- మితభాషి, శ్రమజీవి
- బొమ్మలో, సినిమాలో తనదైన ప్రత్యేక శైలి
- అరుదైన కళాతపస్వి
- ముళ్ళపూడి వెంకటరమణకు ప్రాణస్నేహితుడు
అందమైన తెలుగు అమ్మాయి బొమ్మకు, ఆకట్టుకునే లిపికి చిరునామా. `బాపు లెటర్స్` అని పేరుతోనే అక్షరమాల ప్రసిద్ధమైందని అందరికీ తెలిసిందే. `బాపు బొమ్మ`ని అనిపించుకోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.
`గీత`
సత్తిరాజు లక్ష్మీనారాయణ అంటే కొంత తడుముకోవాలి తెలుసుకునేందుకు. `బాపు` అంటే ఇట్టే తెలిసిపోయి ఆయన గీత, రాత, తీత (సినిమాలు) కళ్ల ముందు కదలాడతాయి. ఆయన గీత, రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. క్లుప్తంగా గీసిన బొమ్మ కింద చేవ్రాలు లేకపోయినా, దర్శకుడిగా పేరు చూడకపోయా ఈ ` గీత, తీత` బాపుగారిదే అని గుర్తించగలిగేంత ప్రత్యేకత ఆయనది. పన్నెండేళ్లవయసు నుంచే చిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, పత్రికలు, పుస్తకాలకు ముఖచిత్రాలు…ఇలా వేలకొద్దీ గీశారు. సందర్భానికి తగన భావం, గీతల పొదుపు, తెలుగుదనం ఆయన బొమ్మల ప్రత్యేకత.
`కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా` అని ఆరుద్ర ఎన్నడో మెచ్చేశారు. `సాక్షి` నుంచి `శ్రీరామరాజ్యం` దాకా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీసిన 51 చిత్రాలతో అనేక పురస్కారాలు అందుకున్నారు.
బాపు…అంటే…
ఏ కలం పేరో, కుంచె పేరో కాదు. వారి నాన్నారు వేణుగోపాలరావు గారికి మహాత్మాగాంధీ అంటే చాలా ఇష్టమట. అందుకే ’బాపు` అని ముద్దుగా పిలిచేవారట. అలా ఆయన `బాపు‘గా స్థిరపడిపోయారు.
సమయపాలకుడు
బాపు గారు సమయపాలనకు అత్యంత విలువ నిచ్చేవారు. తనను కలిసేందుకు సమయం కోరిన వారి రాకకు పది నిమిషాల ముందే తయారై ఉండేవారు. అలాగే చెప్పిన సమయానికి రాకపోతే చిరాకు పడేవారు. అదే సమయంలో తాను చెప్పిన సమయానికి వెళ్లే అవకాశం లేకపోతే వెంటనే కబురంపేవారు. సినిమా చిత్రీకరణలో `తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పనిచేస్తారు, చేయించుకుంటారు` అని ఆయన దగ్గర పనిచేసిన వారు చెబుతారు. `ముత్యాలముగ్గు`లో విలన్ గారున్నట్టు ఆయన మితభాషి.
తప్పపోయిన చిత్రం
అక్కినేని త్యాగయ్యగా, ఎన్టీఆర్ శ్రీరాముడిగా `త్యాగరాజ రామాయణం‘ కోసం ప్రాణమిత్రులు బాపు-రమణలు ప్రణాళిక రూపొందించారు. అయితే అక్కినేని చికిత్స కోసం విదేశాలకు వెళ్లడంతో ఆ చిత్రం అప్పటికి ఆగిపోయింది. ఈలోగా తక్కువ బడ్జెట్ తో అదే నిర్మాతలతో `లవకుశ`ను సాంఘీకరిస్తూ తీసిన `ముత్యాలముగ్గు‘ సాధించిన ఘన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
వీడని జంట వీడింది
ఆ బాల్య మిత్రులు బాపు-రమణ గార్లను విడివిడిగా చూడలేం. అసలు అలా ఊహించలేం అంటారు అబిమానులు.చిన్నతనంలో కలసి దశాబ్దాల నెయ్యంతో ’బాప్ రే‘ అనిపించుకున్న జంటలో రమణ గారు దూరం కావడాన్ని జీర్ణించుకోలేక పోయారు. `శ్రీ రామరాజ్యం‘ చిత్రీకరణ ఆరంభంలోనే రమణ గారు శ్రీరామ సాయుజ్యం పొందారు. సినిమా చిత్రీకరణ సమయంలోనూ ఎడబాటు ఎరుగని మిత్రద్వయం. ఈ రాముడి సినిమాకు మాత్రం `ఆత్మ`లేని మనిషి దర్శకత్వం వహిస్తున్నాడు` అనే భావనలో ఉండేవారు బాపు గారు. అప్పటికి కొన్నేళ్ల క్రితం ఒక సినిమా (సుందరకాండ) చిత్రీకరణ సమయంలో రమణగారు చెన్నైలో ఉండిపోతే ఒంటరితనం అనుభవించిన బాపుగారు, నేస్తం దూరమైన తరువాత మూడున్నరేళ్లు బాధాతప్త హృదయంతోనే గడిపారు. ఆ సమయంలో మనసు నెమ్మదింపచేయాలనే ప్రయత్నంలో `ఏదైనా సినిమా మొదలెట్టకూడదూ!` అని ఆత్మీయులు అంటే ’బ్రహ్మ` (రమణ గారు) లేడుగా అనేది ఆయన సమధానం
72 ఏళ్ల చెలిమి
గీత(బాపు), రాత(రమణ)చెలిమి వమస్సు 72 ఏళ్లు. 2011లో రమణ గారు ఆయనను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. మిత్రుడి ఎడబాటుతో సగమైన బాపుగారు ఆ తర్వాత రెండేళ్లకు భార్య భాగ్యవతమ్మను కోల్పోయారు. ’స్నేహం చేసే ముందు ఆలోచించు. ఆ తరవాత కడదాక కొనసాగు` అని సూక్తికీ ఈ జంట అతీతం. ఎందుకంటే పదేళ్ల వయసులో జతకట్టిన కుర్రాళ్లకు అంత ఆలోచించే శక్తి ఎలా? ఉభయ గోదావరి జిల్లాల్లో పుట్టిన ఇద్దరు (బాపు-ప.గో., రమణ-తూ.గో)నాటి మదరాసులోనే కేసరి స్కూలులో దోస్తులయ్యారు, పత్రిక రంగం నుంచి సినిమా రంగం వారికి ప్రత్యేకత సాధించారు. ముఖ్యంగా తమ చిత్రాలలో తెలుగుదనాన్ని, సంస్కృతిని ప్రతిబింబించారు. అయినా అది తమ గొప్పదనం కాదనేవారు. `మాకు నచ్చిందాన్ని చేతనైట్లు చేశాం. అంతే` అన్నది ఏకవాక్యం సమాధానం. అదే `బాపు-రమణీయం`.
(డిసెంబర్ 15 బాపు జయంతి)