Thursday, November 21, 2024

సమరస సేనాని సంజీవయ్య

  • చిన్న వయస్సులో పెద్ద పదవులు
  • తొలి దళిత ఏఐసీసీ అధ్యక్షుడు
  • నెహ్రూ, శాస్త్రి, ఇందిర మంత్రివర్గాలలో సభ్యుడు

దామోదరం సంజీవయ్య పుట్టినరోజు ఈ  నెల 14. నేడు చాలామందికి ఇంకా బాగా పరిచయం కావాల్సిన పేరు. తరతరాలకు జాతి గొప్పగా గుర్తుపెట్టుకోవాల్సిన ఘనత, చరిత ఆయనది. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి. ‘ఏఐసీసీ’కి రెండుసార్లు అధ్యక్షుడుగా ఎంపికైన ఏకైక తెలుగువ్యక్తి. నాలుగు పదుల వయస్సు రాకముందే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘనుడు. ఐదు పదుల వయస్సులోనే తనువు చాలించినా,వ్యక్తిగా పరిపూర్ణుడు. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, మానవతలను ఆచరణలో చూపించిన ఒకప్పటి మహోన్నత నాయకుల ప్రతినిధి. సుకీర్తి ఆయన ఐశ్వర్యం. అపరిమితమైన ప్రతిభ, అపారమైన విజ్ఞానం ఆయన సిరిసంపదలు. పేదలపక్షపాతిగా ఆయన నడచిన తీరు పరమ ఆదర్శం. పేదరికం అన్ని కులాల్లో ఉంటుందని చాటిచెప్పి, ప్రతి పేదవాడికీ న్యాయం జరగాలిని ఎలుగెత్తి చాటిన నిస్పక్షపాత నాయకుడు. కవి, పండితుడు, నటుడు, గాయకుడు, కళాకారుడు, అధ్యాపకుడు, న్యాయవాది, రాజనీతిజ్ఞ స్వరూపుడు. గొప్ప వక్త, గొప్ప రచయిత, ఆలోచనాపరుడు. కుల, మత, ప్రాంతాలకు, ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా గౌరవించవలసిన గొప్ప చరిత ఆయనది. ‘లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ‘ అనే గొప్ప రచన కూడా చేశారు. ఆక్స్ ఫర్డ్ ప్రెస్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

Also read: భూప్రకంపనలు, ప్రజల భయాందోళనలు

నిజాయితీ, ప్రతిభ, పట్టుదల ద్వారా ఎదిగిన నేత

కేవలం ప్రతిభ, కృషి, పట్టుదల, నిజాయితీ ద్వారానే ఎదిగిన ఆదర్శపురుషుడు. ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాల లోపే పనిచేసినా పరిపాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు. కేంద్ర మంత్రిగా కీలకమైన శాఖలను నిర్వహించి అటు ప్రధానులను -ఇటు ప్రజలను ఎంతగానో మెప్పించారు. జాతీయ స్థాయిలో ఆయనకు రావాల్సినంత గుర్తింపు తదనంతరకాలంలో రాకపోయినా, ప్రజాస్వామ్య వ్యవస్థలోని సౌందర్యానికి ప్రతీకగా నిలిచారు. రాయలసీమ ప్రాంతంలోని చిన్నపల్లె నుంచి ప్రయాణం ప్రారంభించి దిల్లీ వరకూ ఎదిగిన ఆయన జీవితం గొప్ప కావ్య తుల్యం. అందులో అన్ని రసాలు ఉన్నాయి.ప్రముఖ రచయిత రావిశాస్త్రి, సంజీవయ్య న్యాయవిద్యలో సహాధ్యాయులు. ఆ సమయంలో ఒకరిని చూసి ఇంకొకరు ప్రభావితమయ్యారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో పనిచేసి గొప్ప అనుభవాన్ని, గొప్ప నమ్మకాన్ని తెచ్చుకున్నారు. టంగుటూరు ప్రకాశంపంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి ఉద్దండులైన ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో దీక్షాదక్షతతో వర్తించి శభాష్ అనిపించుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వంటి హేమాహేమీలైన ప్రధానమంత్రుల మంత్రివర్గంలోనూ అదే దక్షత చూపించి, వారి మన్ననలు పొందిన ఘనత సంజీవయ్యది. 29ఏళ్ళ వయస్సులో రాజకీయ యవనికలో అడుగుపెట్టడం, తాత్కాలిక పార్లమెంట్ సభ్యుడుగా, రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడుగా శరవేగంగా పదవులన్నింటినీ అందుకున్నారు. ప్రజ్ఞ,ఋతువర్తనం అనే సుగుణాలు మెట్లుగా చేసుకొని వ్యక్తిగతజీవితంలో, వృత్తిజీవితంలో పైకొచ్చారు.

Also read: మరుపేలరా ఓ మానవా!

పరిశోధించవలసిన వ్యక్తిత్వం

తోటి నాయకులతో, అగ్రనేతలతో, అధికారులతో సమరసభావంతో మెలిగి తాను ప్రజలకు చేయగలిగినదంతా చేశారు. ముఖ్యంగా పేదలు, కార్మికుల అభ్యున్నతి కోసం చాలా కృషి చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడంలో, దళితులకు భూముల కేటాయింపులో, హాస్టల్స్ ఏర్పాటుచేయడంలో ఆయన పాత్ర, ప్రభావం చాలా గొప్పవి. మహిళల సర్వతోన్నత ప్రగతి కోసం అహరహం శ్రమించారు. వృద్ధాప్య పెన్షన్స్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపన జరగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కీలకభూమిక పోషించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక స్థాపనా ప్రస్థానంలో ఆయన సేవలు విస్మరించజాలనివి. వ్యవసాయ అభివృద్ధికి వివిధ నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అవినీతి నిరోధక శాఖను ప్రారంభించారు. భూ క్రమబద్ధీకరణ చట్టాన్ని తెచ్చారు. తెలుగును అధికార భాషగా ప్రకటించడానికి పునాదులు వేసిన మాతృభాషాభిమని. ఆయన అతితక్కువ కాలమే జీవించారు. రాజకీయ జీవితం రెండు దశాబ్దాల కాలపరిధి మాత్రమే. ఆ అల్పమైన కాలంలోనే అధికమైన కార్యాలు చేపట్టారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఆయన పరిపాలనా స్వరూపం,తీసుకువచ్చిన విధానాలు, చేసిన నిర్మాణాత్మకమైన పనులు, జీవిత విశేషాలు,రచనలు సమగ్రంగా అక్షరబద్ధం (డాక్యుమెంట్ ) కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయనపై పరిశోధనలు జరగాలి. సంజీవయ్య సమగ్రంగా, సమున్నతంగా దేశప్రజలకు పరిచయమవ్వాలి. బహుముఖ ప్రతిభావంతుడు, ఆదర్శనేత దామోదరం సంజీవయ్య చిరంజీవి.

Also read: కళాతపస్వికి పర్యాయపదం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles