకు విరాళంగా ఇచ్చారు.
అధిక దిగుబడి ఇచ్చే బస్మతి వరి వంగడాలు కనిపెట్టడం ఆయన చేసిన అద్భుతమైన సేవ. రకరకాల వరి వంగడాలను కలిపి బస్మతిని కనిపెట్టారు. ప్రయోగశాల నుంచి క్షేత్రానికి (లాబ్ టు లాండ్) అనే బృహత్తర కార్యక్రమం ఆయన చలవే. దేశంలో ఆహారధాన్యాల వంగడాలను నిర్మించడంలో ఆద్యుడు, దేశంలో అనేకమంది శాస్త్రజ్ఞులకు ఆదిగురువు, శాస్త్రీయ దృక్పథాన్ని రైతులలో, మహిళలో పెంచిన ప్రయోక్త డాక్టర్ స్వామినాథన్. నార్మన్ బోర్లాగ్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి స్వామినాథన్ పని చేశారు.