పెగాసెస్ గూడచర్యంపైన పిటిషన్ దాఖలు చేసినవారు ఏమి చెప్పదలచినా కోర్టులోనే చెప్పాలనీ, సోషల్ మీడియాలో సమాంతరంగా చర్చ కొనసాగించరాదనీ సుప్రీంకోర్డు ధర్మాసనం మంగళవారంనాడు నిక్కచ్చిగా చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నాయకత్వంలోని బెంచ్ మెగాసెస్ పైన దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిసి ఒకేసారి విచారణ చేపట్టింది. విచారణ మొదలైన రోజున ప్రధాన న్యాయమూర్తి రమణ మాట్లాడుతూ, ‘‘మీడియాలో వచ్చిన వార్తలు నిజమైతే ఇది చాలా గంభీరమైన అంశమే,’’ అని వ్యాఖ్యానించారు.
Also read: భారత క్రీడారత్నం ధ్యాన్ చంద్
సోమవారానికి వాయిదా
తనకు పిటిషన్లు అందాయనీ, వాటిపైన కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు ఏమిటో తెలుసుకునేందుకు శుక్రవారం వరకూ సమయం కావాలనీ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం విచారణ సందర్భంగా అన్న కారణంగా విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది.
‘‘సమాంతర చర్చ సోషల్ మీడియాలో ఎందుకు? ఏ చర్చ జరిగినా, మీరు ఏ ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకున్నా ఈ కోర్టు సరైన వేదిక. విషయం కోర్టులో ఉన్నప్పుడు చర్చ కోర్టులోనే జరగాలి. మీరు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇస్తుందని భావిస్తున్నా. క్రమశిక్షణ చాలా అవసరం. పిటిషనర్లు ఇంకా ఏమైనా చెప్పదలచుకుంటే అదనపు అఫిడవిట్ దాఖలు చేయవచ్చు’’ అని జస్టిస్ రమణ స్పష్టం చేశారు.
Also read: చరిత్ర సృష్టించిన సింధూ
రామ్ చేసిన పొరబాటు
పోయినవారం విచారణ జరిగినప్పుడు పిటిషనర్లలో ఒకరైన ది హిందూ పత్రిక చైర్మన్ ఎన్. రామ్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తి ప్రస్తావించారు. అందులో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక కోర్టులో పెగాసస్ పైన విచారణ జరుపుతున్న సందర్భంగా ఇండియాలో కొందరు జర్నలిస్టులపైన నిఘా ఉంచినట్టు వ్యాఖ్యానించడం జరిగిందంటూ రామ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అటువంటి సమాచారం అమెరికా కోర్టు తీర్పులో ఎక్కడా తనకు కనిపించలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించినప్పుడు అది పొరపాటని రామ్ తరఫు న్యాయవాది కపిల్ శిబ్బల్ అంగీకరించారు. రామ్ పొరపాటు ప్రకటన పిటిషన్ లో చేర్చినందుకు సోషల్ మీడియాలో చాలామంది ఆ సీనియర్ జర్నలిస్టును తప్పుపట్టి వెంటబడి వేధించారు (ట్రాల్ చేశారు). ఆ విషయాన్ని బెంచ్ మంగళవారంనాడు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాపైన చర్చ వద్దంటూ నిర్ణయించింది. రామ్ ప్రస్తావించింది 2019లో వాట్స్ అప్ కంపెనీ ఇజ్రాయెల్ కంపెనే ఎన్ఎస్ఓ గ్రూపు (ఇదే మెగాసస్ నిఘాసాఫ్ట్ వేర్ ను తయారు చేసింది.)పైన దావా వేసింది. అందులో టెలిఫోన్ హ్యాక్ చేయడానికి తమ స్పైవేర్ పెగాసస్ పనికి వచ్చే మాట వాస్తవమేననీ, కానీ తాము పక్కా ప్రభుత్వాలకు మాత్రమే ఆ సాఫ్ట్ వేర్ ను విక్రయిస్తామనీ ఎన్ఎస్ఓ గ్రూప్ వెల్లడించిందని కపిల్ శిబ్బల్ అన్నారు. అదే సమయంలో పెగాసస్ ను కొందరు భారత జర్నలిస్టులపైన నిఘా ఉంచేందుకు ఉపయోగించినట్టు ప్రస్తావన వచ్చిందంటూ రామ్ తన అఫిడవిట్ లో వ్యాఖ్యానించారు. అది పొరబాటనీ, అటువంటి ప్రస్తావన ఏదీ అమెరికా కోర్టులో రాలేదనీ తేలింది.
Also read: గ్రేట్ బ్రిటన్ పై ఇండియా హాకీ చారిత్రక విజయం
సోషల్ మీడియాతో సమస్య
‘‘సోషల్ మీడియా చర్చతో ఇదే సమస్య. ఏదో వాక్యాన్ని సందర్భశుద్ధి లేకుండా బయటికి లాగి వక్రభాష్యం చెబుతారు. నేను సవ్యంగా చదివానా లేదా అనే అనుమానం ఉంది. అందుకే ఆ ప్రశ్న అడిగాను. చర్చ హద్దు మీరకూడదు,’’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.
Also read: బసవరాజ్ బొమ్మయ్ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిశోర్, ప్రస్తుత మోదీ మంత్రివర్గ సభ్యుడు ఒకరు, మరి కొంతమందిపైన నిఘా జరిగి ఉండవచ్చుననీ, జరిగే అవకాశం ఉన్నదనీ, ఇటువంటి వారు 300 వరకూ భారత దేశంలో ఉంటారనీ ప్రముఖ జర్నలిస్టు సిద్దార్థవరదరాజన్ నాయకత్వంలో నడుస్తున్న ‘ద వైర్’ అనే మీడియా సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియాసంస్థలతో కలసి సంయుక్తంగా ‘ద వైర్’ పెగాసస్ విషయంలో పరిశోధన చేస్తోంది.
Also read: యూపీ బీజేపీకి ఊపిరి
నిమ్మకు నీరెక్కినట్టు ప్రభుత్వం
పెగాసస్ పైన వస్తున్న ఆరోపణలలో పని ఏ మాత్రం లేదని ప్రభత్వ వర్గాల నొక్కి వక్కాణిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సెగాసెస్ గూఢచర్యంపైన దర్యాప్తు చేయడానికి మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. పెగాసస్ తయారు చేసే ఎస్ఎన్ఓ కంపెనీతో భాతర దేశానికి ఎటువంటి లావాదేవీలు లేవని రక్షణ మంత్రిత్వశాఖ సోమవారంనాడు పార్లమెంటులో ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో ఇంతవరకూ నోరు విప్పలేదు. ఎగుమతులు పెరుగుతున్నాయనీ, ఇతరత్రా అభివృద్ధి దండిగా జరుగుతోందనీ తన ప్రభుత్వాన్ని మెరుగైన పద్ధతిలో చూపించే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారు.
Also read: ఎన్ఎస్సీఎస్ ద్వారా పెగాసస్ కు వందల కోట్లు చెల్లింపు: ప్రశాంత్ భూషణ్
ప్రతిపక్షం నిరంతరంగా ఆందోళన చేస్తోంది. పార్లమెంటు ఉభయ సభలలోనూ ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. సందట్లో సడేమిగా అన్న చందంగా సమగ్రంగా చర్చ జరగవలసిన బిల్లులు చర్చ జరగకుండానే పార్లమెంటు ఆమోదం పొందుతున్నాయి. సోమవారంనాడు ఇరవై నిమిషాలలో మూడు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గ్రహణం పట్టినదనడానికి నిదర్శనం. ఇదీ బాగానే ఉందని ఏలినవారు అనుకుంటున్నారేమో తెలియదు. పెగాసస్ పైన చర్చకు మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టంగా ప్రభుత్వం చెప్పకనే చెబుతున్నది.
Also read: భయంగొలుపుతున్న పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్