- కేంద్రంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి
- చర్చల్లో విఫలమవడంపై ఆగ్రహం
- చట్టాల్ని నిలిపివేస్తారా లేదా అంటూ ప్రశ్నించిన కోర్టు
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు మొక్కవోని దీక్షతో చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాలు రద్దు చేయాలంటున్న రైతులకు, ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్ఠంభన ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సాగు చట్టాల రాజ్యాంగబద్థత, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటీషన్లను కోర్టు ఈ రోజు (జనవరి 11) విచారణ చేపట్టింద. రైతు ఆందోళనలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై తాము నిరాశతో ఉన్నామని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎస్ ఏ బోబ్డే, ఏఎస్ బోపన్న, వి. రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత ఆందోళనల నేపథ్యంలో చట్టాల అమలును కొంతకాలం నిలిపివేస్తారా లేదా కోర్టునే నిలిపివేయమంటారా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇది చదవండి: మెట్టుదిగని సర్కార్, రాజీపడని రైతు
చర్చలపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరు వర్గాల చర్చలు అసంపూర్తిగా ఎందుకు ముగుస్తున్నాయో తెలియడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆందోళనల్లో పాల్గొన్న రైతులు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలు వృద్ధులు, పిల్లు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నా కేంద్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించడంలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆందోళనతో రోజు రోజుకు పరిస్థితి దిగజారుతోందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించాలని పలువురు న్యాయవాదులు సూచిస్తున్నారని సీజేఐ తెలిపారు.
సాగు చట్టాల్ని రద్దు చేయాలని తాము చెప్పడంలేదని సమస్య పరిష్కారమయ్యేదాకా చట్టాల్ని కొంతకాలం నిలిపివేయగలరా అని ప్రశ్నించింది. ఇరువర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ఇది చదవండి: రైతు సంఘాలు, కేంద్రానికి మధ్య కొలిక్కిరాని చర్చలు