నరేంద్ర మోడీ పేరుతో స్టేడియంపై వివాదం
అదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్ ల పైనా విమర్శలు
అహ్మదాబాద్ క్రికెట్ అనగానే…మోతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియం పేరు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేది. అయితే…కొద్దిగంటల క్రితమే…మీడియాకు సైతం తెలియకుండా సర్దార్ పటేల్ స్టేడియం కాస్త…నరేంద్ర మోడీ స్టేడియంగా మారిపోయింది. అంతేకాదు..అదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్ లు సైతం సరికొత్తగా పుట్టుకు వచ్చాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జే షా కార్యదర్శిగా గుజరాత్ క్రికెట్ సంఘం మూడేళ్ల క్రితమే… 700 కోట్ల రూపాయల భారీవ్యయంతో అహ్మదాబాద్ మోతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియం పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టింది.
ఇంగ్లండ్ తో రెండుమ్యాచ్ ల టెస్టు, ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ నిర్వహించడానికి సకల హంగులతో ముస్తాబు చేసింది. సర్దార్ పటేల్ స్టేడియం పేరుతోనే హడావిడిచేసి..
కొద్దిగంటల క్రితమే అత్యంత రహస్యంగా…నరేంద్ర మోడీ స్టేడియంగా నామకరణం చేసింది.
స్టేడియాన్నిరాష్ట్ర్రపతి కోవింద్ ప్రారంభిస్తే…కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభకార్యక్రమానికి అధ్యక్షత వహించడం, అమిత్ షా తనయుడు జే షా బీసీసీఐ కార్యదర్శిగా పర్యవేక్షించడం తీవ్రవిమర్శలకు దారితీసింది.
రాహుల్ గాంధీ చురకలు…
సర్దార్ పటేల్ పేరుకు బదులుగా నరేంద్ర మోడీ పేరును మోతేరా స్టేడియానికి నామకరణం చేయటం, అదానీ, రిలయన్స్ ఎండ్ లుగా పేర్లు పెట్టడంతో …ప్రతిపక్షనాయకుడు
రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. హమ్ దో…హమారే దో అంటూ చురకలు అంటించారు. తాను గతంలోనే చెప్పిన మాట ఇప్పుడు స్టేడియం నామకరణంతో
నిజమయ్యిందంటూ గుర్తు చేశారు.
ప్రశాంత్ భూషణ్ విమర్శ…
మహనీయుడు సర్దార్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియాన్ని నరేంద్ర మోడీ పేరుతో మార్చడాన్ని న్యాయకోవిదుడు ప్రశాంత్ భూషణ్ సైతం తప్పు పట్టారు. మోదీ జీ…మీరు..
అదానీ ఎండ్ నుంచి బ్యాటింగ్ చేస్తారా….లేక రిలయన్స్ ఎండ్ నుంచి ఆడతారా అంటూ విమర్శించారు.
మొత్తం మీద…దశాబ్దాలుగా సర్దార్ పటేల్ పేరుతో ఉన్న మోతేరా స్టేడియం కాస్త…రాత్రికి రాత్రే నరేంద్ర మోదీ స్టేడియంగా మారిపోడం వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా గుర్తింపు తెచ్చుకొన్న అహ్మదాబాద్ స్టేడియం వివాదాలకు తావు ఇవ్వటం విచారకరమే మరి.