అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆత్మలు అమరపురికి చేరాయి. వారం రోజుల వ్యవధిలోనే ఈ విషాదం జరిగింది. ఆయనకు ఆత్మబంధువు,అనుజడు వంటి పట్రాయని సంగీతరావు ఈ లోకాన్ని వీడి పట్టుమని పదిరోజులు కాలేదు.”అత్మా వై పుత్ర నామాసి” అన్నట్లుగా, ఆత్మజుడైన తనయుడు రత్నకుమార్ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఘంటసాల సంగీతానికి వారసులు. భార్య సావిత్రి, మిగిలిన సంతానం మన మధ్య ఆరోగ్య శోభితంగా ఉన్నప్పటికీ, వీళ్ళిద్దరూ వారం రోజుల వ్యవధిలోనే వెళ్లిపోవడం, ఆ కుటుంబానికే కాక, ఘంటసాల ఆరాధకులందరికీ అనంతమైన దుఃఖాన్ని కలిగిస్తోంది. ఒకరు మిత్రుడు, గురుపుత్రుడు, ఇంకొకరు తన పుత్రుడు. వీరిరువురూ ఘంటసాల అనే మహావృక్షం నీడలో తన్మయులైన ధన్యజీవులు. పట్రాయని సంగీతరావు, ఘంటసాల ఇద్దరూ ఇంచుమించుగా సమ వయస్కులు, సంపూర్ణంగా సమ మనస్కులు.
Also read: కారామాస్టారి కథ కొనసాగుతుంది
సంగీతరావు-ఘంటసాల అనుబంధం
సంగీతరావుకు పెద్దలు పెట్టిన పేరు నరసింహమూర్తి. తండ్రి సీతారామశాస్త్రి, తాత నరసింహశాస్త్రి ఇద్దరూ సంగీత విద్వాంసులే. అచట పుట్టిన చెవైన కొమ్మ సంగీతరావు. వారసత్వంగా (జన్మాంతరంగా ) వచ్చిన సంగీత సంస్కారంతో పాటు సహజ ప్రతిభావంతుడైన సంగీతరావు తాత, తండ్రుల నుంచి గురువుల నుంచి పొందిన జ్ఞానం కూడా చాలా గొప్పది. సంగీతరావు తండ్రి సీతారామశాస్త్రి విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత విద్యను అభ్యసించడానికి విజయనగరం వచ్చారు. అతి తక్కువకాలంలోనే గురువు సీతారామశాస్త్రికి ఘంటసాల ప్రియశిష్యుడయ్యాడు. అప్పటి నుంచి మొదలైన ఘంటసాల – సంగీతరావు స్నేహం జీవితాంతం కొనసాగింది. ఘంటసాలకు సహాయకుడిగా చేరిన సంగీతరావు ఆయనలో సగభాగమయ్యారు. సినిమా పాటల స్వర రచనతో పాటు, ఆర్కెస్ట్రాలోనూ, ప్రైవేట్ ఆల్బమ్స్ రూపకల్పన లోను సంగీతరావు హస్తం ఉండి తీరాల్సిందే. దేశ విదేశాల్లో ఎక్కడ పర్యటన చేసినా ఆత్మమిత్రుడు వచ్చి తీరాల్సిందే. ‘భగవద్గీత’ మహా నిర్మాణంలో సంగీతరావు పాత్ర వెలకట్టలేనిది. ఆయనకుండే అపారమైన సంగీత పరిజ్ఞానాన్ని, సాహిత్య పాండిత్యాన్ని ఈ మహా స్వర కల్పనలో వెచ్చించారు. ఘంటసాల దివ్య గానానికి, సంగీతరావు భవ్య జ్ఞానం తోడై నిలిచింది. అందుకే, ఆ కృతులన్నీ అజరామరంగా విలసిల్లుతున్నాయి.
Also read: సప్తప్రతిభాశాలి బాల సుబ్రహ్మణ్యం
కూచిపూడి అకాడెమీలో అమేయమైన పాత్ర
ఘంటసాల మరణం తర్వాత, వెంపటి చినసత్యం స్థాపించిన ‘కూచిపూడి అకాడెమీ’లో అమేయమైన పాత్రను పోషించారు. ఆ నృత్య రూపకాల సంగీత రూపకల్పనలో సంగీతరావు చేసిన విన్యాసాలు రసభావ బంధురాలు. తనలోని సహజ ప్రతిభ, కళాత్మకతలు అడుగడుగునా, ఆణువణువూ రసరమ్యంగా రాణించాయి. ఆదిభట్ల నారాయణదాసు హరికథలలోని విశేషాలను, విశేష రాగాలను వివరిస్తూ సంగీతరావు చేసిన ప్రసంగాలు ఆశ్చర్య చకితాలు. కర్ణాటక, హిందూస్తానీ సంగీతాలలో ఉన్న అపారమైన జ్ఞానం, అనుభవం అటు ఘంటసాలకు -ఇటు వెంపటి చినసత్యంకు ఎంతో హృదయరంజితం అయ్యాయి. 101 సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని గడిపి, హృదయమంతా ఘంటసాలను నింపుకొన్న సంగీతరావు తెలుగుజాతి రత్నం.
Also read: మరపురాని మహానాయకుడు
బహుముఖ ప్రతిభారత్నం
ఘంటసాల రత్నకుమార్ బహుముఖ ప్రతిభారత్నం. మంచి గాయకుడు, గొప్ప గాత్రకళా విద్వాంసుడు ( డబ్బింగ్ ఆర్టిస్ట్), నటుడు, దర్శకుడు, రచయిత, బహుభాషావేత్త, వ్యాఖ్యాత, ప్రయోక్త, యాంకర్. పితృదేవతల నుంచి పొందిన సహజ కళా సంస్కారం, ప్రతిభతో రత్నకుమార్ తాను స్పృశించిన రంగాలలో తన విజయముద్రను వేసుకున్నారు. 64ఏళ్లకే ఈ లోకాన్ని వీడారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గాయకుడుగా, స్వరకర్తగా శిఖర సదృశమైన ముద్ర వేసుకున్నారు. తనయుడు రత్నకుమార్ గాత్రదాతగా పొందిన ఘనత కూడా సామాన్యమైంది కాదు. తండ్రి వారసత్వాన్ని తన సామర్ధ్యం, యోగంమేరకు నిలబెట్టి, కృతకృత్యులయ్యారు. ‘దివ్యగాత్రుడు’ ఘంటసాలకు ఆత్మలైన సంగీతరావు, రత్నకుమార్ ఇద్దరూ కరోనాతో వరుసగా మరణించడం మరింత బాధాకరం. అమరగాయకుడు ఘంటసాల నాదంలో ఐక్యమైన ఈ ఉభయులకు అంజలి ఘటిద్దాం.
Also read: మనసుకవికి శతవత్సర వందనం