Saturday, November 23, 2024

ఈడీకి సర్వాధికారాలు, ప్రాథమిక హక్కులు గాలికి!

  • ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అరెస్టు చేయవచ్చు
  • నిర్దోషిత్వం నిరూపించుకునే బాధ్యత నిందితులదే
  • బెయిల్ రావాలంటే ప్రాసిక్యూషన్ కనికరించాలి
  • సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు

మనీ లాండరింగ్ నేరాన్ని అరికట్టేందుకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను అదనుగా తీసుకొని దేశ పౌరుల ప్రాథమిక హక్కులను ఎట్లా కాలరాయవచ్చో నరేంద్రమోదీ ప్రభృతులు దేశవాసులకు చూపిస్తున్నారు. ఆ వైఖరిని సర్వోన్నత న్యాయస్థానం సంపూర్ణంగా సమర్థిస్తోంది. రాజుకంటే రాజభక్తి తనకు అధికంగా ఉన్నదని సుప్రీంకోర్టు నిరూపించుకుంటోంది. పౌరుల ప్రాథమిక హక్కులను గాలికి వదిలేస్తోంది. ప్రాథమిక హక్కులను పరిరక్షించవలసిన మౌలికమైన బాధ్యతను విస్మరించింది. అసమ్మతికి అవకాశం ఉండాలనీ, ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమైన పాత్ర ఉండాలనీ, మీడియా నిర్భయంగా వ్యవహరించానీ నిత్య అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నొక్కి వక్కాణిస్తున్నారు. అదే సమయంలో ఆయన అధ్యక్షతన పని చేస్తున్న న్యాయమూర్తులు ఆ స్ఫూర్తికి భిన్నంగా తీర్పులు ఇవ్వడం విశేషం.

పిటీషన్ కొట్టివేసిన ధర్మాసనం

విజయ్ మదన్ లాల్ చౌధరి, తదితరులూ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పిటిషనర్లు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) లోని కొన్ని అంశాల రాజ్యాంగబద్ధతను ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో జస్టిస్ లు ఎఎం ఖన్వీల్కర్, దినేష్ మహేశ్వరి, సిటి రవికుమార్ తో కూడిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేస్తూ ఈ చట్టం కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ)కి అనుమానితులకు అరెస్టు చేయడానికీ, విచారించడానికీ అధికారాలు సంపూర్ణంగా ఉన్నాయని తేల్చిచెప్పింది. అంటే మానవ హక్కులకు కాపలాదారుగా తన పాత్రను మరచిపోయి హక్కులకు ప్రమాదకారిగా తన పాత్రను సుప్రీంకోర్టు ధర్మాసనం అపార్థం చేసుకున్నదని అనుకోవలసి వస్తుంది.

మనీ లాండరింగ్ అంటే ఏమిటి?

మనీ లాండరింగ్ అంటే డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో వెల్లడించకుండా దాయడం. విదేశీ బ్యాంకు నుంచి వ్యాపార సంస్థల ద్వారా డబ్బులు అందుతున్నట్టు చెప్పడం, సదరు వ్యాపార సంస్థలు బోగస్ సంస్థలుగా, సూట్ కేసు కంపెనీలుగా తేలడం. ఉదాహరణకు మాదక ద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును హోటల్ వ్యాపారంలో వచ్చినట్టు దొంగ లెక్కలు చూపించడం కూడా మనీ లాండరింగ్ కిందికే వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, దొంగ సొమ్మును చట్టబద్ధమైన సొమ్ముగా నమ్మించాలని ప్రయత్నించడం మనీ లాండరింగ్. ఇది అక్రమం, దుర్మార్గం అనడంలో సందేహం లేదు. ఆ దురాచారాన్ని అరికట్టవలసిందే. కానీ అంతకంటే ప్రధానమైన పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ జరగదు. పీఎంఎల్ఏ 2002లో వచ్చింది. అది అటల్ బిహారీ వాజపేయి హయాంలో చేసిన చట్టం. అప్పటికే మనీ లాండరింగ్ గురించి అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమైంది. దాన్ని నిలువరించేందుకు అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాం. మనీ లాండరింగ్ ఉగ్రవాదంకంటే ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించిన ధర్మాసనం దాన్ని నివారించేందుకు సకల చర్యలూ తీసుకునే అధికారం ఈడీకి ఉన్నదని స్పష్టం చేసింది.

ఈడీ వెంటబడితే మీ ప్రమేయం ఏమీ ఉండదు

ఉదాహరణకు మీ పైన ఈడీ విచారణ ప్రారంభించిందని అనుకుందాం. మిమ్మల్ని ఎందుకు విచారిస్తున్నారో, ఎందుకు అరెస్టు చేస్తున్నారో, ఎందుకు జైల్లో పెడుతున్నారో చెప్పరు. ఏదో ముక్తసరిగా, అస్పష్టంగా రెండు మూడు భయంకరమైన ఆరోపణలు చేస్తారు. ప్రాథమిక సమాచార నివేదిక – ఫస్ట ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ – ఎఫ్ ఐ ఆర్ లో ఏమున్నదో వెల్లడించరు. మిమ్మల్ని కోర్టుకు తీసుకువెడతారు. సాక్షిగానో, నిందితుడిగానో తెలియదు. మీరు బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకుంటారు. మీరు రాజ్యానికి ప్రమాదకారి అనీ, ప్రాసిక్యూషన్ చెప్పే విషయాలు వినకుండా బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదనీ కోర్టు చెబుతుంది. మనీలాండరింగ్ చట్టంలో ఎంత వెసులుబాటు ఉన్నదంటే మామూలు విషయాలను సైతం పెద్ద నేరాలుగా చిత్రించే అవకాశం ఉన్నది. నిగూఢమైన లక్ష్యంతో మిమ్మల్ని అరెస్టు చేసిన ఈడీకి మిమ్మల్ని ఏదో ఒక నేరంలో ఇరికించి దోషులుగా నిరూపించడం కష్టం కాదు. బెయిల్ కావాలంటే ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నిరూపించుకోవాలి. అప్పుడు కానీ బెయిలు మంజూరు చేయడం గురించి న్యాయస్థానం ఆలోచించదు. కస్టడీలో ఉన్న వ్యక్తికి తాను నిరపరాధిననీ, అమాయకుడిననీ నిరూపించుకోవడం అసాధ్యం. అందుకని మీరు ఏ నేరం చేయకపోయినా జైల్లో మగ్గుతుంటారు. మీలాగా ఈ రోజున దేశంలోని జైళ్ళలో అలమటిస్తున్నవారు ఆరు లక్షలమందికి పైగా ఉంటారు. ఇది వింటే పెద్దగా బాధ అనిపించకపోవచ్చు. అనుభవిస్తేనే కానీ బాధ తెలియదు.

చిన్న నేరాలు కూడా ఈడీ పరిధిలోకి

ఈ చట్టానికి అనుబంధంగా చేర్చిన జాబితాలో పెద్ద నేరాలతో పాటు చిల్లర నేరాలను, తప్పిదాలను కూడా చేర్చారు. ఉదాహరణకు ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అవినీతి, పెద్ద ఎత్తున పన్నులనూ, సుంకాలనూ ఎగవేయడం వంటి నేరాలకు ఈ చట్టాన్ని పరిమితం చేస్తే బాగుండేది. అట్లా కాకుండా ఈ నేరాలతో పాటు ఫోర్జరీ, ఫ్రాడ్, చీటింగ్, కాపీ రైట్, ట్రేడ్ మార్క్ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి చిన్నపాటి నేరాలను కూడా జాబితాలో చేర్చి విస్తరించారు. చిన్నపాటి నేరాలను విచారించడానికి ఇతరత్రా అనేక చట్టాలు ఉన్నాయి. వాటిని ఈ ప్రమాదకరమైన చట్టం పరిధిలోకి తీసుకొని రావడం అధికార పార్టీ చేతికి అపరిమితమైన అధికారాలు ఇవ్వడమే. ఆ అధికారాలను దుర్వినియోగం చేయడంలో ఎన్ డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం కూడా ఒకటే. కానీ యూపీఏ కంటే నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వం రాజకీయ కక్షలు తీర్చుకోవడం అనే కళలో పదాకులు ఎక్కువే చదివింది. 2002 తర్వాత ఈ చట్టానికి అనేక సంవరణలు చేసి మరింత కఠినంగా మార్చారు. న్యాయాధికారుల ప్రమేయం లేకుండా ఈడీ అధికారులు ఎవరి నివాసంపైన అయినా, ఎవరి కార్యాలయంపైన అయినా దాడులు చేయవచ్చు. ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు సోనియాగాంధీనీ, రాహుల్ గాంధీని అరెస్టు చేయవచ్చు. వారికి బెయిలు రాకుండా చేయవచ్చు. వారు తమ అమాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశమే ఉండదు. నిజంగా అమాయకులైనా ఈడీ వదిలి పెట్టదు. విచారణ పేరుతో, ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పేరుతో, కేసు ఫైలు చేయడం పేరుతో నెలల తరబడి జైళ్ళలో బంధించగలదు. ఆస్తులను జప్తు చేయగలదు. లీకులు ఇచ్చి పత్రికలలో, టీవీలలో, సోషల్ మీడియాలో మిమ్మల్ని బదనాం చేసే కథనాలను అల్లి ప్రచారం చేసి మీ ప్రతిష్ఠను మంటగలపగలదు.

జగన్ అనుభవమే ఉదాహరణ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 16 మాసాలు జైలులో ఉన్నప్పటికీ సీబీఐ చార్జిషేట్ దాఖలు చేయలేదు. విడుదలైన తర్వాత  దాఖలు చేశారు. వాటి విచారణ తంతు సాగుతూనే ఉంది నిరంతరంగా. అంత పార్టీ యంత్రాంగం, పలుకుబడి ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా బెయిలు సంపాదించలేకపోయారు. మీబోటి మామూలు వ్యక్తులకు అసాధ్యం. ప్రభుత్వం కక్ష కడితే పాలక్షుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. బెయిలు మంజూరు చేయడంలో న్యాయస్థానాలు ఈడీ కంటే కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దిక్కున్నచోట చెప్పుకోమని అనడం ఆనవాయితీ. కోర్టుల రూపంలో ఇంతవరకూ ఉన్న ఆ దిక్కు కూడా ఇకమీదట లేదు.

ప్రభుత్వం కత్తికడితే అంతే సంగతులు

ప్రభుత్వం ప్రతిపక్షాలపైన కత్తికట్టినప్పుడు తప్పించుకోవడం అసాధ్యం. తప్పించుకోవడానికి ఒకటే మార్గం – అధికార పార్టీలో చేరడం. మన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాగా, మహారాష్ట్రలో రాజ్యసభ సభ్యుడు నారాయణ్ రాణే లాగా, పశ్చిమబెంగాల్ లో సువేందు అధికారిలాగా, అస్సాం ముఖ్యమంత్రి హేమంతా విశ్వ శర్మ లాగా, మరెందరో రాజకీయ, వ్యాపార ప్రముఖుల లాగా అధికార పార్టీలో చేరిపోయి కేసులను తప్పించుకోవడమే కాకుండా అధికారం పంచుకోవచ్చు. పార్టీలతో నిమిత్తం లేకుండా తమకు సర్వాధికారాలు ఇచ్చే చట్టాలను ఏ ప్రభుత్వం కూడా వదులుకోదు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చట్టాలను ఎదిరించి పోరాడవలసిన బాధ్యత పౌరులదే. న్యాయవ్యవస్థ సహకారం కూడా లేకపోతే ఈ పోరాటం మరింత కష్టభూయిష్టం అవుతుంది. కానీ ప్రజాస్వామ్యం మనుగడ కోసం పోరాటం అనివార్యం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles