Monday, December 30, 2024

తన పుస్తకంతో మనకు తూర్పు దారులు తెరిచిన సంజయ్ బారు

న గత చరిత్ర శకలాల మధ్య నుంచి తిరిగి మొలకెత్తే నూతన పునర్నిర్మాణం ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం తొంభై దశకంలో మొదలయిన మన- ‘లుక్ ఈస్ట్’  వైఖరిలో దొరుకుతుంది. ఈ విషయం గురించి మాట్లాడ్డానికి, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు సమాజానికి ఉన్న ప్రాసంగికత ప్రత్యేకమైనది. అదెలా అన్నప్పుడు- ప్రాచీన ఈజిప్టు, గ్రీకు, రోమన్, జ్ఞాన పవనాల ప్రతిఫలనాలను ఇండియా భారతీకరించుకోవడం తొలిదశ అయితే; అది వాటిని విజయవంతంగా తూర్పుదేశాలకు బట్వాడా చేయడం తదుపరి దశ. తూర్పు పశ్చమాల మధ్య ఇటువంటి ఆదాన ప్రదానాలకు కేంద్రబిందువుగా ఉన్నదే, ఆసియాలో ఒకప్పటి వైభవోపేతమైన- భారతీయ జ్ఞానసంపత్తి.

Also read: ఉద్రిక్తతల్లో ‘ఆమె’ లక్ష్యం కావడం అనాగరికం!

‘నెహ్రూ డిస్కవరీ’

ఈ విహంగ వీక్షణం నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గ్రంధంలోని వివరాలతో మొదలు పెడదాం. (పేజి 203)  “భారత్ నుంచి పెద్ద ఎత్తున పండిత వర్గం చైనా వెళ్లి వారికి సంస్కృతాన్ని బోధిస్తూ చినీ భాషలోకి సంస్కృత గ్రంధాలను తర్జుమా చేశారు. వారిలో ప్రముఖుడు కాశ్యప మాతంగ కీ.శ. 67 లో మింగ్ చి చక్రవర్తి ఆహ్వానంపై చైనా వెళ్ళి- ‘లో’ నదీ తీరంలోని లోయాంగ్ పట్టణంలో నివాసం ఉన్నాడు.

భారత్ నుంచి ఇలా చైనా వెళ్ళిన ప్రముఖుల్లో – బుద్దభద్ర, జీనభద్ర, ధర్మరక్ష, కుమారజీవ, పారమార్ధ, జీనగుప్త, బోధిధర్మ మొదలైన ప్రముఖులు ఉన్నారు. ఒక దశలో (కీ.శ. ఆరవ శతాబ్దికి) ఒక్క లియాంగ్ పరగణాలోనే మూడు వేల మంది భారతీయ బౌద్ద భిక్షవులు, పది వేల భారతీయ కుటుంబాలు ఉండేవి” అంటారు నెహ్రూ. ప్రముఖ యాత్రా చరిత్రకారుడుగా మనం ప్రస్తావించే పాహియాన్ (కీ.శ. 337- 422) మన వద్ద నుంచి చైనా వెళ్ళిన కుమారజీవ వద్ద శిష్యుడు.

పీవీ నరసింహారావు, టుక్ ఈస్ట్ పాలసీకి ఆద్యుడు

తెలుగు వారు

ఏమిటి ఈ వ్యాసం ఆరంభం అంటే- గత నెల చివరిలో ఒక తెలుగు ప్రముఖుడు సంపాదకత్వం వహించిన అంతర్జాతీయ స్థాయి ఆంగ్ల గ్రంథం ఒకటి ఢిల్లీలో ఆవిష్కరించబడిన సందర్భంగా, దాని పరిచయం గురించి మాట్లాడ్డానికి అవసరమైన భూమిక కోసం ఇంతగా వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.

అటువంటి అరుదైన గ్రంథాన్ని తెచ్చింది- సంజయ్ బారు. వీరు International Institute of Strategic Studies డైరెక్టర్ గా పనిచేస్తూ 2004-2008 మధ్య ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసారు. సంజయ్ తండ్రి బి. పి. ఆర్. విఠల్ ఎన్ఠీఆర్ జమానాలో ఆర్ధిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఐ.ఏ.ఎస్. అధికారి. 

‘బిఫోర్ హిజ్ టైమ్స్’

సంజయ్ బారు ‘ఎడిట్’ చేసిన గ్రంథం- ‘The Importance of Shinzo Abe: India, Japan and the Indo-Pacific’ జులై 21న ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఆవిష్కరించారు. దీన్ని సంజయ్ బారు దివంగత జపాన్ ప్రధాన మంత్రి షింజే అబే మొదటి వర్ధంతి నాటికి విడుదల చేశారు. కేంద్రమంత్రి కాకముందు భారత విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన జై శంకర్ ఈ గ్రంధానికి ఏడు పేజీల ఉపోద్ఘాతాన్ని రాశారు. అందులో ఆయన ఇప్పటి ‘ఇండో-ఫసిఫిక్’ ప్రాంతంలోని దేశాలైన సింగపూర్, చైనా రాయబారిగా పనిచేసిన కాలం నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.

Also read: ఆ సంస్కారం మనకు అలవడినప్పుడు…

అందులో- “ఎబే వజ్ ఏ ప్రాఫెట్ బిఫోర్ హిజ్ టైమ్స్” అంటూ జై శంకర్ చేసిన వ్యాఖ్య, అనివార్యంగా 90′ దశకం ఆరంభంలో మన ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ పి. వి. నరసింహారావు వద్దకు మనల్ని నడిపిస్తుంది. ఇక్కడే 2022 జులై లో హత్యకు గురియైన ఎబే గురించి ముందుగా ఒక విషయం మనకు తెలియడం కూడా అవసరం.

రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా-నాగసాకి పట్టణాలపై జరిగిన బాంబు దాడులు తర్వాత, పునర్నిర్మాణం జరిగిన నాటి (1957) జపాన్ దేశ ప్రధాన మంత్రి నబుశ్యికె కిషి మనవడు ఈ- షింజో ఎబే. ఇక జపాన్ లో జరిగిన ఆ పునర్నిర్మాణం ఎటువంటిదో మనకు తెలియంది కాదు.

మన్మోహన్ సింగ్ మీడియా అడ్వయిజర్ గా సంజయ్ బారు

వెలుగుకు వెలితి

అయినా మనవంటి దేశంలో ప్రవక్తల మీద పడే వెలుగు చాలా స్వల్పం! ఎందుకు ఈ మాట అనడం అంటే, పి వి. తర్వాత యు.పి.ఏ. కాలంలోనే కాంగ్రెస్ ప్రధాని- ‘పి.వి. తూర్పుచూపు’ గురించి ఆ పార్టీతో పాటు అందరూ దాన్ని మర్చిపోయారు. పి.వి. ‘లుక్ ఈస్ట్’ అంటూ మన ‘తూర్పుచూపు’ అవసరాన్ని ముందుగా గుర్తించి, అంతే సాహసోపేతంగా దాన్ని ప్రకటించి మరీ ఆయన తన బాధ్యతను పూర్తిచేశారు.

కానీ మనవద్ద- “పి.వి. ఏ ప్రాఫెట్ బిఫోర్ హిజ్ టైమ్స్” అనడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు  కనిపించరు! ఈ రోజున అంతర్జాతీయ సంబంధాలలో- ‘జియో-పాలిటిక్స్’ (భౌగోళిక-రాజకీయాలు) కీలకమై ప్రపంచ పరిణామాలకు- ‘ఇండో-ఫసిఫిక్’ ప్రాంతం వేదిక అయిన తర్వాత అయినా నూతన భారతీయ చరిత్ర రచనకు- ‘తెలుగు నాడు’ ఇచ్చిన ‘కాంట్రిబ్యూషన్’ గురించి; ఇతరుల సంగతి ఎలా ఉన్నా మనమైనా దాన్ని ‘రికార్డ్’ చేసుకోవాలి. ఆ మేరకు సంజయ్ బారు చొరవ చరిత్రలో ఒక మైలురాయిగా మిగులుతుంది.

Also read: రాష్ట్రవిభజన రహస్యం వెల్లడించిన విశాఖ వేదిక! 

లిక్విడ్ ఫిలాసఫీ

ఇండో-పెసిఫిక్ ప్రాంతం

జులై 2022లో హత్యకు గురైన జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే జపాన్-ఇండియా, ఇండో-ఫసిఫిక్ ప్రాంతానికి అందించిన సేవలపై తొలి ఏడాదిలోనే ఇంత విస్తృతమైన అంశాలపై పలువురు ఇండో-జపాన్ ప్రముఖులు రాసిన వ్యాసాలతో వచ్చిన రచన ఇది. ఇందులో మూడు విభాగాల్లో మొత్తం 15 మంది రాసిన వ్యాసాలు ఉన్నాయి. సంపాదకుడుగా సంజయ్ బారు గ్రంధాన్ని మనకు పరిచయం చేస్తూ- షింజో అబే మన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ తన ‘గురువు’ (మెంటర్) అని, ప్రధాని నరేంద్ర మోడీ మంచి మిత్రుడు అని చెప్పేవారని, అబే వ్యక్తిగత కార్యదర్శి చెప్పినట్టు రాసారు.

 షింజో – సింగ్ ఇద్దరి చిత్రం ప్రధానంగా ఉన్న ఈ గ్రంథం- ‘టైటిల్’లో ఇండియా-జపాన్ అనడం అంటే అది సరే, అవొక భౌగోళిక సరిహద్దులున్న దేశాలు. కానీ, ‘ఇండో-ఫసిఫిక్’ అలాకాదు అదొక నైరూప్య భావన. ప్రపంచ పటంలో అది మనకు  కనిపించదు. మనమే దాన్ని ప్రపంచపటం మీద స్కెచ్ పెన్ తో ఒక సున్నా చుట్టి ‘మార్క్’ చేసుకోవాలి. అది మన దేశం చుట్టూ రావడం అనేది అది వేరే విషయం.  అయితే మరది కొత్తగా ఎలా ఉనికిలోకి వచ్చింది?

అబే, మోదీ

మూలాలు మనవే…

మన మట్టుకు దాని మూలాలు మనవద్దనే ఉన్నాయి. ఇక్కడ- ‘లుక్ ఈస్ట్’ అన్న ప్రధానమంత్రి (1991-96) పి.వి. మంత్రి మండలిలో డా. మన్మోహన్ సింగ్ ఆర్ధికమంత్రిగా పనిచేశారు. డా. మన్మోహన్ సింగ్ తిరిగి 2004-2014 మధ్య ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పి. వి. మంత్రిమండలిలో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న కాలంలో ఇండో-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అంతే శ్రద్ద చూపారు. 

ఆయన్ని- ‘నా ‘గురువు’ అని షింజే అబే అనడంతో, కొందరు ఇప్పుడు మన మధ్య   లేకున్నా(మన్మోహన్ రూపంలో పి.వి.) తమ కాలం తర్వాత కూడా చరిత్రలో వారు ఎలా ప్రవహిస్తారో సంజయ్ బారు అబేపై తెచ్చిన గ్రంథం ద్వారా ‘డాక్యుమెంట్’ చేసారు. తొలుత ‘ఆసియా-ఫసిఫిక్’ అని చలామణిలోకి వచ్చిన ఈ- ‘జియో-పొలిటికల్’ భావనను తర్వాత కాలంలో- ‘ఇండో-ఫసిఫిక్’ అని మార్చింది షింజే అబే అంటారు బారు.

Also read: ‘సీన్’ ఇండియా మ్యాప్ క్రిందికి కనుక ‘షిఫ్ట్’ అయితే?

జపాన్ తో సింగ్ బంధం

ఒకప్పటి పి.వి. ‘తూర్పు చూపు’ అనే నైరూప్య భావనలు ఆ తర్వాతి కాలంలో పదేళ్ళపాటు డా. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో- ‘గ్రౌండింగ్’ అయిన వైనాన్ని, మన కంటే ఎక్కువగా దగ్గర నుంచి చూసినవారు ఉండరు. అందుకు- సింగ్ ప్రభుత్వం తెచ్చిన ‘రాష్ట్ర పునర్విభజన చట్టం’ గొప్ప ఉదాహరణ అవుతుంది. అది ఆయన కాకుండా మరొక ‘పొలిటికల్ మైలేజి’ లెక్కలు వేసుకునే వారు కనుక అప్పట్లో ‘ఢిల్లీ’ పీఠంపై ఉండి ఉంటే, అది ఎప్పటికయ్యేనో?!  

అంతేనా జైరాం రమేశ్ కేంద్ర వాణిజ్య సహాయ మంత్రిగా ఉన్న రోజుల్లో 2008 డిసెంబర్ నాటికి ఇండియా ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో- నాటి సి.ఎం. వై.ఎస్. చొరవతో మన ‘అరకు కాఫీ’ ఆ ఎగుమతుల జాబితాలో చేరిన విషయం, ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవాలి.

డా. మన్మోహన్ సింగ్ 1980 నాటికి ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్ గా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ మన్మోహన్ ను ఇండో-జపాన్ స్టడీ కమిటీ కో-చైర్మన్ గా నియమించింది. ఆ విషయాన్ని బారు తన ముందుమాటలో ఉటంకిస్తూ, సింగ్ కు జపాన్ పట్ల ఇండియా ఎటువంటి వైఖరితో ఉండాల్సి ఉంటుంది అనే విషయంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. 

రాసేవారు ఎవరురా?

దివంగత జపాన్ ప్రధానమంత్రి షింజో ఎబే ‘స్పీచ్ రైటర్’ టోమోహికో తనిగుచితో తన గ్రంథంలో మొదటి వ్యాసం రాయించి, నాటి మన ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ప్రసంగాల రచయితగా సంజయ్ బారు ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించడం బాగుంది. ‘ది హిందూ’ దినపత్రిక దౌత్య వ్యవహారాల ఎడిటర్ శ్రీమతి సుహాసిని హైదర్ కూడా ఒక వ్యాసం రాసారు.

చివరిగా- ఆర్ధిక సంస్కరణల అమలులో తొలుత ఆర్ధిక మంత్రిగా తర్వాత ప్రధాన మంత్రిగా సింగ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనల్లో ఇక్కడ డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాలన గురించి బహిరంగ సభల్లో మాట్లాడుతూ- ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ప్రత్యేకమైన ప్రశంసలు చేసేవారు. అప్పట్లో ఆయన తరుచూ- ‘ఏ. పి. మోడల్’ అని కూడా అనేవారు. నాటి ప్రధాని నోటివెంట ఇటువంటి పదప్రయోగాల వెనుక, ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు పి.వి. ప్రభావం అయినా, ఆయన ప్రసంగాల రచయిత, పత్రికా సలహాదారు సంజయ్ బారు ప్రభావం అయినా ఉండదని అనుకోలేము.   

జాతీయ పతాక, మువ్వన్నెల జెండా

ఇప్పుడు 75 ఏళ్ళ ‘పంద్రాగస్టు’ మైలురాయి దాటి మనం ముందుకు వెళుతున్న సమయాన, కొందరు నేతల ప్రసంగాల్లో ప్రత్యర్థుల్ని- ‘బురదలో వేసి తొక్కుతా…’ వంటి పదప్రబంధాలు వీరి- ‘స్పీచ్ రైటర్స్’ జ్ఞాన గుళికలు కనుక అయితే, చివరికి వీరిని ‘బ్రోచేవారెవరు రా…’ అనుకోవడం వినా మరో మార్గం కనిపించదు. ఎందుకంటే, కృష్ణా మండలంలో ఇటువంటి తిట్లు మోతుబరి భూస్వాములు మానేసి కూడా చాన్నాళ్లు అయింది.

Also read: ‘ఇండో-ఫసిఫిక్’ అనివార్యతతోనైనా ఏపీ పట్ల ఢిల్లీ వైఖరి మారేనా?    

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles