Sunday, December 22, 2024

ఎఫ్ఐఆర్ పైన ఏపీ హైకోర్టు ఉత్తర్వును నిలిపివేసిన సుప్రీంకోర్టు

  • అమరావతి భూకుంభకోణంపైన దర్యాప్తు నిలిపివేయాలన్న ఉత్తర్వులపైన స్పందించని సర్వోన్నతన్యాయస్థానం
  • తదుపరి విచారణ 2021 జనవరిలో
  • అంతవరకూ యథాతథ స్థితి

దిల్లీ: ఎఫ్ఐఆర్ ను ప్రచురించరాదనీ, ప్రసారం చేయరాదనీ, ప్రచారం చేయరాదని నిషేధం విధిస్తూ సెప్టెంబర్15న తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు బుధవారంనాడు ‘స్టే’ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసుకున్న స్పెషల్ లీవ్ పిటిషన్ పైన అత్యున్నత న్యాయం స్థానం ప్రభుత్వానికి అనుకూలమైన ఉత్తర్వు జారీ చేసింది. కానీ అమరావతి భూకుంభకోణంపైన ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్-సిట్) చేత చేయించదలపెట్టిన దర్యాప్తును నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మరో ఉత్తర్వుపైన సుప్రీంకోర్టు స్పందించలేదు. ఈ పిటిషన్ పైన విచారణను 2021 జనవరి మాసానికి వాయిదా వేస్తూ, ఈ లోగా ప్రభుత్వం, కక్షిదారులు కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేసుకోవాలనీ, తిరిగి విచారణ ప్రారంభించే లోగా ఈ కేసులో హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోరాదనీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్. సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో  కూడిన పీఠం ఈ పిటిషన్ పైన వాదనలు ఆలకించింది.

ప్రతిష్ఠాత్మకమైన కేసు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ కేసులో చాలా పేరుప్రతిష్ఠలు కలిగిన న్యాయవాదులు వాదిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున రాజీవ్ ధవన్, మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తరఫున ముకుల్ రొహట్గీ, హరిష్ సాల్వేలు వాదించారు. ముగ్గురూ ముగ్గురే. సమర్థులైన న్యాయవాదులు.

దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె. మహేశ్వరి నాయకత్వంలోని పీఠం ఈ పిటిషన్ వేసిన రోజునే రిజిస్టర్ చేసిన ఎఫ్ ఐఆర్ లోని అంశాలను పత్రికలు ప్రచురించకుండా, న్యూస్ చానళ్ళు ప్రసారం చేయకుండా, సోషల్ మీడియా ప్రచారం చేయకుండా నిరోధించాలనీ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శికీ, పోలీసు డైరెక్టర్ జనరల్ కీ, ఐ అండ్ పీఆర్ కీ, కేంద్ర సమాచారం వ్యవస్థకీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 15 సెప్టెంబర్ 2020న ఈ ఉత్తర్వును (గ్యాగ్ ఆర్డర్) జారీ చేశారు. ఎఫ్ఐఆర్ లో కొందరు ప్రముఖులపైన ఆరోపణలు ఉన్నాయి. వారిలో దమ్మాలపాటి శ్రీనివాస్ ఒకరు.

అసంగతమైన ఉత్తర్వు: రాజీవ్ ధవన్

ప్రచురణ, ప్రసారంపైన స్టే ఇవ్వడం అనవసరమనీ, అసంగతమనీ రాజీవ్ ధవన్ గట్టిగా వాదించారు. హైకోర్టులోదమ్మాలపాటి దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో స్టే ఇవ్వమని అడగలేదనీ, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనీ, తనపైన భూకుంభకోణం కేసుకు సంబంధించిన వివరాలు పత్రికలలో, టీవీ చానళ్లలో రాకుండా చూడాలని మాత్రమే ఆయన కోరారు. భూకుంభకోణంపైన దర్యాప్తు నిలిపివేయాలని పిటిషనర్ కోరలేదు. అయినా సరే హైకోర్టు అమరావతి భూకుంభకోణంపైన దర్యాప్తును నిలిపివేయాలంటూ ఆదేశించింది.

సిట్ తో దర్యాప్తు చేయించాలన్న నిర్ణయం తక్షణం స్పందించి తీసుకున్నది కాదు. అమరావతి భూముల క్రయవిక్రయాలలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు కేబినెట్ ఉపసంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘం దస్త్రాలను పరిశీలించి, అన్ని వివరాలనూ తెలుసుకొని అక్రమాలు జరిగినట్టే ఉన్నాయంటూ కేబినెట్ కి నివేదిక సమర్పించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఒకరు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసి ఆరోపణలపైన సీబీఐ తో దర్యాప్తు చేయించాలని కోరారు. ఆ తర్వాతనే ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలంటూ ఆదేశించారు. ఆ మరుసటి రోజే హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ రిట్  పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ దాఖలు చేసిన రోజే ఉత్తర్వు

ఒక న్యాయమూర్తి ఈ కేసు తాను వినను అంటూ ప్రకటించారు. చీఫ్ జస్టిస్ మహేశ్వరి సాయంత్రం గం.5.30 కు ఒక బెంచ్ ఏర్పాటు చేశారు. అదే సాయంత్రం ఎఫ్ ఐ ఆర్ లోని అంశాల ప్రచార, ప్రసారాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దమ్మాలపాటి రిట్ పిటిషన్ లో పోలీసులను ‘జెస్టెపోలు’ అంటూ ప్రభుత్వానికి రాజ్యాంగంపట్ల విశ్వాసం లేదంటూ నిందించడం మినహా విషయం లేదనీ, అటువంటి పిటీషన్ పైన శక్తిమంతమైన ఉత్తర్వులు ఇచ్చారనీ రాజీవ్ ధవన్ అన్నారు. ‘‘నాజీలంటూ, జెస్టెపో లంటూ నిందిస్తూ పిటిషన్ దాఖలు చేస్తే మీరైతే స్టే ఉత్తర్వులు ఇచ్చేవారా? నిషేధపుటుత్తర్వులు జారీ చేసే వారా?’’ అంటూ ధర్మాసనంపైన ఉన్నన్యాయమూర్తులను ధవన్ ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు సహారా వర్సెస్ సెబీ కేసులో ఇచ్చిన తీర్పును ధవన్ గుర్తు చేశారు. ఎంతో అసాధారణమైన సందర్భంలో తప్పితే పత్రికారంగంపైన పరిమితులు విధించరాదని ఆ తీర్పులో సుప్రీంకోర్టు అన్నది. ఈ కేసులో అటువంటి అసాధారణమైన పరిస్థితులు ఏవీ కానరావడం లేదని వ్యాఖ్యానించారు.

ఎఫ్ఐఆర్ ని ప్రభుత్వం మీడియాకు లీక్ చేసింది : రొహట్గీ

దమ్మాలపాటి శ్రీనివాస్ తరఫున ముకుల్ రొహట్గీ వాదిస్తూ, ‘ఒక న్యాయమూర్తి కేసు వినలేనని చెప్పారు. చీఫ్ జస్టిస్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. నేనే ఈ పిటిషన్ ను అదే రోజు విచారణకు స్వీకరించాలని కోరాను. అదే జరిగింది. పిటిషన్ దాఖలైన రోజునే ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ చేశారు. పిటిషన్ లో ఎఫ్ఐఆర్ లోని అంశాలు లేవు. ఎఫ్ఐఆర్ ని అప్పటికే మీడియాకు లీక్ చేసింది,’ అని సీనియర్ న్యాయవాది ఆరోపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో అన్నీ అబద్ధాలు ఉన్నాయనీ, ఒకరి పరువు తీయడం చాలా తేలికనీ, ప్రతిష్ఠ సంపాదించడం చాలా కష్టమనీ రొహట్గీ వ్యాఖ్యానించారు. ఒక లాయర్ అడ్వకేట్ జనరల్ గా పని చేసినంత మాత్రాన అతడిపైన ఆరోపణలు సంధించడం సమంజసం కాదని రొహట్గీ అన్నారు. రాజధాని తరలింపు రహస్యం అనడం అసమంజసమనీ, రాజధాని తరలిస్తున్నట్టు ప్రజలందరికీ తెలుసుననీ, అది రహస్యం ఎట్లా అవుతుందనీ ఆయన ప్రశ్నించారు.

ఎస్ఎల్ పీ దాఖలు చేయడం అంటే హైకోర్టుపైన విశ్వాసరాహిత్యం ప్రకటించడమే: హరీష్ సాల్వే

హరీష్ సాల్వే కూడా దమ్మాలపాటి తరఫునే వాదిస్తూ, ఇటువంటి వ్యవహరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. గ్యాగ్ ఆర్డర్ తప్పని భావిస్తే ఆ ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టునే ఆశ్రయించాలనీ, సుప్రీంకోర్టుకు రావడం సరి కాదనీ, పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హైకోర్టు చీఫ్ జస్టిస్ పట్ల అవిశ్వాసం ప్రకటించారనీ వ్యాఖ్యానించారు. హైకోర్టులో విశ్వాసం లేనివారిని సుప్రీంకోర్టులోఅనుమతించడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సాల్వే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎస్ఎల్ పీ దాఖలు చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పట్ల అవిశ్వాసం ప్రకటించడమేనని సాల్వే అన్నారు.

కఠోరమైన ఉత్తర్వు ఇచ్చిన కోర్టుకే మళ్ళీ వెళ్లాలనడం అసమంజసం : థవన్

ముకుల్ రొహట్గీకీ, హరిష్ సాల్వేకి రాజీవ్ ధవన్ ప్రత్యుత్తరమిచ్చారు. ‘పిటిషన్ దాఖలు చేసిన రోజే విచారణ జరిపి ఉత్తర్వులు కూడా ఇవ్వడం అసాధారణమనీ, తొందరపాటనీ ధవన్ పునరుద్ఘాటించారు. గ్యాగ్ ఆర్డర్ రద్దు చేయమంటూ మళ్ళీ హైకోర్టుకే వెళ్ళాలని చెప్పడం సరి కాదనీ, పరమ దుర్మార్గమైన ఉత్తర్వు ఇచ్చిన హైకోర్టుకే సదరు ఉత్తర్వును రద్దు చేయాలని కోరులూ మళ్ళీ వెళ్లాలని చెప్పడంలో అర్థం లేదనీ ధవన్ అన్నారు. అక్రమాలు జరిగినట్టు ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవా అంటే ఈ పిటిషన్ తో పాటు దాఖలు చేసిన పత్రాలలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇది తొందరపాటు చర్యా అంటే కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించిన మీదట నివేదిక ఇచ్చింది, సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి రాశారు, చివరి ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయించాలని ఆదేశించారు. ఆదేశించిన మరుసటి రోజే దమ్మాలపాటి పిటిషన్ దాఖలైంది, అదే రోజు దర్యాప్తు నిలిపివేయాలంటూ హైకోర్టు ఉత్తర్వును జారీ చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించనే లేదు. గ్యాగ్ ఆర్డర్ నూ, దర్యాప్తును నిలిపివేసిన ఉత్తర్వునూ కొట్టివేయాలి’ అంటూ ధవన్ తన వాదన ముగించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles