Tuesday, January 21, 2025

తెరపైకి మళ్ళీ శశికళ

  • ఏఐఏడీఎంకేపై ఆదిపత్యానికి ప్రయత్నం
  • దిల్లీకి దూరంగా జరిగిన డిఎంకె
  • కొత్త పుంతలు తొక్కుతున్న స్టాలిన్

జయలలిత పుణ్యమా అని అన్ని హంగులు దక్కించుకున్న శశికళ తమిళనాడులో అధికారాన్ని దక్కించుకొని ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని చాలా ఉబలాటపడుతున్నారు. ముందుగా,అన్నా డిఎంకెపై తిరిగి పట్టు సాధించి, పూర్వ వైభవాన్ని పొందాలని చూస్తున్నారు. తాజాగా  స్వర్ణోత్సవ వేళ ఆమె తపన, ప్రతాపం మరోసారి బట్టబయలయ్యాయి. ఈ దాహం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అమ్మ (జయలలిత) తర్వాత చిన్నమ్మగా మొన్నమొన్నటి వరకూ పెత్తనం చేశారు. జయలలిత మరణం తర్వాత, పార్టీ పగ్గాలు,ముఖ్యమంత్రి కుర్చీ తనదేనని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.

Also read: కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమైందా?

నెరవేరని కల

నిజంగా అదే జరుగుతుందేమోనని తమిళనాడులో ఎక్కువమంది భావించారు. పార్టీ నేతలు, శ్రేణులు కూడా అనుకున్నాయి. కుర్చీలాటలో దృశ్యం తల్లకిందులైంది. జయలలిత వెళ్లిపోయిన ఆ సందర్భంలో, తమిళనాడులో తన పట్టును పెంచుకోవాలని బిజెపి  ప్రణాళికలు వేసింది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వంకు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కావాలని ఆశ పుట్టింది. దిల్లీ పెద్దల ఆశీస్సులు పొందే ప్రయత్నం చేశారు. వారికి కూడా శశికళ కంటే, పన్నీరు సెల్వం మంచిదని అనిపించింది. కానీ అదీ కుదరలేదు. శశికళపై అవినీతి కేసులు వెల్లువెత్తాయి. జైలు గోడల మధ్య గడపాల్సి వచ్చింది.ఆమెకు ప్రియశిష్యుడుగా భావించే పళనిస్వామి తెరపైకి వచ్చాడు. అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాడు. చేసేది లేక పన్నీరు సెల్వం ఆయనతో కలిసిపోయి, ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నాడు. కుర్చీలాటలో భాగంగా శశికళకు పార్టీ నుంచి ఉద్వాసన పలికారు. పదవీచ్యుతురాలిని చేశారు. సరే ఆమె మేనల్లుడు దినకరన్ తో వేరు కుంపటి పెట్టించినా, అది పెద్ద రాజుకోలేదు. పళని, పన్నీరు ద్వయం బిజెపి పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని నిన్నటి ఎన్నికల వరకూ అధికారాన్ని నెరిపారు. తర్వాత ఓటమి పాలైపోయారు. మళ్ళీ డిఎంకె అధికారంలోకి వచ్చింది. కరుణానిధి వారసుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. జైలు నుంచి బయటకు వచ్చిన శశికళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తీవ్ర ప్రయత్నం చేశారు. నిన్నటి ఎన్నికల్లో తన హవా చూపించాలని చాలా హడావిడి చేశారు. పళని ప్రభుత్వం ఆమె వేగానికి అడ్డుకట్ట వేసింది. ఆమె అక్రమ ఆస్తులను అటాచ్ చేసింది. దిల్లీ నుంచి కూడా ఆమెకు హెచ్చరికలు అందాయని సమాచారం. దానితో ఎన్నికలకు దూరంగా జరిగారు. నిన్నటి వరకూ మౌనాన్ని ఆశ్రయించారు. ఇదీ జరిగిన కథ. ఇప్పుడు కొత్త సీరీస్ ప్రారంభమయ్యాయి. తమిళనాడు రాజకీయాల్లో కొత్త వేడి మొదలైంది. ఈ 17వ తేదీకి అన్నా డిఎంకె స్థాపించి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. పళనిస్వామి,పన్నీరు సెల్వం నాయకత్వంలో సమన్వయ కమిటీ రాష్ట్రమంతా స్వర్ణోత్సవాలు నిర్వహించింది. దీనికి సమాంతరంగా శశికళ మరో వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఎంజిఆర్ స్మృతి కేంద్రంలో వేడుకలు జరిపారు.  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దానిపై అన్నా డిఎంకె ప్రధానకార్యదర్శిగా పెద్దపెద్ద అక్షరాలతో ఆమె పేరును చెక్కించుకున్నారు. తన కారుపై పార్టీ జెండాను ప్రదర్శించుకుంటూ తిరిగారు. ఎంజిఆర్ పత్రిక ‘నమదు’లో వరుసగా ప్రకటనలు గుప్పించారు. ఎంజిఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి హడావిడి చేశారు. అందరూ ఏకమై పార్టీని నిలబెట్టుకోవాలంటూ పిలుపునిచ్చారు.నిన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత కొంత వర్గం ఆమె వెనకాలకు చేరింది.పార్టీలో ప్రధానంగా పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు ఉండేవి. ఇప్పుడు శశికళ వర్గం కూడా ఏర్పడింది. ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నట్లు అనుకోవాలి. శశికళ తాజా కదలికలు, వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పళనిస్వామి,పన్నీరు సెల్వం మధ్య విభేదాలు ఉన్నా, నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలనే రాబట్టారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా అందించిన మంచి పాలన, పార్టీలో అనుసరించిన ప్రజాస్వామ్య విధానాలు కారణాలుగా నిలిచాయి. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా నడవండని.. దిల్లీ పెద్దలు చేసిన సూచనలు కూడా మరో కారణంగా చెప్పుకుంటారు. తమిళనాడు అసెంబ్లీకి ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు. ఇంకా నాలుగేళ్ళకు పైగా సమయం ఉంది.

Also read: డిజిటల్ డబ్బుల దిశగా ప్రపంచం అడుగులు

స్టాలిన్ వినూత్న పంథా

మరో రెండున్నరేళ్ళలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి.ముఖ్యమంత్రిగా స్టాలిన్ వినూత్నమైన పాలన అందిస్తున్నారు. తమిళనాడు తరహా రాజకీయాలకు పూర్తి భిన్నంగా ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్నారు. వారికి తగిన గౌరవాన్ని చూపిస్తున్నారు. జయలలిత స్థాపించిన కొన్ని పథకాలను కొనసాగిస్తున్నారు. ఆమె స్మృతికి గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే, డిఎంకె ఆర్య వ్యతిరేక పార్టీ కాదనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. హిందూ సంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు,దేవాలయాల వ్యవస్థలకు పెద్దపీట వేస్తూ ఉచితరీతిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ విధంగా అటు బిజెపిని కట్టడి చేస్తూ- ఇటు అన్నా డిఎంకె శ్రేణుల మనసు దోచుకొనే వినూత్న వ్యూహంతో స్టాలిన్ ముందుకు వెళ్తున్నారు.తన వ్యవహారశైలి,విధానాలతో దేశవ్యాప్తంగా స్టాలిన్  ఆకర్షణ, అభిమానాన్ని పెంచుకుంటున్నారు. అధికారానికి దూరం కావడం వల్ల, అన్నా డిఎంకె నేతల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది.ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని, పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవాలని శశికళ ఎత్తుగడలు వేస్తున్నారు.మనమంతా ఏకం కావాలి… అని పైకి చెబుతున్నా,లోలోపల పళనిస్వామి, పన్నీరు సెల్వంకు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గోడమీద పిల్లి వైఖరిని అనుసరించే పన్నీరు సెల్వం సైతం కొత్త వ్యూహంలో ఉన్నట్లు కనిపిస్తోంది.పళనిస్వామికి దెబ్బ వేయడం కోసం ఎప్పటి నుంచో ఆయన ప్రయత్నం చేస్తున్నారు.రజనీకాంత్ కు తన మద్దతు.. అంటూ ఆ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ తీరుకు అద్దం పడుతున్నాయి. సందర్భాన్ని బట్టి శశికళకు కూడా పన్నీరు సెల్వం జై కొడతారని తమిళనాడులో వినిపిస్తోంది. ఇవ్వన్నీ ఇలా ఉండగా, అసలు శశికళకు – పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, ప్రధాన కార్యదర్శి పదవికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉందని పార్టీకి చెందిన సీనియర్ నేతలు జయకుమార్ వంటి వారు శశికళ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. బిజెపి పెద్దల ఆశీస్సులు కూడా దక్కించుకుంటే కానీ తనకు ఉనికి ఉండదనే ఆలోచనలు కూడా శశికళకు ఉన్నట్లు తెలుస్తోంది. రేపో మాపో దిల్లీ వెళ్లి వారిని ప్రసన్నం చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయలలితకు నెచ్చెలిగా వ్యవహరించి, కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారు. పార్టీలో, పాలనలో సమాంతరంగా అధికారాన్ని వెలగబెట్టారు. జయలలిత చుట్టూ ఆమె మనుషులనే పెట్టుకున్నారు. ఇవన్నీ శశికళ ముందుచూపుతోనే చేసినట్లు భావించాలి. ఆమెకు కోట్లాది రూపాయలు ఆస్తులున్నాయి. అదే రీతిలో, అవినీతి కేసులు ఉన్నాయి. ఆమెను గమనిస్తే నియంతృత్వ పోకడలు ఉన్న మనిషిలా కనిపిస్తారు. ఆమె పగ ప్రతీకారంతో ఊగిపోయిన సందర్భాలు ఉన్నాయి. జయలలిత సమాధి సాక్షిగా నేలను చరుస్తూ ఆమె ప్రతిజ్ఞ చేసిన విధానం, ఆ ముఖకవళికలు చూస్తే  ఆమె స్వభావం ఎంతటి తీవ్రంగా ఉంటుందో అంచనా వేయవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆమెకు 72ఏళ్ళు వస్తాయి. పార్టీలో బలాన్ని పెంచుకోవాలి, ప్రధాన కార్యదర్శి పదవికి సంబంధించి కోర్టు కేసులో గెలవాలి, అవినీతి, అక్రమ కేసుల ప్రతిబంధకాలను ఎదుర్కోవాలి. దిల్లీ పెద్దల మనసులు గెలవాలి. స్టాలిన్ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలవాలి. ఇలాంటి ఎన్నో సవాళ్లు శశికళకు ఎదురుగా ఉన్నాయి.వీటన్నిటిని అధిగమించి,తను అనుకున్న ఆశయాలను సాధించడం, చేసిన ప్రతిజ్ఞలను తీర్చుకోవడం శశికళకు అంత ఆషామాషీ కాదు.

Also read: కృత్రిమ మేథదే భవిష్యత్తు!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles