Sunday, November 24, 2024

మానవత్వం ప్రబోధించిన శక్తిస్వరూపుడు

ఆయన నిన్నటి వరకూ  మనం చూసిన మనలాంటి మనిషి. వేష,భాషలు, రూపురేఖలు కొంచెం విభిన్నంగా కనిపించినా, మన మధ్యే తిరిగి, మనలాగే మాట్లాడి, మన వలె చమత్కార, హాస్య సంభాషణలు చేసినవాడే. కానీ,  ప్రపంచం ఆయన్ని వింతగా చూసింది, కొత్తగా చూసింది, కొందరు మహోన్నతంగా చూశారు. ఇప్పటికీ కొందరు ధ్యాన, యోగ మార్గాల్లో ఊహించుకుంటూ దర్శనం చేసుకుంటూ ఉంటారు.తద్వారా మనోబలాన్ని పెంచుకుంటూ ఉన్నారు. కొండలు, బండరాళ్లు, పిచ్చి మొక్కలు వెలసిన చోటే ఆయనా వెలిశాడు. వెలిగాడు. ఎందరికో వెలుగులు పంచాడు. చీకట్లు పారద్రోలాడు. ఇక్కట్లు తొలిగించాడు.ఎప్పుడో వాన కురిస్తే తప్ప అక్కడ నీరు కనిపించదు. మొక్క వికసించదు. ఎద్దుల బండ్లే ప్రయాణ సాధనాలు,  దీపపు బుడ్లే విద్యుత్ సౌధాలు. అంతగా  వెనకబడిన ఆ నేల వైపే  ప్రపంచమంతా చూసేట్టు చేశాడు. గుడిసెల స్థానంలో ఆకాశహర్మ్యాలు వెలిశేట్టు చూశాడు.

నిరక్షరకుక్షులు నడిచిన చోట విద్యాలయాలు

నిరక్షర కుక్షులు నడిచిన చోటే విశ్వవిద్యాలయాలు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు  నిర్మాణమయ్యాయి. ఆ రాళ్ళ బాటల్లో రోల్స్ రాయిస్ కార్లు తిరిగాయి. బస్సెక్కాలంటే, ట్రైన్ పట్టుకోవాలంటే మైళ్ళు నడవాల్సిన చోట ప్రత్యేక విమానాశ్రయమే వెలిసింది. విసిరి పడేసినట్లు ఎక్కడో  ఉండే ఆ కుగ్రామానికి ప్రపంచ దేశాల పెద్దలంతా  నడిచివచ్చారు. నిధులు, యంత్రాంగం ఉన్న ప్రభుత్వాలు చేపట్టిన  ప్రాజెక్టులు   అనుకున్న సమయానికి పూర్తవ్వవు. అక్కడ మాత్రం  ఎప్పటికి పూర్తవ్వాలని అనుకుంటే కచ్చితంగా అప్పటికే  విజయవంతంగా ఆ ప్రాజెక్ట్ సంపూర్ణమవుతుంది. అది అక్కడి ప్రత్యేకత. అదీ, వారి సంకల్పబలం. ఈ బలానికి, బలగానికి మూలం సత్యసాయిబాబా.

ఆ ఊరిలో ఉదయమే ఓంకారం వినిపిస్తుంది

ఆ ఊరు పుట్టపర్తి. అక్కడ పొద్దున్నే ఓంకారం వినిపిస్తుంది. మధ్య మధ్యలో భజనలు మారుమ్రోగుతుంటాయి. పేరెన్నిక కన్న కళాకారులు పాడి వెళ్లిపోతుంటారు. దేశాధినేతలు,  సెలెబ్రెటీలు,వ్యాపార దిగ్గజాలు బాబాను దర్శించుకోవడం కోసం ఆ సీమకు బారులు కట్టినవారే. ఆ కేంద్రానికి  పెట్టిన పేరు ప్రశాంతి నిలయం. పేరుకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉంటుంది.  ఏదైనా  అయస్కాంతం అక్కడ వెలిసిందా అని ఇప్పటికీ ఎందరో ఆశ్చర్యపోతుంటారు. ఆ అయస్కాంతం, ఆ అకర్షణ, ఆ  శక్తి, ఆ  వైభవం ఆ నేలకు తెచ్చిపెట్టిందీ, ఆ మట్టిని బంగారంగా మార్చిందీ సత్యసాయిబాబా అనే ఒకే ఒక  వ్యక్తి. 

శివుడూ, శక్తీ తనలో ఉన్నాయని చెప్పారు

లెక్కల ప్రకారం 1926లో నవంబర్ 23వ తేదీ నాడు జన్మించారు.నేటికి 94ఏళ్ళు నిండాయి. అందరి వలె కొంతకాలం జీవించి, భౌతికంగా ఈ లోకం వీడివెళ్లిపోయారు. సత్యసాయి, శాంతిసాయి, ప్రేమసాయి ఈ పేర్లు ఆయనవే. మహారాష్ట్రలో వైభవ ప్రభావంతో వెలిగిపోతున్న ఆధ్యాత్మిక కేంద్రం షిరిడీ. ఆ శక్తికి మూలపురుషుడు  పేరు కూడా సాయిబాబా. ఆయనే నేను -నేనే ఆయన అని ఈ పుట్టపర్తి సాయి  చెప్పుకున్నారు. శివుడు, శక్తి నాలో ఉన్నారనీ చెప్పారు. నమ్మిన వాళ్లు నమ్మారు. నమ్మని వాళ్లు నమ్మలేదు. ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు, నమ్మనివారూ ఉన్నారు.

విద్య, వైద్య రంగాలలో ఆయన సేవ గొప్పది

ఒకటి మాత్రం అందరూ నమ్ముతారు. ఆయన దేవుడా,  దైవదూతా, మ్యాజిక్కులు చేసే గారడీవాడా అనే విమర్శలు ప్రశంసలు పక్కన పెట్టి చూస్తే, ఆయన చేసిన సేవ గొప్పది. ఆయన వల్ల జరిగిన మేలు గొప్పది. విద్య, వైద్యం, భోజనం ఎందరికో అందింది. ఇప్పటికీ ఎందరికో అందుతోంది. దీన్ని అందరూ నమ్ముతారు. అందుకు ఆయన్ను  అభిమానిస్తారు. అదే గొప్ప విషయం. అదే సత్యసాయిబాబా ఆకర్షణ. అదే ఆయన వల్ల జాతికి జరిగిన ప్రయోజనం. ప్రేమ, సేవ రెండింటినీ ఆయన నమ్మాడు. అందించాడు.  అందించమని  అందరికీ చెప్పాడు. ప్రేమ, సేవ రెండూ గొప్ప మార్గాలు. అవి ఆచరించినవారు, ఆచరణకు దారి ఇచ్చినవారు, ఆచరించమని ప్రబోధం చేసినవాళ్లు అందరూ గొప్పవాళ్లే. ఆ విధంగా పుట్టపర్తి సత్యసాయిబాబాను గౌరవిద్దాం.

సత్యం, శివం, సుందరం

సత్యమే సుందరం, అదే శుభం, అదే శివం అని బాబా విరివిగా ప్రచారం చేశారు. ముంబయి,హైదరాబాద్, చెన్నైలో సత్యం,శివం, సుందరం అనే కేంద్రాలు స్థాపించారు. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాల్లో 10వేల సత్యసాయి సేవాసంస్థల ద్వారా కొన్ని లక్షల మందికి  విద్య, వైద్య సేవలు, సహకార, ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. శాంతి, ప్రేమ, సేవల గురించి బాబా చేసిన బోధనలు ఎందరినో ఆకర్షించాయి. మత సామరస్యం, సకలజీవుల పట్ల ప్రేమ, అహింస కలిగి ఉండమని బాబా  చెప్పిన మాటలు ప్రపంచానికి బహుళ ప్రయోజనాన్ని కలిగించే గొప్ప శక్తి మంత్రాలు.

అబ్దుల్ కలాం నుంచి పీవీ వరకూ…

అబ్దుల్ కలామ్ నుండి పివి నరసింహారావు వరకూ, గవాస్కర్ నుండి టెండూల్కర్ వరకూ, లతా మంగేష్కర్ నుండి పి సుశీల వరకూ, వాజ్ పేయి నుండి మోదీ వరకూ, మన్ మోహన్ సింగ్ నుండి టి ఎన్ శేషన్ వరకూ ఎందరో పెద్దలు బాబాను గౌరవించారు. ఇష్టపడ్డారు. బాబాతో సన్నిహితంగా మెలిగినవారికి, స్వయంగా అనుభవాలు పోగుచేసుకున్నవారికి, అనుభూతులు పొందినవారికీ, బంగారూ అని పిలిపించుకున్నవారికీ ఆయన గురించి తెలుసు. వారిలో నాస్తికులున్నారు, తార్కికులున్నారు, మనోవైజ్ఞానశాస్త్ర నిపుణులు ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, మేధావులున్నారు. వారందరూ ఆయనలో ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని గ్రహించిన వారే కావడం విశేషం.

ఆయన ఎందరికో స్ఫూర్తిప్రదాత

మహిమలు మొదలైన అంశాలను అలా ఉంచగా, ఆయన వల్ల ఎందరో స్ఫూర్తి పొందారు, ఊరట పొందారు, మార్గదర్శనం నిర్దేశించుకున్నారు. లక్షలాది మంది సామాన్యులకు ఎన్నో మేళ్లు జరిగాయి.  ఇంకా జరుగుతూ ఉన్నాయి. బాబా అంత గొప్ప వ్యవస్థను నిర్మాణం చేసివెళ్లి పోయారు. అయన దైవమా, దైవదూతా, మామూలు మనిషా అనే విషయాలు అప్రస్తుతం. వారు నిర్మించిన వ్యవస్థల ద్వారా జాతికి జరిగే మేలు ఎప్పటికీ ప్రస్తుతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ సత్యసాయిబాబా భారతీయుడు, మన తెలుగువాడు. అదీ మనకు గర్వకారణం. జాతిని జాగృతి వైపు, సమాజాన్ని శాంతి వైపు, మనుషుల్ని ప్రేమ, సేవలవైపు, దేశాన్ని ప్రగతి వైపు నడిపించే ఏ వ్యక్తి అయినా అతను ఆరాధ్యుడే. అటువంటివారు ఈ లోకానికి ఇంకా కావాలి, రావాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles