- చిన్నమ్మ ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి
- అడుగడుగునా భారీ స్వాగతం
- జయలలిత స్మారక కేంద్రం మూసివేత
- కలవరపాటుకు గురవుతున్న అన్నాడీఎంకే
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జైలు నుంచి విముక్తి అయిన చిన్నమ్మ తమిళనాడు చేరుకున్నారు. చిన్నమ్మ రాకతో తమిళ రాజకీయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. అన్నాడీఎంకేలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని పళనిస్వామి పన్నీర్ సెల్వంలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోన భయం మాత్రం వెన్నాడుతున్నట్లు వారు చేసే ప్రకటనల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అంతకు ముందు భారీ కాన్వాయ్ తో కర్ణాటక నుంచి బయలుదేరిన శశికళకు తమిళనాడు-కర్ణాటక బోర్డర్ లో భారీ స్వాగతం లభించింది. శశికళ రాక సందర్భంగా చెన్నైలో 32 చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. వందలాది మంది ఆమె అభిమానులు చిన్నమ్మకు జయజయధ్వానాలు పలుకుతూ స్వాగతం పలికారు. ద్రోహి ఎడప్పాడి అంటూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె ప్రయాణిస్తున్న దారి పొడవునా డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో అభిమానులు స్వాగత ఏర్పాట్లు చేశారు. కర్ణాటక తమిళనాడు సరిహద్దు నుంచి దారి పొడవునా బ్యానర్లు వెలిశాయి. ఒక్కో చోట దాదాపు రెండు వేల మంది అభిమానులు స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్లన్నీ శశికళ అభిమానులతో నిండిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. శశికళ రాకతో తమిళనాడు లో పండుగ వాతావరణం నెలకొంది. పచ్చని చీరకట్టులో మాస్క్ ధరించి అభిమానులకు అభివాదం చేసుకుంటూ శశికళ చెన్నై చేరుకున్నారు.
జయలలితకు చిన్నమ్మ నివాళులు :
పనులు పూర్తికాలేదనే నెపంతో జయలలిత స్మారక కేంద్రం సందర్శించేందుకు శశికళ అభ్యర్థనను పళని ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో నిరుత్సాహానికి గురయిన శశికళ జయలలిత ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అన్నాడీఎంకే అప్రమత్తం:
మరోవైపు చిన్నమ్మ రాక సందర్భంగా అధికార అన్నాడీఎంకే అప్రమత్తమయింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు చిన్నమ్మను కలవరాదని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ కలిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది.