మా అభిప్రాయం మాది… మీ అభిప్రాయం మీది…!
మన మధ్య అభిప్రాయభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు…!
మన మధ్య భేదాలు, విభేదాలు కూడా ఉండొచ్చు…!
మీకు సమ్మతమైనదానిపై మాకు అసమ్మతి ఉండొచ్చు…!
మా అసమ్మతి కూడా మీకు సమ్మతం కాకపోవచ్చు…!
అయితే ఏం…?
అంతమాత్రానికే… మమ్మల్ని మీరు ద్రోహులనో, విద్రోహులనో, దేశద్రోహులనో చేసేస్తారా…?
మీకెందుకింత అసహనం…?
ఎందుకింత “అహం”భావం…?
మీకెందుకింత “అహం”కారం…?
ఏ మెట్లెక్కి మీరు వచ్చారో… ఏ మెట్లపై మీరంతా పైకొచ్చారో… ఏ మెట్లకు మీరు కన్నీళ్లతో మొక్కారో మీకు గుర్తుందా…?
ఆ మెట్లనే ఈరోజున అవసరం తీరిందని మీరు కూలదోయాలంటున్నారే…!
కూలదోయాలనుకుంటున్నారే…!
దయచేసి, మీ దురహంకారాలన్నీ దూరం చేసుకోండి…!
మన మూలాలు మరవద్దండీ …!
దానవులై, మన పునాదులనే కూల్చవద్దండీ..!
మనం కూర్చున్న, మనందరికీ కూడా నీడనిచ్చిన, జీవితాన్నిస్తున్న చెట్టు కొమ్మల్ని దయచేసి నరకొద్దండీ…!
ఇదెక్కడి అన్యాయం…?
ఇంత అధర్మం…?
మనసమాజంలోని మేధావులు కూడా ఈరోజు మాట్లాడాలంటే భయపడుతున్నారు…
కవులు, కళాకారులే కాదు సామాన్యులు కూడా స్పందించడానికే భయపడుతున్నారు…!!!
అందరికీ భయం…!
అన్నింటికీ భయం…!
అంతటా భయం…!
అందరిలో ఒకటే భయం – భయం…?
ఎంతకాలం ఈ భయం…?
ఇలా అందర్నీ మరెంతకాలం భయపెడతారు…?
మనసమాజాన్ని ఎంతకాలం ఇలా భయభ్రాంతులకు గురిచేస్తారు…?
అదృష్టవశాత్తూ… మన “న్యాయదేవత” ఇప్పుడు కళ్ళు తెరుచుకునే వుంది…
మనదేశంలోని “న్యాయవ్యవస్థ” పుణ్యమా అని “ధర్మం” ఇంకా ఈ కలియుగంలో కూడా, ఒక్క పాదంపైనైనా నిలబడుతోంది… మనగలుగుతోంది…
Also Read: అసమ్మతి మన రాజ్యాంగహక్కు
అసమ్మతి మన రాజ్యాంగ హక్కు
అధికారమత్తులో విర్రవీగుతున్నవారు కళ్లు తెరవాలి…
వాస్తవాలు తెలుసుకోవాలి…
అందర్నీ అర్థం చేసుకోవాలి…
నిజాయితీతో న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి… !
ప్రజల కష్ట-నష్టాలు తెలుసుకోవాలి…
సానుభూతితో అర్ధం చేసుకోవాలి…
సుఖ-దుఃఖాలను పంచుకోవాలి…
సహానుభూతిని పెంచుకోవాలి…!
ఈ గడ్డపై ఇంతవరకూ ఎందరో నియంతలూ, క్రూరులూ, కర్కోటకులూ, నిరంకుశులూ మట్టికొట్టుకుపోయారు…!
చరిత్రలో, నియంతృత్వం ముసుగులో ఒక చీకటి అధ్యాయంలాగా, కాలగర్భంలో కలసిపోయారు…!
మీరెంత…?
మీ బతుకెంత…?
అగ్నిశిఖలనెవ్వరూ ఆపలేరు…!
వాస్తవమెంత కఠినమైనదైనా…
సత్యం సత్యమే…!
నిజమెంత నిష్ఠురమైనదైనా…
నిజం నిప్పులాంటిదే…!
“నసత్యం ఛిన్దన్తి శస్త్రాణి”…
సత్యాన్ని ఏ శస్త్రాలూ, అస్త్రాలూ, ఆయుధాలూ ఛేదించలేవు…!
అలాంటి సత్యాన్ని పలకలేని స్వేచ్ఛ ఎందుకు…?
“నసత్యం దహతి పావకః”…
సత్యాన్ని ఏ అగ్ని కూడా దహింపలేదు…!
అలాంటి సత్యాన్ని కూడా చెప్పలేని స్వాతంత్ర్యమెందుకు…?
నిత్యం అసత్యాలమధ్య జీవించే బతుకెందుకు…?
“సత్యం వద… ధర్మం చరః”…
అంటే సత్యాన్ని వధించమనీ, ధర్మాన్ని చెరబట్టమనీ కాదు…!
“సత్యాన్నే ఎప్పుడూ పలకాలి – ధర్మాన్ని ఎల్లపుడూ ఆచరించాలి” అని…
‘సత్యము- ధర్మమూ’ భారతదేశాన్ని, ప్రజల్ని, సమాజాన్ని, మేధావుల్ని, కవుల్ని, కళాకారుల్ని విసృతంగా చైతన్యపరిచి, జాగృతంచేసి, ఒక సంఘటిత మహాపోరాటశక్తిగా మలచే ఉత్ప్రేరకాలు… జీవనగమనాలు…!
Also Read: నేనూ… నా స్వేచ్ఛ… నా స్వాతంత్రం…
ఇవే లేని రోజు, ఇవి ఆచరించలేని రోజు…
మనకెందుకీ పనికిరాని స్వేచ్ఛ…?
ఎందుకీ పనికిమాలిన స్వాతంత్ర్యం…?
సత్యమేవ జయతే…
ఎప్పటికీ సత్యమే జయిస్తుంది…
జై హింద్… భారత మాతకు జై.