Friday, January 3, 2025

న్యాయవ్యవస్థలో కులతత్వం, రోస్టర్ అక్రమాలపైన సంజీవయ్య, జగన్ ఫిర్యాదు

  • మూడు సందర్భాలలోనూ తెలుగు ప్రముఖుల ప్రమేయం
  • లేఖతో తగిన సాక్ష్యాధారాలు జతచేశాననే జగన్ విశ్వాసం
  • మాజీ ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్ ఏమన్నారు?
  • నాటి పరిణామాలపైన జస్టిస్ చుంద్రు వ్యాఖ్యానం ఏమిటి?

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గత 70 సంవత్సరాలలో ఇంతవరకూ న్యాయవ్యవస్థపైన ఇద్దరు ముఖ్యమంత్రులూ, నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులూ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య రాసిన లేఖను రహస్యంగా ఉంచారు. జస్టిస్ చలమేశ్వర్ నాయకత్వంలోని నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులూ విలేఖరుల గోష్ఠిలో బహిరంగంగానే ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో సలహాదారు చేత జగన్ మోహన్ రెడ్డి వివాదాస్పదమైన తన లేఖనూ, దానికి అనుబంధంగా పంపిన పత్రాలనూ వెల్లడించారు. ఈ మూడు ఫిర్యాదులలోనూ తెలుగు న్యాయమూర్తుల ప్రమేయం ఉండటం ఆసక్తికరమైన అంశం.

మూడు ఫిర్యాదులలోనూ రోస్టర్ గురించీ, వివిధ బెంచీలకు కేసులను కేటాయించడం గురించీ ప్రస్తావన ఉంది. నిజాయితీపరులైన న్యాయమూర్తుల పట్ల  అన్యాయంగా వ్యవహరించడంతో పాటు కులప్రాతిపదికపైన న్యాయమూర్తుల ఎంపికలోనూ, తీర్పులు చెప్పడంలోనూ పక్షపాతం చూపించడం, కొందరు న్యాయమూర్తులు ఉన్న బెంచ్ లకే కొన్ని కేసులను అప్పగించడం జరుగుతోందని దామోదరం సంజీవయ్య ఫిర్యాదు చేశారు.

పక్షపాతంగా వ్యవహరిస్తున్న ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయాలని సంజీవయ్య స్పష్టంగా కోరగా, తక్కిన రెండు సందర్భాలలోనూ ఫిర్యాదుదారులు అటువంటి స్పష్టమైన కోర్కె ఏదీ కోరలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానూ, వైఎస్ ఆర్ సీపీకి ప్రతికూలంగానూ రాజకీయ పక్షపాతం ప్రదర్శిస్తున్నారనీ, హైకోర్టుపైన ప్రభావం వేస్తున్నారనీ, పాత ప్రభుత్వంతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారనీ, ఇన్ సైడర్ సమాచారంతో భూముల కొనుగోలు చేశారనీ, చేయించారనీ జగన్ తన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారు.

సంజీవయ్య ఆరోపణలు ఏమిటి?

దామోదరం సంజీవయ్య 1961లో అప్పటి దేశీయాంగమంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రికి వివరాలతో కూడిన ఫిర్యాదు చేశారు. కులపరమైన పక్షపాతం, అవినీతి ఆరోపణలను అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. చంద్రారెడ్డిపైన చేశారు. సంజీవయ్య రాసిన లేఖ మొత్తం దిల్లీలోని నేషనల్ అర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో అందుబాటులో ఉన్నది.

లాల్ బహద్దూర్ శాస్త్రికి అప్పటి ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయకముందు సదరు న్యాయమూర్తి వ్యవహరణశైలి ఎట్లా ఉండేదో వివరిస్తూ జస్టిస్ చంద్రు ‘ద హిందూ’ లో ఒక వ్యాసం రాశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రారెడ్డి ఉన్నప్పుడు ఆయనపైన కొన్ని ఆరోపణలు వచ్చాయనీ, అప్పుడు ఆయనను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేశారనీ జస్టిస్ చంద్రు రాశారు. మద్రాసు హైకోర్టులో పాలగని చంద్రారెడ్డి 1950 నుంచి 1954 వరకూ పని చేశారని మద్రాసు హైకోర్టు అధికారిక వెబ్ సైట్ చూపిస్తున్నది. పి. చంద్రారెడ్డి ఏపీ హైకోర్టులో 1958 నుంచి 1964 వరకూ పని చేశారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్ సైట్ లో ఉంది.

1 (ఎ): సీజేఐ గజేంద్ర గడ్కర్ కి ఫిర్యాదు

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. చంద్రారెడ్డిపైన ఫిర్యాదులు వచ్చాయనీ, హైదరాబాద్ వెళ్ళి స్వయంగా ఫిర్యాదులపైన విచారణ జరిపిన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గజేంద్ర గడ్కర్ జస్టిస్ చంద్రారెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు బదిలీ చేశారనీ తెలుపుతూ జస్టిస్ చంద్రు ఇలా రాశారు:

‘‘హైకోర్టు న్యాయమూర్తులపైన కనీసం అయిదు కేసులలో తీర్మానాలు తెచ్చారు. కానీ వాటిలో ఒక్కదానినైనా కొసకంటూ తీసుకొని వెళ్ళలేదు. బార్ లో కొందరికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ జస్టిస్ చంద్రారెడ్డిపైన 1960ల ఆరంభంలో ఫిర్యాదులు వచ్చినప్పుడు పరిస్థిని ఎట్లా ఎదుర్కోవాలో సుప్రీంకోర్టుకు తెలియలేదు.’’

ఆ తర్వాత గజేంద్ర గడ్కర్ జీవిత చరిత్ర నుంచి జస్టిస్ చంద్రు ఉటంకించారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తన హైదరాబాద్ పర్యటన గురించి గజేంద్ర గడ్కర్ ఇలా రాశారు:

‘‘చీఫ్ జస్టిస్ ని విశ్వాసంలోకి తీసుకున్నాను… ‘నేను ఏ న్యాయవాదులనూ, న్యాయమూర్తులనూ కలుసుకొని కొన్ని ప్రశ్నలు అడగాలో మీరే ఒక జాబితా నాకు ఇవ్వండి,’ అని నా ధర్మంగా అడిగాను. ఆయన ఒక జాబితా నాకు అందజేశారు. ఆయన ఆ జాబితాలో పేర్కొన్న న్యాయమూర్తులనూ, న్యాయవాదులతోనే నేను మాట్లాడాను. నాకు జీర్ణం కానీ ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే న్యాయవాదులందరూ, న్యాయమూర్తులలో అత్యధికులూ ఫిర్యాదుదారుడిని సమర్థించారు….

ఫిర్యాదులలో చాలా భాగం ఆధారాలు ఉన్నవనే నిర్ణయానికి నేను వచ్చాను. ప్రజల దృష్టిలో కించపరిచే చర్యను ఏదీ సూచించదలచలేదని ఆయనకు నేను చెప్పాను. కానీ మద్రాసుకు పంపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతానని చెప్పాను.’’

‘‘చర్చించడం ద్వారా విచారించి నిజం తెలుసుకునే అవకాశం కల్పించే అటువంటి న్యాయవాదులు ఇప్పుడు న్యాయస్థానాలలో ఉంటే బాగుండునని మేము అనుకుంటూ ఉంటాము. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ పేరు మీద తీవ్రమైన తప్పుడు ధోరణిలో వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులను రక్షించడానికి రంగంలోకి దూకే న్యాయవాదుల సంఘాలు ఉన్నాయి,’’ అంటూ జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు.

చర్య: ఆంధ్రప్రదేశ్ నుంచి జస్టిస్ చంద్రారెడ్డిని మద్రాసు హైకోర్టుకు బదిలీ చేశారు.

1 (బి): చీఫ్ జస్టిస్ పైన సంజీవయ్య ఫిర్యాదు

అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. చంద్రారెడ్డిపైన లాల్ బహద్దూర్ శాస్త్రికి నాటి ముఖ్యమంత్రి సంజీవయ్య 04 నవంబర్ 1961న రాసిన డీవో లెటర్ నుంచి కొన్ని భాగాలు ఉటంకించడం సందర్భోచితంగా ఉంటుంది. ఆయన ఇలా రాశారు:

‘‘హైకోర్టులోకి రాజకీయాలు ప్రవేశించాయి. అప్పటికే కులాల కారణంగానూ, ఇతర  కారణాల వల్లనూ ముఠాతత్వం ప్రబలంగా ఉంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిని తక్షణం ఇక్కడి నుంచి మార్చకపోతే, ఇప్పటికే కులతత్వంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదం జరుగుతుంది.

శ్రీ పి. రామచంద్రారెడ్డి కులతత్వంతోనే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారనే సంకోచం కూడా లేకుండా ఆయన కులతత్వాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తారు. ఆయనకు తీవ్రమైన ఇష్టాయిష్టాలు ఉన్నాయి. వాటి వల్ల న్యాయస్థానంలో పని బాగా దెబ్బతింటున్నది. ఆయన కొంతమంది ఇష్టులైన న్యాయమూర్తులకు సన్నిహితంగా మసలుతున్నారు. జస్టిస్ ఎస్. రాజు, జస్టిస్ జె.ఎం. రెడ్డి ప్రభావం ఆయనపైన చాలా ఉంటోంది. వారే మొత్తం హైకోర్టు పరిపాలన సాగిస్తున్నారు. వారిద్దరిలో మొదటివారు (జస్టిస్ రాజు) చాలా వ్యూహాలు పన్ని కుయుక్తులు ప్రయోగిస్తారు.  ఆయన చేతిలోజస్టిస్ చంద్రారెడ్డి ఉన్నారు. వారిద్దరూ ప్రతి రోజూ కలిసి హైకోర్టుకు వెడతారు. బయట పార్టీలలో కానీ సభలలో కానీ వారిద్దరూ ప్రదర్శించే అన్యోన్యత ఇతర  సహచరులకు ఇబ్బందిగా పరిణమిస్తున్నది. ఇతరుల ఉనికి కోర్టులో తగ్గిపోతున్నది. ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తులు మినహా హైకోర్టులో న్యాయమూర్తులు ఎవ్వరూ స్వతంత్రులు కారు. తక్కినవారంతా జస్టిస్ చంద్రారెడ్డికీ, జస్టిస్ రాజుకీ, జస్టిస్ జేఎం రెడ్డికీ విధేయులే. బెంచ్ లకీ, ఫుల్ బెంచ్ లకీ అటువంటివారినే ఎంపిక చేస్తున్నారు. హైకోర్టు ఫుల్ బెంచ్ అంటే అపహాస్యంగా, వెక్కిరింతగా తయారైంది. ప్రధాన న్యాయమూర్తి తర్వాత అందరికంటే సీనియర్ అయిన న్యాయమూర్తి జస్టిస్ ఉమామహేశ్వరం స్వంతంత్రుడ, ఉత్తముడు, రుషితుల్యుడు. ఆయనను ఏ మాత్రం పట్టించుకోరు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నగరాంతరం వెళ్ళినప్పుడు ఇన్-చార్జిగా జస్టిస్ రాజును నియమించడం ద్వారా సీనియర్ న్యాయమూర్తిని అవమానిస్తున్నారు. అటువంటి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు హైకోర్టులో సద్భావానికీ, ప్రతిష్ఠకీ దోహదం చేయవు. సీనియర్ న్యాయమూర్తులకు ముఖ్యమైన ఫైళ్ళు పంపడం లేదని నాకున్న  సమాచారం. న్యాయమూర్తుల ఎదుట కేసులను పోస్ట్ చేయడంలో మతలబు జరుగుతోందని కూడా నాకు తెలిసింది.

జిల్లా జడ్జిగా అయిదేళ్ళు మాత్రమే సర్వీసు కలిగిన ఓ. రెడ్డి పట్ల ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ ఇప్పించారు. పైన చెప్పుకున్న జస్టిస్ రామచంద్రరాజు, జస్టిస్ చంద్రశేఖరరెడ్డిల సీనియారిటీని వారికి లాభించే విధంగా నిర్ణయించారు.

హైకోర్టులో ఈ ముఠా గురించి అందరూ బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మా రాజకీయ నాయకులకంటే కూడా వారు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు.

ఎవరైనా న్యాయమూర్తి స్వతంత్రంగా తీర్పు ఇవ్వడాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎంతగా ఏవగించుకుంటారంటే ఆ తీర్పుపైన ఎవరైనా అప్పీలు దాఖలు చేసిన వెంటనే తీర్పు పాఠం కూడా చదవకుండా తీర్పును రద్దు చేస్తారు. ఇతర కులాలకు చెందిన అడ్వకేట్ల హృదయాలు భగ్గుమనే విధంగా తన కులంవారినే ప్రధాన న్యాయమూర్తి ప్రోత్సహిస్తారని తెలిసింది. ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఉన్న కాలంలో హైకోర్టు పట్ల ప్రజల విశ్వాసం తుడిచిపెట్టుకొని పోయింది.’’

చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని తమ వ్యవహారంలో విచారణ జరగకుండా అడ్డుకుంటారనే భయంలో ఆయనకు తెలియకుండా  ఉండాలనే ముఖ్యమంత్రి తన లేఖను రహస్యంగా ఉంచారు.

చర్య: ఈ లేఖపైన ఏమైనా చర్య తీసుకున్నారేమో తెలియదు. ఫిర్యాదులు రుజువైన తర్వాత బదిలీ అయిన చంద్రారెడ్డి తిరిగి హైదరాబాద్ కు ప్రధాన న్యాయమూర్తిగా రావడంతో ముఖ్యమంత్రి వివరంగా లేఖ రాశారు. మాజీ న్యాయమూర్తులు ఎప్పుడు ఏమి చేశారనే వివరాలు సరిగా లేవు. ఎప్పుడు ఏ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారనే విషయం తెలియదు. సంజీవయ్య ఫిర్యాదుపైన ఎటువంటి చర్య తీసుకున్నారో తెలియదు. తేదీల ప్రకారం చూస్తే లేఖపైన చర్యలు తీసుకోనట్టే కనిపిస్తుంది.

2. సీజేఐపైన నలుగురు న్యాయమూర్తుల ఫిర్యాదు

ఈ ఫిర్యాదు తర్వాత 57 ఏళ్ళకు జస్టిస్ చలమేశ్వర్ నాయకత్వంలో నలుగురు సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపైన బహిరంగంగా ఫిర్యాదు చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తిపైన చేసిన ఫిర్యాదుపైన బహిరంగంగా చర్చించడం నేరమా లేక అక్రమమా? ఈ ప్రశ్నను నలుగురు న్యాయమూర్తులపైన సంధించారు. 12 జనవరి 2018 నాడు నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు ఇలా రాశారు: ‘‘ మీకు ఈ ఉత్తరాన్ని రాయడం సబబేనని చాలా ఖేదంతో, ఆందోళనతో ఆలోచించిన తర్వాత భావించాము. ఈ కోర్టు జారీ చేసిన కొన్ని న్యాయపరమైన ఉత్తర్వులపైన దృష్టి సారించాలని, వీటి వల్ల న్యాయవితరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదనీ, హైకోర్టుల స్వేచ్ఛకు విఘాతం కలిగిందనీ, గౌరవనీయులైన (నాటి) భారత ప్రధాన న్యాయమూర్తి పరిపాలనపైన ప్రభావం పడిందనీ తెలియజేయాలని అనుకున్నాం.’’

న్యాయమూర్తులు ఎత్తి చూపిన అంశాలు:

‘‘ రోస్టర్ వేయడం చీఫ్ జస్టిస్ ఇష్టం ప్రకారమే జరగాలనీ, రోస్టర్ విధానాన్ని నిర్ణయించే అధికారం చీఫ్ జస్టిస్ కే ఉంటుందనేది ఎవ్వరూ కాదనలేని స్పష్టమైన సూత్రం. అనేక కోర్టులు ఉన్న వ్యవస్థలో లావాదేవీలు సక్రమంగా జరగాలంటే, ఈ కోర్టు సభ్యులూ/బెంచ్ (ఏదైతే అది) ఏ కేసును లేదా ఏయే కేసులనూ పరిశీలించాలో నిర్ణయించేందుకు ఈ సూత్రాన్ని పాటించడం అవసరం.’’

వారు మరో నిబంధనను ఎత్తి చూపించారు:

‘‘ పైన పేర్కొన్న సూత్రానికి అవసరమైన జోడింపు ఏమంటే ఈ కోర్టుతో సహా బహున్యాయమూర్తులు కలిగిన న్యాయస్థానం ఏదీ సంఖ్య రీత్యా, న్యాయమూర్తుల అనుభవం రీత్యా సముచితమైన బెంచ్ ను ఏర్పాటు చేసే తీర్పులు చెప్పే అధికారాన్ని కొందరు న్యాయమూర్తుల హస్తగతం కాకూడదు. పైన పేర్కొన్న రెండు సూత్రాలూ కొంత కాలంగా సవ్యంగా అమలు జరగడం లేదని చెప్పడానికి విచారిస్తున్నాం.’’

చివరికి వారు కోరిందేమిటి? ‘‘కొలీజియం సభ్యులతో పూర్తిగా చర్చించిన తర్వాత, అవసరం అనుకుంటే ఆ తర్వాత ఈ కోర్టులోని ఇతర న్యాయమూర్తులతో కూడా చర్చించిన అనంతరం పరిస్థితిని చక్కదిద్ది, వ్యవస్థను గాడిలో పెట్టడానికి తగిన చర్యలు తీసుకోవలసిన కర్తవ్యం మీపైన ఉన్నది,’’ అని చెప్పారు.

చర్య: బహిరంగంగా ఫిర్యాదు రూపంలో జరిగిన ఈ దాడిపైన మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది కానీ ఇతరత్రా చర్య తీసుకున్న దాఖలా లేదు.

3. సీజేఐపైన మేఘాలు

ఈ నలుగురు న్యాయమూర్తులలో ఒకరైన రంజన్ గొగాయ్ ఆ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఒక మహిళపైన లైంగిక దాడి చేశారంటూ ఆయనపైన తీవ్రమైన ఆరోపణ వచ్చింది. ఒక చీఫ్ జస్టిస్ పైన ఇటువంటి తీవ్రమైన ఆరోపణ రావడం అదే ప్రథమం. ఆరోపణపైన దర్యాప్తు జరిగింది. ఇది కూడా ప్రథమమే. ఇది చాలా ఇబ్బందికరమైన వివాదం. ఈ ఫిర్యాదుపైన న్యాయస్థానం వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థ విశ్వనీయతపైన పెద్ద దెబ్బ వేసింది. పదవీ విరమణ తర్వాత రంజన్ గొగోయ్ ని  రాజ్యసభ సభ్యత్వంతో గౌరవించారు. ఫిర్యాదు చేసిన మహిళకు ఆమె ఉద్యోగం తిరిగి ఇచ్చారు. ఇటువంటి ఘటనలు న్యాయవ్యవస్థ పాత్రపైన, పాలనావ్యవస్థ మౌనంపైన సందేహాలు లేవనెత్తుతాయి.

4. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైన జగన్ ఆరోపణలు

అనేక అక్రమమైన పద్ధతుల ద్వారా చంద్రబాబునాయుడికీ, ఆయన ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండిన వ్యక్తులూ, సంస్థలూవిస్తారంగా భూములను (దాదాపు నాలుగు వేల ఎకరాలు) అమరావతిలో కొనుగోలు చేశారని తన నాయకత్వంలో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం కనుక్కున్నదని తన లేఖలో జగన్ మోహన్ రెడ్డి వివరించారు. ఆ కమిటీ నివేదికను అసెంబ్లీకి నివేదించారు. నివేదికలో ఉన్న ఆరోపణలపైన లోతైన దర్యాప్తు జరగాలని అసెంబ్లీ భావించింది. ఈ నివేదికలోని ఆరోపణలపై సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కోరుతూ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ అక్రమాలపైన చర్య తీసుకోగల అవకాశం, సామర్థ్యం తన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రాజకీయ కక్షతో చేస్తున్నామనే విమర్శకు తావు ఇవ్వరాదనే ఉద్దేశంతో తన పాలనా పరిధిలో లేని సంస్థ చేత దర్యాప్తు చేయడం మంచిదని భావించానని జగన్ స్పష్టం చేశారు.

లేఖలో (ఎ) నుంచి (సి) వరకూ సమస్య కానీ అక్రమం కానీ లేదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిపైన వచ్చిన ఆరోపణలపైన తన పోలీసు పరిధిలోని సంస్థతో దర్యాప్తు చేయించకుండా సీబీఐకి అప్పగించడం ముఖ్యమంత్రి చేసిన మంచి పని.

ఆయన ఇలా రాశారు:

‘‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కుమార్తెలు ఇద్దరూ, ఆయన సన్నిహితులూ, బంధువులూ వివాదాస్పదమైన భూములు కొనుగోలు చేయడం ద్వారా లబ్ధిపొందారు. చివరికి ఆ భూములు చంద్రబాబునాయుడు నిర్ణయించిన రాజధాని ప్రాంతం పరిధిలోనికే వచ్చాయి. ఈ లావాదేవీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేసిన తర్వాతా, కొత్త రాజధాని ప్రాంతం ఎక్కడుంటుందో అధికారికంగా ప్రకటించే లోపూ జరిగింది.’’

ఆయన ఇంకా ఇలా రాశారు:

ఇ) జస్టిస్ ఎన్. వి. రమణకు తెలియకుండా అటువంటి భూలావాదేవీ జరిగి ఉండేది కాదు. ఎందుకంటే, భూములు కొనడానికి ఒక ఏడాది కిందటే దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఇద్దరు కుమార్తెలూ తన కుటుంబంపైన ఆధారపడినవారేనంటూ తెలిపారు. 2014, 2015లో ఆస్తుల వివరాలు బయట ఎక్కడా లేవు. ఈ లేఖతో జతచేసిన చిత్రం, వివరణ లావాదేవీలు జరిగిన తీరు, వారికి కలిగిన లబ్ధి గురించి స్పష్టంగా వివరిస్తుంది.

ఎఫ్) ….సీఆర్ డీ ఏ రికార్డులో ఉన్నట్టు శ్రీదమ్మాలపాటి శ్రీనివాస్, జస్టిస్ ఎన్.వి. రమణ కుమార్తెలు సంయుక్తంగా ఆస్తి కలిగి ఉన్నట్టు చూపించే పత్రాలను కూడా జతచేశాను.

జి) చంద్రబాబునాయుడికీ జస్టిస్ రమణకీ సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. అత్యంత బాధ్యతతో నేను ఈ విషయం చెబుతున్నాను. గౌరవనీయమైన మీ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉండిన జస్టిస్ చలమేశ్వర్ ఈ వాస్తవాన్ని సాక్ష్యాధారాలతో సహా రికార్డులో ఉంచారు.

7. గౌరవనీయులైన హైకోర్టు న్యాయమూర్తుల రోస్టర్ తో సహా అన్ని వ్యవహారాలనూ జస్టిస్ ఎన్.వి. రమణ నిర్దేశిస్తున్నారు. కొద్దిమంది గౌరవనీయులైన న్యాయమూర్తులకే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన కేసులను అప్పగించిన సంగతీ, కొన్ని కేసులలో న్యాయమూర్తులు జారీ చేసిన ఉత్తర్వులనూ వివరించే అనుబంధ పత్రాలను లేఖతో జత చేశాను….

జగన్ విశ్వాసం

తెలుగుదేశం పార్టీ నాయకుడికీ, న్యాయమూర్తికీ మధ్య గాఢమైన సంబంధాలు ఉన్నట్టు, ఏపీ హైకోర్టుపైన సదరు న్యాయమూర్తి ప్రభావం వేస్తున్నట్టు రుజువు చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సమర్పించాననే విశ్వాసం తన లేఖలో జగన్ వెలిబుచ్చారు. అయితే, ఫలానా చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేయలేదు కానీ అమరావతిలో న్యాయమూర్తులు తటస్థంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరారు.

లేఖ రాసిన ఐదు రోజులలోగా లేఖనూ, లేఖతో జతపరచిన పత్రాలనూ బహిరంగపరచవలసిందిగా తన సలహాదారును జగన్ ఆదేశించారు. దాంతో జాతీయ స్థాయిలో చర్చ మొదలయింది. లేఖ రాయడం సమంజసమా, కాదా, లేఖాంశాలను బహిర్గతం చేయడం భావ్యమా, కాదా అనే చర్చ సాగింది. ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపై వీలైతే విచారణ జరగాలని చాలామంది కోరుతుంటే ఫిర్యాదు చేయడం అక్రమమనీ, అందుకు ముఖ్యమంత్రిపైన చర్య తీసుకోవాలనీ కొందరు కోరుతున్నారు.  

చర్య: ఎదురుచూస్తున్నాం.

ఫిర్యాదులు చేయడం వల్ల న్యాయవ్యవస్థ స్వేచ్ఛకూ, విశ్వసనీయతకూ ఎటువంటి విఘాతమూ కలగదనీ, ఫిర్యాదులను పట్టించుకోకుండా, వాటిపై చర్య తీసుకోకుండా ఉంటేనే నష్టం జరుగుతుందనీ ఈ ఫిర్యాదులు స్పష్టం చేస్తున్నాయి. పారదర్శకతా, ఫిర్యాదులను అనుసరించి పొరపాట్లను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ, సవరణలు చేసుకుంటూ పోవడం వల్ల మూడు విభాగాలూ (న్యాయవ్యవస్థ, చట్టవ్యవస్థ, పరిపాలన వ్యవస్థ), ప్రజాస్వామ్యం బలోపేతం అవుతాయి.





Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles