పది, పన్నెండో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పైన సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. అఫిడవిట్ పైన సుప్రీంకోర్టు గురువారంనాడు విచారణ జరుపుతూ తాము పక్కాసమాచారం ఇవ్వాలని కోరామనీ, సమాచారం సంపూర్ణంగా లేదనీ వ్యాఖ్యానించింది. 15 రోజులు ముందుగా చెబుతామని ప్రభుత్వం అంటోంది, 15 రోజుల సమయం సరిపోతుందని ఏ ప్రాతిపదికపైన చెబుతున్నారంటూ కోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహన సిబ్బంది వివరాలు ఏవీ ఇవ్వలేదని వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వమే అన్ని రకాల సదుపాయాలూ కల్పించాలని చెప్పింది. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత సైతం ప్రభుత్వమే స్వీకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
రెండో దశ కోవిద్ లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చిందో చూశామని చెబుతూ, పలు వేరియంట్లు ఉన్నాయని ప్రవీణులు చెబుతున్నా ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఒక్కో గదిలో 15 నుంచి 20 విద్యార్థులు కూర్చోవడం ఎట్లా సాధ్యం అవుతుందని ప్రశ్నించింది. ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం మొత్తం 34వేల పైచిలుకు గదులు అవసరం అవుతాయనీ, అన్ని సిద్ధంగా ఉన్నాయా అని అడిగింది. పరీక్షలు నిర్వహించగానే సరిపోదు. మూల్యాంకనం చేయాలి. ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది. మూల్యాంకనం, తదితర ప్రక్రియ వివరాలు అఫిడవిట్ లో లేవంటూ ఆక్షేపించింది. ఇటువంటి అననుకూల వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలంటే ఒక నిర్ణయాత్మకమైన ప్రణాళిక ఉండాలనీ, ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో అంతా అనిశ్చితే ఉన్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
విద్యార్థుల రక్షణ విషయంలో ప్రభుత్వం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనీ, విద్యార్థులకు జరగరానిది జరిగితే ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించవలసి ఉంటుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.