Wednesday, January 22, 2025

సమానత్వమే సైన్సు ఉద్యమ లక్ష్యం!

  • కర్నూలులో సమతా ఫిలిం ఫెస్టివల్ 
  • అనేక పరిమితుల మధ్య ఘనవిజయం

జన విజ్ఞాన వేదిక ఏర్పడిన 35 సంవత్సరాలలో మొట్టమొదటి సారిగా మహిళా విభాగం మహాసభలు ఇంత పెద్ద ఎత్తున జరగడం ఒకెత్తయితే,  ప్రత్యామ్నాయ సినిమాల శక్తిని గుర్తించి రెండ్రోజుల మహిళా సభల్లో ఒక రోజు పూర్తిగా ఫిలిం ఫెస్టివల్ కోసమే కేటాయిం చడం మరొకెత్తు. ఏభై శాతం మహిళా రిజర్వేషన్ల గురించి ఊరికే వగర్చడం కాకుండా ముందు విజ్ఞాన వేదికలో 50 శాతం స్థానాలను స్త్రీలకు కేటాయిస్తున్నామని సభాముఖంగా తీర్మానం చేయడం ఒక గొప్ప పరిణామం. మహిళా సాధికారతను గుర్తించి కనీసం ఇంత కాలానికైనా అర్ద వంతంగా స్పందించిన జె.వి.వి. కి అభినందనలు!

సభికులకు వివరిస్తున్న గౌరవ్

భవితకి సమతా సందేశం

ముప్పయ్ అయిదేళ్ళ విజ్ఞాన వేదిక ప్రస్థానంలో మహిళల పాత్ర చిన్నది కాదు. అక్షరాస్యత ఉద్యమం మొదలు మద్యపాన వ్యతిరేక ఉద్యమం, ఆరోగ్య స్పృహ , పొదుపు ఉద్యమం, మూఢ నమ్మకాల వ్యతిరేక ఉద్యమం ఇలా ఎన్నెన్నో మైలురాళ్ళను చేరుకున్న జె. వి. వి. కి మహిళా విభాగం గొప్ప బలం. ఆ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ కేవలం రెండు నెలల హోంవర్క్ తో అవిరామంగా పనిచేసి  పాతకొత్త తరాల్ని ఒక్కచోట కూర్చో బెట్టాలనే తపనతో జె.వి.వి. మహిళా విభాగం కన్వీనర్‌ సోదరి సుజాత సీనియర్ సైన్సు ఉద్యమ నాయకులు డా. బ్రహ్మారెడ్డి, ఇతరేతర మిత్రులు, పెద్దల ప్రోత్సాహంతో, కర్నూలులో చేసిన ఈ అపూర్వమైన ప్రయత్నం భవితకి ఒక విలువైన సమతా సందేశం!

అద్భుతమైన స్పందన

రెండో రోజు మొత్తం ఫిలిం ఫెస్టివల్ ఏర్పాటు చేసి అనేక ప్రాంతాలు, భిన్న సంస్కృతుల నుండి వచ్చిన మహిళలతో సినిమా ప్రదర్శనలో ప్రయోగాత్మకతకి తెరలేపిన సాహసం ఒక సంతృప్తిని ఇచ్చింది. దాదాపు నూట యాభై మంది మహిళలు, ఎక్కువ మందికి ప్రత్యామ్నాయ సినిమాని పరిచయం చేయడం సాధ్యమా? అన్న అనుమానాన్ని పటాపంచలు చేస్తూ పదుల సంఖ్యలో కొత్త గొంతులతో అద్భుతంగా స్పందించారు. ప్రతి సినిమా పైనా పోటీపడి మరీ అమూల్యమైన అభిప్రాయాలు వినిపించీ, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు!

అత్యధికులు మహాిళలే

అది కాదు అసలు విషయం, ఒక పక్క వాతావరణం బాలేదని రాష్ట్ర వ్యాప్తంగా జరగవలసిన భారీ సమావేశాలే వాయిదా వేసుకున్నా “సమత” మాత్రం పట్టు వదల్లేదు. పైగా తల్లులందరికీ పిల్లలతో సహా రమ్మనమని ఆహ్వానించి పిల్లల కోసం ప్రత్యేకంగా గంటగంటకూ అలరించే ఆటపాటలతో ఒక విభాగాన్ని కేర్ టేకర్లను కేటాయించి మరీ ఏర్పాటు చేసి చిన్న పిల్లల తల్లులకు మీరు  నిశ్చింతగా సదస్సులో పాల్గోండనే పెద్ద  భరోసాను ఇచ్చింది. సమావేశాల్లో  ఇదో అనూహ్యమైన కొత్త మలుపు. ఉద్యమాల్లో మహిళలు తగ్గిపోతున్నారంటూ, సదస్సులకీ, కార్యక్రమాలకీ స్త్రీలు రావడం లేదంటూ బాధపడే మనకి మహిళలకి, ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులకి ఉండే ప్రాక్టికల్ ఇబ్బందులను గుర్తించి వాటికో పరిష్కారం చూపడం ద్వారా సమావేశం సజావుగా సాగేలా చూసుకోవచ్చని నిరూపించడం ఈ ప్రయోగం సాధించిన విజయం !

ఇబ్బందులు అనేకం, అయినా అర్థం చేసుకోవాలి

 నిజానికి సినిమాల ప్రదర్శనకు ఎన్నుకున్న స్థలం సరైనది కాదు. వెలుతురు తెరపై పడి ఇబ్బంది పెట్టింది. వెనకున్న కొద్దిమందికి తెర సరిగా కనబడలేదు. సౌండ్ సిస్టమ్ , ప్రాజెక్టర్ అనుకున్నంత బాగా లేవు. గాలి దుమారానికి ఒక సారి ఏకంగా స్ర్కీన్ కూడా ఎగిరి పోయింది. ప్రత్యామ్నాయ సినిమాల గురించిన పూర్తి సంవాదాలకీ, ప్రశ్నోత్తరాలకీ అందరికీ సమయం ఇవ్వ లేకపోయాం. ఒక దశలో ఒకట్రెండు కటువైన మాటలు కూడా ఉపయోగించి ఎక్కువ మంది భావాలను పంచుకునే అవకాశం కూడా కోల్పోయాం. నిజానికి అంత సంఖ్యలో వీక్షకులు వచ్చినప్పుడు అందరి భావాలకూ అవకాశం కల్పించడం నిర్వాహకులకు సాధ్యమయ్యేది కాదు.  తక్కువ సమయంలో మంచి సినిమాలను వినూత్నమైన రీతిలో ఎక్కువ మందికి పరిచయం చేయాలనే తపన వల్ల జరిగిన ఇలాంటి పొరపాట్లకు  నొచ్చుకున్న మిత్రులు పెద్ద మనసుతో అర్దం చేసుకుంటారని మనవి!

సావిత్రి, ఫాతిమా అవిభాజ్యాలు

మరొక్క విషయం ప్రస్తావించాలి. సావిత్రిబాయి ఫూలే స్పూర్తితో ఈ మధ్య జరిగిన ఒకట్రెండు కార్యక్రమాలని గమనించాను కాన మిత్రులకు ఒక విజ్ఞప్తి. మార్క్స్ ఏంగెల్స్, అష్పాఖ్ బిస్మిల్ లలాగా సావిత్రిబాయి, ఫాతిమా షేక్ లిద్దరూ అవిభాజ్యాలు. మత సామరస్యం కోసం కూడా వాళ్ళిద్దరినీ కలిపి మాత్రమే మనం చూపాలి, ప్రస్తావించాలి. అనేక మంది ముస్లిం మిత్రులు, మహిళలు వచ్చిన ఈ సమావేశంలో ఉన్న  మాతా సావిత్రీబాయి ఫొటో పక్కనే ఫాతిమా షేక్ కూడా ఉండుంటే మరింత బావుండే దని నా నిశ్చిత అభిప్రాయం. అయినా, ఎన్ని అవాంత రాలు ఉన్నప్పటికీ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా కొన సాగించిన నిర్వాహ కులకీ,  చివరి వరకూ కదలకుండా కూర్చుని సినిమాలు చూసి, కొత్త చైతన్యానికి ఆశలు రేపిన మహిళలు అందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు!

(జన విజ్ఞాన వేదిక మహిళా విభాగం “సమత” ఆహ్వానం మేరకు కర్నూలులో రెండు రోజులు జరిగిన సమావేశాలలో పాల్గొని ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. నాకు తెలిసీ తెలుగు రాష్ట్రాలలో జరిగిన మొట్ట మొదటి మహిళా సాధికార ప్రత్యామ్నాయ ఫిల్మ్ ఫెస్టివల్ ఇదే. ఇది ప్రయాణంలో రాసిన తక్షణ స్పందనే తప్పా పూర్తి రిపోర్టు కాదు. ఐనా, ఔత్సాహిక మిత్రుల కోసం ఈ చిన్న రైటప్.)

 గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles