హైదరాబాద్ : తెలంగాణలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అన్ని పాఠశాలలనూ తిరిగి ప్రారంభించవచ్చునని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, అందరూ కోవిద్ నిబంధనలను విధిగా పాటించాలని చెప్పింది. కోవిద్ కారణంగా చాలా మాసాలుగా స్కూళ్ళు చాలా వరకూ మూసి ఉన్నాయి. ఆన్ లైన్ క్లాసులు కొందరికే అందుబాటులో ఉన్నాయి. ఒక విద్యాసంవత్సరం పూర్తిగా కోల్పోయిన నేపథ్యంలో రెండో విద్యాసంవత్సరంలో రెండు, మూడు మాసాలైనా ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, శుక్రవారంనాడు హైకోర్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక వ్యాఖ్య చేసింది. కాలేజీలు మూసివేసి, స్కూళ్లు తెరుస్తారా అని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రభుత్వం శనివారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. కోవిద్ మహమ్మారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డి నొక్కి చెప్పారు. తెలంగాణ విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి.