ఋగ్వేదంలో గణపతి వేదాలు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వవ్యాపక భక్తుల ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని, సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు. గణపత్యధర్వ శీర్షోపనిషత్తులో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త హర్త అని ఆనందమయుడని చిన్మయుడని, లంబోదరుడని, శూర్ప కర్ణుడు రక్తం గుడి అభివర్ణించారు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని సంకట హరుడుగా కూడా పూజించడం అనాదిగా వస్తున్నదే. సంకటహరుని పూజించడానికి కృష్ణ పక్ష చతుర్థి ప్రసిద్ధి చెంది ఉంది. సంకట హర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు, ధర్మ రాజుకు వివరించినట్లు పురాణ కథనం. భవిష్య, నరసింహ పురాణాల ప్రకారం, ఒక సారి ఇంద్రుడు, గణేశ ఉపాసకుడైన భృషుండి అనే మహాముని ఆశ్రమం నుండి, విమానంపై ఇంద్రలోకానికి తిరిగి వెళుతూ, శూరసేన మహారాజు రాజ్యం మీదుగా వెళ్ళే సమయాన మహా పాపాత్ముడొకడు, విమానాన్ని చూసినంతనే విమానం నేలపై దిగి పోతుంది. తేజోవిరాజితమైన విమానాన్ని శూరసేనుడు చూడబోయి, ఇంద్రుడిదని తెలుసుకుని, ఆగి పోవడానికి కారణమడిగి ఇంద్రుని ద్వారా విని, మళ్ళీ లేచే ఉపాయం ఏదని అడుగుతాడు.
ఉపవాసదీక్షాఫలం
ఆనాడు బహుళ పంచమి ఐనందున, గత దినం చతుర్థినాడు ఉపవసించిన భక్తులు ఉపవాస ఫలాన్ని దారబోస్తేనే, విమానం మళ్ళీ లేవగలదని ఇంద్రుడు వివరిస్తాడు. శూరసేనుని ఆజ్ఞానువర్తులైన సైనికులు రాజ్యమంతా వడబోసినా అట్టి భక్తులు దొరకనిస్థితిలో నిరాశకు లోనుకాగా, ఆసమయంలోనే మృతి చెందిన ఒక స్త్రీని గణపతి దూత తీసుకెళుతుండడం చూసి ఇదేమిటని సైనికులుఅడుగుతారు. ఆమె గతదినం నిద్రలో ఉపవాసంతో ఉండి, రాత్రి చాలాసేపైనాక మెలకువ వచ్చి భోజనం చేసిందని, తెల్లవారి మృతి చెందినదని, అలాగే జీవితంలో ఒకసారైనా సంకటహర చతుర్థి ఆచరిస్తే గణపతి లోక ప్రాప్తి లభించగలదని చెప్పారు. ఆమె శరీరాన్ని తమకు ఇవ్వాలని సైనికులు కోరగా, గణపతి దూత నిరాకరిస్తాడు. అదే సమయంలో ఆమె శరీరం నుండి వీచిన పెనుగాలి ఇంద్రుని విమానాన్ని స్పృశించినవెంటనే అది పైకి లేస్తుంది.
సంకట హర చతుర్థి ప్రత్యేకత
కృష్ణ పక్ష చతుర్థి సంకష్టహర, సంకటహర చతుర్థి అంటారు. ఈరోజు దినమంతా ఉపవాస ముండి, సాయంత్రం , నిశి పూజ, చంద్రదర్శనానంతరం భోజనాలు చేయడం, నిర్దేశిత ఆహారం. ఇలా చేస్తే సకల కష్టాలు, సంకటాలు తొలగిపోయి. సంకట నాశకుడైన విఘ్న నాయకుని కృపకు పాత్రులు, జన్మరాహిత్యం , మోక్షం సిద్ధించి, సప్త జన్మలు అవసరం లేకనే శాశ్వత గణేశ లోక ప్రాప్తి కలుగనున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. తలపెట్టిన పనులకు విఘ్నాలు కలుగుతూ అశాంతి, మానసిక, శారీరిక రుగ్మతలు, రుణ బాధలు, అనేక కష్టాలు కలుగుతున్నప్పుడు దుష్టగ్రహ పీడన నివారణ కొరకై ప్రతి నెలా సంకష్టహర చవితి నాడు యథాశక్తి విఘ్నేశ్వరుని పూజలు జరపడం సంప్రదాయం. కృష్ణపక్ష చవితి తిథి మంగళవారం తో కూడి వస్తే అంగారక చతుర్థి అంటారు.
స్వగృహాలలో గణపతి పూజ
సంకట హర చతుర్థి నాడు కలశ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహా గణపతి అధర్వ శీర్ష పూజలు, అభిషేకం, అష్టోత్తర అర్చనలు, నివేదన, హారతి, మంత్రపుష్పం, నీరాజన, తీర్థ ప్రసాద వితరణాది సాంప్రదాయక క్రతువులను నిర్వహించడం, భక్తుల గోత్రనామాదులతో ప్రత్యేక అర్చనలు, గణపతి ఉపనిషత్ యుక్త అభిషేకాదులను నిర్వహించుకోవడం, భక్తులు తమ స్వగృహాలలోనూ గణపతి పూజ లొనరించి రాత్రి చంద్ర దర్శనానంతరం అరగించడం సనాతన సంప్రదాయం.