క్రికెట్ వ్యవహారంలో సంక్షోభాన్ని పరిష్కరించిన న్యాయవాది, అయోధ్య కేసులో హిందువుల తరఫున వాదించిన న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవోన్నతి పొందడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి పి. ఎస్. నరసింహ తెలుగుతేజం. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేరితే నలుగురు తెలుగువారు ఒకే సమయంలో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా ఉన్నట్టు అవుతుంది. ఇది ఏ రాష్ట్రానికైనా గర్వకారణం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ, కలీజియం సభ్యుడు ఎల్ నాగేశ్వరరావు, మరో న్యాయమూర్తి ఆర్ సుభాష్ రెడ్డి తర్వాత నాలుగో తెలుగు న్యాయమూర్తి నరసింహ అవుతారు.
డెబ్బయ్ ఒక్క ఏళ్ళ సుప్రీంకోర్టు చరిత్రలో న్యాయవాది స్థాయి నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జాంబవంతుని అంగవేసిన ఆరవ వ్యక్తిగా నరసింహ చరిత్రలో మిగిలిపోతారు.
1993 తర్వాత ఎన్ సంతోష్ హెగ్డే, ఆర్ ఎఫ్ నారిమన్, యు.యు. లలిత్, ఎల్ నాగేశ్వరరావు, ఇందూ మల్హోత్రాలను సుప్రీంకోర్టు న్యాయవాదుల స్థాయి నుంచి న్యాయమూర్తుల స్థాయికి పదవోన్నది కల్పించారు. న్యాయవాద స్థాయి నుంచి న్యాయమూర్తిగా ఎదిగిన ఆరుగురిలో ఇద్దరు (ఎల్ నాగేశ్వరరావు, నరసింహ) తెలుగువారు కావడం విశేషం. జస్టిస్ లలిత్, జస్టిస్ నాగేశ్వరరావు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణతో పాటు ఎల్ నాగేశ్వరరావు కూడా కొలీజియం సభ్యులు.
జస్టిస్ కోదండరామయ్య కుమారుడు
నరసింహకు న్యాయవిద్య తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. తండ్రి జస్టిస్ పి. కోదండరామయ్య 9 జులై 1982 నుంచి 26 అక్టోబర్ 1988 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. కోదండరామయ్య ఫౌండేషన్ తెనాలి విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇచ్చేది. ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ద్వారా ముఖ్యమైన సంస్కృత రచనలను తెలుగులోకి అనువదించే బృహత్ కార్యక్రమాన్ని ఆయన అమలు చేశారు. ప్రకాశం జిల్లా మోదేపల్లికి చెందిన కోదండరామయ్య కృష్ణాజిల్లా గణపవరంలో స్థిరపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాయలంలోనూ, మద్రాసు విశ్వవిద్యాలయంలోనూ లా చదివారు. ఆదర్శప్రాయుడైన న్యాయమూర్తిగా కోదండరామయ్య పేరు తెచ్చుకున్నారు.
నిజాంకాలేజిలో బీఏ
నరసింహ 3 మే 1963లో హైదరాబాద్ లో జన్మించారు. నిజాంకాలేజిలో బీఏ చదివి ఎల్ఎల్ బీ దిల్లి యూనివర్శిటీ కాలేజీలో ఉంటూ చదువుకున్నారు. 25 ఆగస్టు 1988న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రెండేళ్ళు హైకోర్టులో ప్రాక్టీసు చేసిన తర్వాత 1990లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ సీనియర్ న్యాయవాదిగా, సమర్థుడైన న్యాయకోవిదుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. 2014 నుంచి 2018 వరకూ అదనపు సొలిసిటర్ జనరల్ గా పని చేశారు. రామజన్మభూమి కేసులో రామ్ లల్లా విరాజ్ మాన్ తరఫున మహంత్ రామచంద్రదాస్ క ప్రాతినిధ్యం వహిస్తూ వాదనలు చేశారు. ఉచితంగా న్యాయసేవలు అందించే జాతీయ న్యాయసహాయ ట్రస్టు సభ్యుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు నియమించిన ఎమిరస్ క్యూరీ (న్యాయసహాయకుడు)హోదాలో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)పనితీరులో భారీ సంస్కరణలకు కారణభూతుడైనారు. మంచి వాదనాపటిమ కలిగిన న్యాయవాదిగా, క్లిష్టమైన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించే నేర్పు కలిగిన న్యాయప్రవీణుడిగా పేరు సంపాదించుకున్నారు.