వోలేటి దివాకర్
డాక్టర్ వంగవీటి లక్ష్మీనారాయణ శాస్త్రి ( విఎల్‌ఎన్ శాస్త్రి ) ఈనాటి యువతకు పెద్దగా పరిచయం లేని పేరది. ఈనాటి వైద్యులకు పూర్తి భిన్నమైన మనస్తత్వం. ఆయన చేయి వేస్తే రోగం మటుమాయవుతుందని నమ్ముతారు. అలాగని వైద్యానికి ఇంతడబ్బులని డిమాండ్ చేయరు. రోగులు ఎంతిస్తే అంతే తీసుకుంటారు. ఒకవేళ రోగులకు మందులు కొనే స్తోమత లేకపోతే సొంత డబ్బులు ఇచ్చి మందులు కొనుక్కోమని చెప్పే గొప్ప మానవీయత శాస్త్రి సొంతం. అందుకే ఆయన పేదలు దేవుడిగా కొలుస్తారు. ఘనమైన కుటుంబ వారసత్వం ఉన్నా ఇప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉంటారు. 80 ఏళ్ల విఎల్‌ఎన్ శాస్త్రి వయోభారంతో మైసూరులోని తన కుమారుడి ఇంటి వద్ద గత ఏడాది పరమపదించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు .
ఘనమైన కుటుంబ వారసత్వం
కృష్ణా జిల్లా నుంచి వచ్చి స్థిరపడిన స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ వంగవీటి వెంకట్రామయ్య దీక్షితుల కుమారుడే డాక్టర్ శాస్త్రి. దీక్షితులు దివంగత మాజీ మంత్రి డాక్టర్ ఎబి నాగేశ్వరరావు కుడిభుజంగా వ్యవహరించేవారు. స్వాతంత్ర్య సమరంలో, రాజమహేంద్రవరం పురపాలక సంఘం రాజకీయాల్లో నాగేశ్వరరావు, దీక్షితులు ఒకే మాటగా ముందుకు సాగారు. అయితే దీక్షితులు పాత్ర తెరవెనుకే ఉండేదని చెప్పేవారు. దీక్షితుల కుమారుల్లో చిన్నవారైన విఎల్ శాస్త్రి రాజమహేంద్రవరం పురపాలక సంఘంలో వైద్యుడిగా సేవలందించారు. శాస్త్రి సోదరులు భాస్కరరావు కూడా వైద్యులుగా సేవలందించారు. విఎల్‌ఎన్ శాస్త్రి మున్సిపల్ డాక్టర్‌గా పదవీ విరమణ చేసిన తరువాత ఇంటి వద్దే వైద్యం చేసేవారు . ఆయన హస్తవాసి ఎంతో మంచిదని చెబుతారు. ఆయన ఎప్పుడూ వైద్యాన్ని వ్యాపారంగా పరిగణించలేదు . తుది శ్వాస వరకు సేవాభావంతో వైద్యవృత్తిని నిర్వర్తించారు. ఈ కారణంగానే ఆయన పెద్దగా వెలుగులోకి కూడా రాలేకపోయి ఉండవచ్చు. పేదలకు ఉచితంగా … మధ్య తరగతి వర్గాలకు గరిష్టంగా రూ. 50 తో మొన్నటి వరకు వైద్యాన్ని అందించారు . ఆయన ఇచ్చే మందులు కూడా ఎంతో తక్కువ ధరకు లభ్యం కావడంతో పాటు, రోగికి 3 రోజుల్లోనే స్వస్థత చేకూరేది. సాయంత్రం ఇంటి వద్ద వైద్యం చేసే ఆయన ఉదయం పూట రామకృష్ణ మిషన్లో ఉచిత వైద్యసేవలు అందించేవారు. శాస్త్రి వైద్య వృత్తికే గర్వకారణమని సగర్వంగా చెప్పవచ్చు. అలాంటి ఆయన కన్నుమూయడం రాజమహేంద్రవరం ప్రజలకు తీరని లోటే.