అమానవీయమైన సంక్షోభాన్ని నివారించేందుకు పంజ్ షీర్ లో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని స్వయంగా ప్రకటిత అఫ్ఘానిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడు, ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే విజ్ఞప్తి చేశారు. తాలిబాన్, మరికొన్ని విదేశీ ముఠాలు పంజ్ షీర్ పైన విరుచుకుపడుతున్నాయనీ, పంజ్ షీర్ చుట్టూ ఆర్థిక దిగ్బంధనాన్ని విధించాయనీ, ఆకలితో, దప్పికతో ప్రజలు చనిపోయే ప్రమాదం ఉన్నదనీ సాలే ఒక లేఖలో ఐక్యరాజ్యసమితికి వివరించారు. పంజ్ షీర్ రాష్ట్రం, పక్కనే ఉన్న బాఘ్లాన్ రాష్ట్రంలో మూడు జిల్లాలూ ఆర్థిక దిగ్భంధనంతో సతమతమౌతున్నాయని ఆయన అన్నారు.
పంజ్ షీర్ లో ఉండే రెండు లక్షల యాభైవేల మంది జనాభాకు తోడు కాబూల్ తాలిబాన్ హస్తగతమైన తర్వాత అఫ్ఘానిస్తాన్ లోని పలు ప్రాంతాల నుంచి పంజ్ షీర్ కు వలస వచ్చినవారూ, అఫ్ఘాన్ సైనికులూ పది వేలమంది దాకా ఉంటారని ఆయన తెలిపారు. అఫ్ఘాన్ రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు తలదాచుకోవడానికి కూడా వసతి లేదనీ, తిండి లేక, నీరు లేక వారు అలమటిస్తున్నారనీ, వారు మసీదులలో, పాఠశాలల్లో నివసిస్తున్నారనీ, కొందరు ఆరుబయట ఏ ఆచ్ఛాదనా లేకుండా నివసిస్తున్నారనీ, మానవీయ కోణంతో ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని సాలే అభ్యర్థించారు. చర్చలు జరిపైనా సరే, హితవు చెప్పయినా సరే తాలిబాన్ దాడులనూ, దిగ్బంధనాన్నీ అపుచేయించాలనీ, లేకపోతే వేలమంది ప్రజలు మరణించే ప్రమాదం ఉన్నదనీ సాలే తెలియజేశారు.
పంజ్ షీర్ కోసం పోరాటం
తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకోవడం ఆగస్టు 15 నాడు పూర్తయింది. వారికి లొంగకుండా ఉన్న రాష్ట్రం కాబూల్ కి వంద మైళ్ళ దూరంలో ఉన్న పంజ్ షీర్ లోయ ఒక్కటే. దానిని కూడా ఆక్రమించుకోవాలని తాలిబాన్ దృఢసంకల్పంతో ఉంది. 1996 నుంచి 2001 వరకూ సాగిన తాలిబాన్ పాలన సమయంలో కూడా పంజ్ షీర్ స్వతంత్రంగానే ఉన్నది కానీ తాలిబాన్ వశం కాలేదు. అప్పుడు నార్దరన్ అలయెన్స్ (ఉత్తరాది కూటమి) అధినేత అహ్మద్ షా మసూద్ నాయకత్వంలో పంజ్ షీర్ ఉండేది. 2001లో న్యూయార్క్ లోని జంటశిఖరాలపైన దాడి చేయడానికి రెండు రోజుల ముందే అల్ ఖాయిదా ఆత్మాహుతి దళ సభ్యుడు అహ్మద్ షా మసూద్ ని హత్య చేశాడు. అప్పటి నుంచి ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ పంజ్ షీర్ అధిపతిగా ఉన్నాడు. తాలిబాన్ విజయాన్ని గుర్తించి వారితో చర్చలూ, సంప్రతింపులు జరిపి ప్రభుత్వంలో భాగం కావాలని అహ్మద్ కోరుకున్నాడు. చర్చలు జరిగినాయి కానీ ఫలప్రదం కాలేదు. చర్చలు విఫలం కాగానే తాలిబాన్ దాడి ప్రారంభించింది.
700మంది తాలిబాన్ మృతి
వారం రోజులుగా పంజ్ షీర్ కోసం జరుగుతున్న పోరాటంలో సుమారు ఏడు వందల మంది తాలిబాన్ చనిపోయారనీ, ఆరు వందలమంది దాకా లొంగిపోయారనీ నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ (ఎన్ఆర్ఎఫ్) ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే, తాము పంజ్ షీర్ రాజధాని బజారక్ ను ఆక్రమించుకున్నామనీ, పంజ్ షీర్ కేంద్ర స్థానంవైపు కదులుతున్నామని తాలిబాన్ ప్రతినిధి బలాల్ కరీమీ చెప్పారు. తాము వేలాది మంది తాలిబాన్ ను చుట్టుముట్టామనీ, ఖవాక్ కనుమలోనూ, దాష్టే దివాక్ ప్రాంతంలోనూ వాహనాలనూ, ఆయుధాలను వదిలేసి తాలిబాన్ పారిపోయారనీ ఎన్ఆర్ఎఫ్ ప్రతినిధి చెప్పుకొచ్చారు. పరిస్థితి అస్పష్టంగా ఉంది. ఎవరి కథ వారు వినిపిస్తున్నారు. వాస్తవ పరిస్థితిపట్ల స్పష్టత కొరవడింది.