శోభన్ బాబు(పాత చిత్రం)
ఒకప్పటి అందాల నటుడు శోభన్ బాబు సంక్రాంతి రాగానే గుర్తుకు వచ్చేస్తాడు. ఎందుకంటే సంక్రాంతి రోజే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కృష్ణా జిల్లా చిన నందిగామలో జనవరి 14 న పుట్టిన శోభన్ బాబు 2008 లో మరణించే వరకు 220 సినిమాల్లో నటించారు. ఎన్. టి. రామారావు తరువాత శ్రీకృషుని వేషం వేసి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న శోభన్ బాబు “వీరాభిమన్యు” చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. సాంఘిక , పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా అభిమానులను చేత నీరాజనం అందుకున్న శోభన్ బాబు మితభాషి. అగ్రనటు లుగా ఆ రోజు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎన్. టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ సరసన తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శోభన్ బాబు నట భూషణ గా అందరి మన్ననలు అందుకున్నారు. తన జీవితంలో తనకు డబ్బు విలువ తెలిసి కష్టాలు గట్టెక్కడానికి కేవలం ఏడువందల రూపాయలకు కూడా సినిమా ఛాన్స్ దక్కించుకున్నానని శోభన్ బాబు చెప్పేవారట.
మచ్చలేని వ్యక్తిత్వం
సినిమా షూటింగ్ లకు సమయ పాలన పాటించడమే కాకుండా షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి తన వైవాహిక జీవితానికి ఎలాంటి మచ్చ లేకుండా చూసుకున్నాడు. శోభన్ బాబు ఉన్న సినిమాల్లో ఇద్దరు హీరోహిన్ లు ఉండేవారు. అప్పట్లో అదో క్రేజ్. ఇద్దరికీ సమన్యాయం చేస్తాడనే నమ్మకం అప్పటి మహిళా అభిమానుల్లో ఉండడం వల్లే ఆయన సినిమాలు చాలా సెంటర్లలో వంద రోజులు పైగా ఆడేవి. తమిళ నాడు ముఖ్యమంత్రి గా పనిచేసిన జయలలిత నిజ జీవితంలో ఆయన హృదయం లో చోటు సంపాదించుకునే అవకాశం వచ్చినా శోభన్ బాబు మాత్రం ఏకపత్నీవ్రతాన్ని వీడలేదు. తరువాత జయలలిత ఎంజీఆర్ కు దగ్గరవడం తో శోభన్ బాబు అభిమానించే వారు ఉపిరి పీల్చుకున్నారు. మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడే సినీ రంగం నుండి తప్పుకొని అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి గా వేయమని ఆ సినిమా దర్శకుడు బ్రతి మిలాడినా ససేమిరా అని, తన సినిమా జీవితంలో ‘హలో గురూ’ ఆఖరి సినిమా అని ప్రకటించాడు.
తమిళనాడులోనే పెట్టుబడులు
తనను ఆర్థికంగా నిలబెట్టిన తమిళ నాడులో తన డబ్బు అంతా పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయలు , సినిమా థియేటర్లు, భూములు కొన్నారే తప్ప సినిమాలు తీసి చేతులు కాల్చుకోలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రాధాన్యం ఇచ్చే శోభన్ బాబు తన పిల్లల పెళ్లిళ్లను, కొడుకు పెళ్లిని తన బంధువులు, కొంత మంది సన్నిహిత సినిమా మిత్రుల మధ్య జరిపారు. ఇక సినిమా ప్రేమలు పెళ్లిళ్ల కు దూరంగా ఉన్న శోభన్ బాబు తన జీవితం ఆడంబరంగా కాకుండా సామాన్యంగా జరిగిపోవాలని భావించే వారట. ‘భక్త శబరి’ అనే సినిమా ద్వారా తెరకు 1959 లో పరిచయం అయిన శోభన్ బాబు ‘మనుషులు మారాలి’ అనే చిత్రం ద్వారా చిత్ర రంగంలో నిలదొక్కుకునే అవకాశం వచ్చింది అని చెప్పేవారట. ‘దేవాలయం,’ ‘మల్లెపూవు’ లాంటి సందేశాత్మక చిత్రాలు ‘దేవత,’ ‘సోగ్గాడు’ లాంటి కుటుంబ కథా చిత్రాలే కాకుండా ‘అందరూ దొంగలు,’ ‘జేబుదొంగ’ లాంటి మాస్ సినిమాలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. సంపూర్ణ రామాయణం సినిమా ఆయన సినీ జీవితం లో మరో మైలు రాయి. ఉప్పు శోభన చలపతిరావు సినిమా హీరోగా అవతారం ఎత్తాకా శోభన్ బాబు అయ్యారు. 2008 మార్చి 8 వతేదీన శోభన్ బాబు మరణించే నాటికి ఆయన వయసు 71 సంవత్సరాలు.
స్థిరాస్థి వల్లే డబ్బు పెరుగుతుంది
శోభన్ బాబుకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అమ్మాయిల పేర్లు మృదుల, నివేదిత, ప్రశాంతి. కొడుకు పేరు కరుణశేషు. కొడుకు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. పిల్లలు ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. స్థిరాస్తి వల్లే డబ్బు పెరుగుతుంది అని ఎంతో మందికి సలహాలు ఇచ్చిన శోభన్ బాబే మాకు ఆదర్శం అని మురళీమోహన్ చెప్పుకుంటారు! ఇక వివాదాలకు దూరంగా ఉండాలని అనుకున్న ఆయన చనిపోయిన తరువాత ఆయన విగ్రహాన్ని తమిళ నాడులో పెట్టకుండా కొన్ని తమిళ సంఘాలు ఆందోళన చేశాయి. అయితే కర్నూల్ నడిబొడ్డున నట భూషణ శోభన్ బాబు విగ్రహం ఠీవిగా నిలబడి ఉంది. ఈ వ్యాస రచయితగా జనవరి నాల్గవ తేదీన కర్నూలు వెళ్లినప్పుడు ఆయన విగ్రహం దగ్గర నిలబడి ఫోటో దిగి అభిమానాన్ని చాటుకున్నాను. ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు ఈ నాటి హీరోలకు ఆదర్శ ప్రాయుడు.
(సంక్రాంతి రోజే శోభన్ బాబు జయంతి)