Thursday, November 21, 2024

నిత్యజీవితంలో వైజ్ఞానిక స్పృహ

ప్రపంచమే ఒక వైజ్ఞానిక కల్పన!

సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విశాల విశ్వంలో ఏదీ లేదు. ఏ విషయం తీసుకున్నా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అది సైన్స్ తో సంబంధం కలుపుకోవాల్సిందే. కొన్ని కోట్ల మంది యాత్రికులు బస్సుల్లో, రైళ్ళలో, విమానాలలో పుణ్యక్షేత్రాలకు, ధార్మిక కేంద్రాలకు వెళ్ళివస్తున్నారంటే, కంప్యూటర్ ద్వారా రిజర్వేషన్లు జరుగుతున్నాయంటే, దేవుడి వ్యవహారాలన్నీ ఆన్ లైన్  లో జరుగుతున్నాయంటే అందుకు సైన్స్ కారణం. సైన్స్ కు దేవుడు అవసరం లేకపోయినా, దేవుడి భావన నిలవడానికి మాత్రం సైన్స్ అవసరం  ఉందన్నది ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యం. మీరు ఏ స్వామీజీనో, సన్యాసినో, మాతాజీనో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టీ.వీ. తెరమీదో చూడండి. జాగ్రత్తగా గమనించండి. విషయం మీకే అర్థమవుతుంది.

Also read: విజ్ఞానమా? మతవిశ్వాసమా? ఏది కావాలి?

వాళ్ళంతా ధవళ వస్త్రాలు ధరించి ఉంటారు. అవి సైన్స్ వల్ల లభించినవి. వారి ముందు ఓ పది మైకులుంటాయి. అవీ సైన్స్ వల్ల లభించినవే. విద్యుత్ దీపాల కాంతి చల్లగా, తెల్లగా వెలుగులు ప్రసరిస్తూ ఉంటుంది. అవీ సైన్సు వల్ల లభించినవే. సైన్స్ సమకూర్చిన ఇన్ని సౌకర్యాల మధ్య కూర్చుని ఈ ఆధ్యాత్మిక గురువులు చెప్పేదేమిటీ? ‘‘మానవ జన్మ వృథా! వెంటనే ఏదో ఒక శక్తిని, దేవుణ్ణి, దేవతను నమ్మండి. మోక్షం సాదించండి’’ – అని కదా? మోక్షమంటే ఏమిటి? ఎవడు చూశాడు దాన్నీ? అనే ప్రశ్నలు ఎవరూ వేయకుండా గంభీరోపన్యాసాలు సాగుతూ ఉంటాయి. మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశాలతో అతణ్ణి బలహీనపరచడం తప్ప, మనిషి మనిషిగా ఎదుగుతూ వచ్చిన విషయం ఒక్కటీ మాట్లాడరు. మనిషి తన మేధోసంపత్తి వల్ల సంపాదించిన విజ్ఞానంతో అబ్ధిపొందుతూ, వాటి గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆత్మ, పునర్జన్మ, దైవం, భక్తి వంటి మాటలతో అందమైన ఉపన్యాసాలు, ప్రవచనాలు చెపుతుంటారు. అందులో పిట్టకథలు మరో ఆకర్షణ.

అందువల్ల విద్యావంతులకు, మేధావులకు నేను చెప్పేదేమిటంటే-మనిషి సాధించిన విజయాల గూర్చి జనానికి చెప్పండని! భవిష్యత్తులో ఇంకా సాధించాల్సినవేవో బేరీజు వేసుకోండని! అంతే కాని మీ మానసిక రుగ్మతలు మీ మానసిక బలహీనతలు సమాజం మీద రుద్దకండని. మనుషుల్ని బలహీనులుగా తయారు చేసే ఈ స్వామీజీ తనకేదైనా అనారోగ్యం కలిగితే వెంటనే ప్రత్యేక నిపుణులైన డాక్టర్లతో వైద్యం చేయించుకుంటాడు కదా? తప్పదు. బయటికొచ్చి ‘ఆ భగవంతుడి కరుణ వల్ల బతికి బయటపడ్డా’నంటాడు. జనం దాన్ని నమ్ముతారు. డాక్టర్ల బృందం అతడికి ఎంతో శ్రద్ధగా వైద్యం చేసిందీ, నర్సుల బృందం అతణ్ణి కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుందీ…అందరూ కలిసి ఎంతో కష్టపడి మళ్ళీ మామూలు మనిషిని చేశారన్నది మరుగున పడుతుంది. జరుగుతున్న ఘోరమేమంటే ప్రతివాడూ సైన్సును ఉపయోగించుకుంటాడు. కాని దాని గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడడు. నమ్మకాలలో, మూఢవిశ్వాసాలలో బతకడం అలవాటు పడినవారికి వాస్తవాలు రుచించవు. రుచికరమైన చిరుతిండికి అలవాటు పడ్డవాడు సాత్వికమైన పౌష్టికాహారం ఇష్టపడడు. అలాంటివాడికి అసలు వాస్తవాల్ని గ్రహిద్దామన్న స్పృహ కూడా ఉండదు.

Also read: ‘జ్ఞానం’- సంపాదించినవారంతా బౌద్ధులే!

ఈ రోజు బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్ మాటిక్స్, జెనటిక్ ఇంజనీరింగ్, హ్యూమన్ జీనోమ్, జీన్ థెరపీ, క్లోనింగ్, స్టెమ్ సెల్ రీసర్చ్, చంద్రయాన్ ప్రాజెక్ట్, నానో టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఫార్మాసుటికల్ రీసర్చ్, ఆర్టిఫీషియల్ లైఫ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక విషయాలపై పరిశోధనలు ఉధృతంగా జరగుతున్నాయి. మూలకణాల (stem cells) పై జరిగే పరిశోధనలు విజయవంతమవుతే ఒక మనిషికి పెరిగిన తర్వాత రాబోయే వ్యాధులు, అతను పిండదశలో ఉన్నప్పుడే..తల్లి గర్భంలో ఉన్నప్పుడే..జన్యువుల్లోనే నివారించొచ్చు. విశ్వవిజ్ఞానం ఎంతగా పెరిగిపోయిందంటే విభిన్న రంగాలకు చెందిన శాస్త్రవేత్తలందరూ మనస్ఫూర్తిగా తమతమ అహాల్ని వదులుకుని కృషి చేస్తే, నూతన సృష్టికి రూపకల్పన చేయగలరు! అంతటి విజ్ఞానం మనకుంది. అంతటి ప్రజ్ఞాపాటవాలూ మనవాళ్ళకున్నాయి. అయితే సమన్వయ లోపమే అవరోధంగా నిలుస్తోంది. ‘‘ఎన్ని పరిశోధనలు జరిగినా కొత్త ప్రాణికి మనిషి జీవం పోయగలడా?’’ అనే సంశయానికి శాస్త్రవేత్తలు తప్పక సమాధానం చెప్పగలుగుతారు.

ఇటీవల ఒక కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ‘‘మైకోప్లాస్మా జెనిటీలియం’’ అనే బాక్టీరియాలోని మొత్తం డి.ఎన్.ఏను ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించగలిగారు. లోగడ వైరస్ డి.ఎన్.ఏలను కృత్రిమంగా సృష్టించగలిగినా, బాక్టీరియా డి.ఎన్.ఏకు మాత్రం ఇంతవరకు రూపకల్పన చేయలేకపోయారు. అదిప్పుడు సాధ్యమయ్యింది! వైరస్ ల కన్నాబాక్టీరియాలలో ఎక్కువ డిన్ఏ ఉండడమే ఈ ఆలస్యానికి కారణమైంది. ఉదాహరణకు ఇప్పుడు సృష్టించగలిగిన మైకోప్లాస్మా జెనిటీలియం కోసం సుమారు ఆరు లక్షల డిఎన్ఏ బేస్ పెయిర్స్ తయారు చేయాల్సి వచ్చింది. అందువల్ల సహజంగానే మైకోప్లాస్మా జెనిటీలియంలో ఉండే డిఎన్ఏ కు ప్రతిసృష్టి చేయడం జీవశాస్త్రంలో ఒక గొప్ప పరిణామం.

Also read: ప్రపంచంలోని తొలి భౌతికవాదులు మన చార్వాకులు

మైకోప్లాస్మా జెనిటీలియం అనే ఈ బాక్టీరియా ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఉంటుంది. సెక్స్ సమయంలో ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. అందువల్ల రాగల కాలాలలోమానవుని జన్యవును కూడా శాస్త్రవేత్తలు రూపొందించగలరనే నమ్మకం కలుగుతోంది.  సహజమైన బాక్టీరియాకు సరి సమానమైన బాక్టీరియాను రూపొందించగలిగినప్పుడు, సహజమైన మానవుడికి సరిసమానమైన మానవుణ్ణి శాస్త్రవేత్తలు రూపొందించగలరు.  ఇది ఏదో ఆశాభావంతో ఊరికే అంటున్న మాట కాదు. కాబోయే వాస్తవం. ఇటీవల శాస్త్రజ్ఞులు ఒక మైక్రోబ్ (సూక్ష్మక్రిమి) నుండి డిఎన్ఏ ను మరో మైక్రోబ్ లోకి మార్చారు. అంటే ఒక జీవిగా పుట్టబోయేదాన్ని  మరో జీవిగా మార్చి పుట్టించినట్టు లెక్క. కృత్రిమంగా తయారు చేసిన క్రోమోజోమ్ ను ఒక బాక్టీరియాలో ప్రవేశపెట్టే ప్రక్రియ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఈ ప్రయత్నాలు విజయవంతం అవుతే ఒక కణం నుంచి జీవి పూర్తి రూపాన్ని తయారు చేయడానికి వీలవుతుంది. జీవులను, జీవలక్షణాలను మానవుడే సృష్టించినట్లవుతుంది. విశ్వాసపాత్రులైన ఈ భక్తులు అప్పుడు మరి దేవుణ్ణి-సృష్టికర్తను ఎక్కడ దాచుకుంటారో తెలియదు.

సైన్స్ కు జీవంతో సంబంధం లేదని, జీవాల్ని ఏదో శక్తి సృష్టించిందని 19వ శతాబ్దం దాకా అందరూ నమ్మారు. 1828 నుండి టెస్ట్ ట్యూబ్ ప్రయోగాలు ప్రారంభమైనప్పటి నుండి   ఈ వాదన బలహీనపడుతూ వచ్చింది. ఇప్పటికీ అత్యధిక సంఖ్యాకులు జీవాన్ని దేవుడు (ఒక శక్తి) సృష్టించాడని నమ్మేవారే ఎక్కువ.  కాని శాస్త్రపరిశోధనలు వారి అభిప్రాయాన్ని తప్పక మారుస్తాయి. వాస్తవాల్ని జీర్ణించుకోవడానికి, తమ నమ్మకాల్ని వదులుకోవడానికి ప్రజలకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే త్వరిత గతిన సాగుతున్న పరిశోధనల వల్ల శాస్త్రజ్ఞులు మానవుడి జన్యవులను కూడా కృత్రిమంగా తయారు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల మస్కులర్ డిస్ట్రోఫీ, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి రోగాలకు చికిత్స సాధ్యమవుతుంది.  అంతకన్నా మానవుడి ఆయుష్షు పెంచే ప్రయత్నం సఫలమవుతుంది.

Also read: భారత్ విశ్వగురువు ఎలా అయ్యింది?

ఈ విధంగా విజ్ఞానశాస్త్రం ఏఏ మూలలకు వ్యాపిస్తోందో, ఆయా మూలల నుండి దేవుడు మాయమవుతున్నాడు. ఒక నాడు స్మాల్ ఫాక్స్ వస్తే ‘‘అమ్మవారు’’ అని భయపడ్డారు. దాన్ని దైవానికి అంటగట్టారు. ఇప్పుడది వ్యాధి మాత్రమేనని తేలిపోయింది. దాని నివారణ కూడా జరిగింది. నమ్మకాలు, మూఢనమ్మకాలు బాగా ప్రబలుతున్న చోట దైవభావం బలంగా ఉంటుంది. విజ్ఞానశాస్త్రం ఒక జ్యోతిలా వెలుగులు అందిస్తున్న కొద్దీ, నమ్మకాల్లో మార్పు వస్తోంది. మూఢనమ్మకాలు సడలుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు కొత్తకొత్త మూఢనమ్మకాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత విద్యావంతులందరిదీ. విశ్వవిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు జనానికి అందించేవారు ఎక్కువ సంఖ్యలో కావాలి. నిరక్షరాస్యుల కన్నా అక్షరాస్యుల్లో కొంతమంది హేతుబద్దంగా ఆలోచించకపోవడం, అంధవిశ్వాసాలతో తాము కొట్టుకుపోతూ తమ చుట్టూ ఉన్నవారిని సైతం భయపెట్టడం జరుగుతుంది. ఇలాంటి వారి వల్ల మన సమాజం వైజ్ఞానిక సమాజంగా రూపాంతరం చెందలేకపోతోంది. ప్రతి ముందడుక్కీ ఎన్నో అవాంతరాలు రావడం వల్ల అనుకున్నది సాధించడానికి ఎంతో సమయం పడుతుంది.

ఉదాహరణకు ఎలుక, ఏనుగు, మనిషి గూర్చి ఆలోచిద్దాం. ఈ మూడూ క్షీరదాలకు చెందిన ప్రాణులు. అయినప్పటికీ పరిమాణంలో జీవనంలో –  ఆయుష్షులో తేడాలున్నాయి. జీవితకాలం అనేది ఆ ప్రాణి కణాల ఆయుష్షుపై ఆధారపడి ఉంటుందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. ప్రకృతి వైద్యం చేసే వైద్యులు కూడా ఆమాటే చెపుతున్నారు. కణాల ఆయుష్షునే ఏజింగ్ (AGEING) అంటున్నారు. కణాల ఆయుష్షు మళ్ళీ ఆ ప్రాణి తీసుకునే ఆక్సీజన్ పై ఆధారపడి ఉంటుంది. శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం మంచిదని చెప్పేది అందుకే! మనం పీల్చే ఆమ్లజని వల్ల కణాలకు శక్తి లభిస్తుంది. ఆ ప్రక్రియ  జరుగుతున్నప్పుడు కొన్ని ప్రమాదకరమైన ఉపఉత్పన్నాలు కూడా విడుదల అవుతాయి. వాటినే ‘‘ఫ్రీరాడికల్స్’’ అంటున్నాము. ఈ ఫ్రీరాడికల్స్ కాన్సర్ వంటి వ్యాధుల్ని కలగజేస్తాయి. అలాంటి వ్యాధులు రాకుండా ఫ్రీరాడికల్స్ ని నియంత్రించడానికి ఎంజైమ్స్ అవసరమౌతాయి. ఎంజైమ్ ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో మనం వాటిని అదుపు చేయగలిగితే వ్యాధులపై, ఆయుష్షుపై మనం పట్టు సాధించవచ్చు. ఆ ప్రయత్నాలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఒక కొత్త విషయం బయటపడింది. మన రెండు తెలుగు రాష్ట్రాలలోని వైశ్య జాతిలో కొన్ని ఎంజైమ్ల లోపం బయటపడింది. అనాదిగా కుటుంబంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ రావడం వల్ల, అది వంశపారంపర్యంగా వచ్చిన లోపమా? లేక మరేవైనా ఇతర కారణాలున్నాయా? తేలాల్సి ఉంది. అంటే ఇంకా ఇతర కులాల్లో, జాతుల్లో కూడా ఏవేవో కొన్నికొన్ని లోపాలు ఉండవచ్చు కదా? వాటిని కూడా ఇప్పుడు సైన్సు పరిశోధనలు వెలికి తీయాల్సి ఉంది.

Also read: ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?

ఇక్కడ మనం మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవనగతిని మలుపుతిప్పే ఆవిష్కరణలు చేయడం ఏ కొద్దిమంది శాస్త్రవేత్తలకో సాధ్యమయింది. భవిష్యత్తులో కూడా సాధ్యమవుతుంది. అంతేకాని మిలియన్ ల సంఖ్యలో ఉన్న సామాన్యజనం నమ్మకాల వల్ల సమాజంలో ఏ ఆవిష్కరణలు జరగలేదు. అవి బలంగా ఉన్నది నిజమే కాని, వాటికి వైజ్ఞానిక శాస్త్ర ఆధారాలు లేవు. అందువల్ల అవి నిలబడవు. అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, సామాన్యుల్లో ఏవో కొన్నికొన్ని నమ్మకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని మతాధిపతులు ఏవో అందమైన అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తుంటారు. బలహీనతల మీద వ్యాపారం జరిగినట్టు….ఇంకాఇంకకా వారి నమ్మకాలు వర్థిల్లేట్లు చేస్తుంటారు.

తమ వృత్తులతో వ్యాపారం చేసుకునే సినీనటులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు మొదలైనవారిని పక్కనపెట్టి, నిస్వార్థంగా, సమాజ పురోగతికి పాల్పడే శాస్త్రవేత్తల్ని, సామాజిక శాస్త్రవేత్తల్ని, అధ్యాపకుల్ని, దార్శనికుల్ని గౌరవించుకున్ననాడు సమాజం బాగు పడుతుంది. వ్యవసాయదారుడు, కూలి, ఉద్యోగి, కార్మికుడు వంటి వారి శ్రమకు సరైన విలువ లభించినపుడు సమాజం విలువ పెరుగుతుంది. అందుకు వైజ్ఞానిక స్పృహ, వైజ్ఞానిక దృక్పథం చాలా అవసరం. అది పెంచుకున్న సమూహాలు, సమాజాలు ఆరోగ్యంగా ముందుకు పోతాయి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోందంటే అర్థం చేసుకోలేనివారు ఒక నాడు తలలు నరికేశారు. క్లాసులో పరిణామ సిద్ధాంతం చెప్పినందుకు 1925లోజాన్. టి. స్కూప్స్ అనే ఉపాధ్యాయుణ్ణి టెన్నిస్సి రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. ఒక ఐరిష్ మతపెద్ద ఈ చరచరా జగత్తంతా క్రీ.పూ. 4004లో అక్టోబర్ 23 ఉదయం  9 గంటలకు ఆ భగవంతుడిచే సృష్టించబడిందని చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి దాకా దానికి రుజువే లేదు. అతను గానీ, అతని అనుచరులు గానీ ఊహాజనితమైన ఆ ప్రకటనని వాస్తవంగా మలచలేకపోయారు. నైలు నది లోని బురదలోంచి మొసళ్ళు ఉద్భవించాయని, ఈజిప్టులోని పురాతన సంచార జాతులు నమ్మేవి. ఆవు పేడలోంచి తేళ్ళు పుడతాయని కూడా నమ్మేవి. ఆ నమ్మకాలన్నీ నిలబలేదు. నమ్మకాలుగా అవి చాలాకాలం కొనసాగి ఉంటాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతం, హట్టన్ భూపొరల సిద్ధాంతం, వైస్ మెన్ జన్యు ప్రయోగాలు, హెకెల్ బయోజనటిక్ లా వంటివి ఎన్నో ప్రతిపాదించబడ్డాయి. ఆయా సిద్ధాంతాలు వాస్తవాలుగా మారి, వెలుగులోకి వస్తున్న కొద్దీ అంతకు ముందున్న నమ్మకాలన్నీ మరుగున పడసాగాయి. కొత్త నిజాలు సమాజానికి కొత్త సమాచారం అందిస్తూ వచ్చాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిరంతరం కొనసాగుతుంది కూడా!

నిజానికి మనమిప్పుడు చాలా ముందుకు వచ్చాం. కొన్నికొన్ని విషయాల్లో మళ్ళీ చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. దానికి అడ్డుకట్ట వేసుకుంటూ ఉండాలి. తప్పదు. వైజ్ఞానిక పరిశోధనలకు సంబంధించి ఏవీ అందుబాటులో లేని రోజుల్లో సి.వి. రామన్ ఈ దేశంలో పరిశోధనలు చేసి నొబెల్ బహుమతి సాధించారు. స్వాతంత్ర్యానంతరం క్రమంగా దేశం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రపంచస్థాయి పరిశోధనాశాలలు మనదేశంలో ఏర్పాటయ్యాయి. పరిశోధనలు ఎంతో ఆశాజనకంగా జరుగుతున్నాయి. చంద్రయాన్ విజయవంతమైంది. అది అందించే సమాచారం, భారతీయ సమాజానికే కాక, మొత్తం ప్రపంచాలనికే ఎంతో ఉపయోగపడుతోంది.

Also read: ఏ మనిషినీ సున్నా కింద తీసిపారవేయలేం!

(వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)

మొబైల్: 99086 33949

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles