- జయలలిత జయంతి తర్వాత ఆపరేషన్ ఆకర్ష్
- పార్టీ పునరుద్ధరణే తమ ధ్యేయమంటున్న దినకరన్
మరో వంద రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. జైలు నుంచి శశికళ రాకతో అన్నాడీఎంకే కలవరపాటుకు గురవుతున్నది. ఈ సమయంలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు శశికళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో శశికళ తాజాగా పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మార్చి 15న విచారణ జరగనుంది.
Also Read: తమిళనాడు ఎన్నికలపై శశికళ ప్రభావం ఉంటుందా?
అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె అనుంగు స్నేహితురాలు శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకుని పార్టీ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేలోపు అనూహ్యంగా అవినీతి కేసులో జైలు కెళ్లాల్సివచ్చింది. దీంతో ఆమె సహాయంతో పళనిస్వామి సీఎం పదవి వరించింది. ఆతర్వాత పళని, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయి అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను ముఖ్యమంత్రిగా నియమించిన పళనిస్వామి తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై 2017లో ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Also Read: చెన్నపట్నంలో చిన్నమ్మ… రెపరెపలాడుతున్న రెండాకులు
ఈ పరిణామాల నేపథ్యంలో శిక్షాకాలం ముగించుకుని జైలు నుంచి ఇటీవలే విడుదలైన చిన్నమ్మ అన్నాడీఎంకే పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 24న జయలలిత జయంతి తర్వాత అన్నాడీఎంకే లో చైతన్యం పెరుగుతుందని పార్టీ పునరుద్ధరణే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ స్పష్టం చేశారు.