పాలక పక్షాలకు తాము చేస్తున్న పాలన కార్యక్రమాలన్నీ సవ్యంగా కనిపించడం, ఆ పథకాలలో అంతులేని అవినీతి దాగివుందని, పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన పనులని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం రాజకీయాలలో రివాజు. తాము చేస్తున్న పనులు ఎందుకు మంచివో అధికార పక్షం ప్రజలకు వివరిస్తే, వాటివల్ల ప్రజలు, భవిష్యత్తు తరాలు ఎంత తీవ్రంగా నష్టపోతారో ప్రతిపక్షాలు విన్నవించుకుంటాయి. ఇరువురి వాదనలు వింటూనే తమ నిత్యజీవితంలో జరుగుతున్న మార్పులను బేరీజు వేసుకుని ప్రజలు తమ అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు. ఆ క్రమంలో ప్రజలంతా అటూఇటూగా విడిపోతారు. ఆ విధంగానే ఓటుబ్యాంకు రూపొందుతుంది. ఎన్నికలు జరిగినప్పుడు ఎటువైపు మొగ్గు చూపించాలో తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎటూ తేల్చుకోలేక మరికొందరు ఏ నిర్ణయమూ తీసుకోకుండా మధ్యలో ఊగిసలాడుతుంటారు. అలా తటస్థంగా నిల్చున్న ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడానికి రాజకీయ పక్షాలు నిరంతరం ప్రజాక్షేత్రంలో పోరు సలపాల్సిందే.
Also read: సభ ముగిసింది.. సందేశం చేరింది..
ముప్పైవేల ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం
ఏడాదికి మూడు పంటలు పండే సస్యశ్యామలమైన ముప్పైవేల ఎకరాల భూమిని రైతులనుంచి సేకరించడానికి గత ప్రభుత్వం ఎంతో ప్రయత్నించి విజయవంతమైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సర్వశక్తులనూ ఒడ్డి, ఆ ప్రాంత రైతులు తమ భూముల్ని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించేలా భగీరథ కృషి సలిపారు. అనితరసాధ్యమైన ఆ భూయజ్ఞాన్ని యావద్దేశమూ విస్తుపోయి చూసింది. అలా భూమిని భూతల స్వర్గంగా మార్చేద్దామని ఐదేళ్లపాటు అనుకూల మీడియా అక్కడి రైతులతో పాటు, యావదాంధ్రలోకాన్నీ ఊహాలోకంలో విహరింపజేసింది. మనిషికి డబ్బుపట్ల ఉన్న వ్యామోహాన్ని ఉపయోగించుకుని – రైతుకు పేగుబంధమైన వ్యవసాయాన్ని అక్కడి రైతుల మనసులలోనుంచి పెకలించి పారేశారు. భూమిని తమ జీవికకు ఆహారాన్ని అందించే ఆధార వనరుగా చూడకుండా, డబ్బును పండించే ధనయంత్రంగా చూసేలా మార్చారు.
Also read: కార్పొరేట్ల మాయ.. గ్రేడ్ల గారడీతో విద్యావ్యవస్థకు తుప్పు
సాగు భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం
ఈ విధంగా సాగుయోగ్యమైన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదని, అందులోనూ ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని అప్పటి ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భూమీ ఆకాశం దద్దరిల్లిపోయేటట్టు ప్రచారం చేసింది. ప్రభుత్వ అధినేత తన సామాజిక వర్గానికి వ్యాపారపరమైన లబ్ధి చేకూర్చేందుకే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విస్తృత ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా రాష్ట్రమంతటా ప్రతి పల్లెనూ, ప్రతి పట్టణాన్ని తన పాదయాత్రలో కలియతిరుగుతూ దాదాపుగా ప్రతి పౌరునికి ప్రభుత్వం చేస్తున్న రాజధాని నిర్మాణంలో పెద్ద రియల్ ఎస్టేట్ దాహార్తి దాగి ఉందని తెలియజెప్పారు. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రతి ఉపన్యాసంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను ప్రస్తావించడంతో ఆగిపోకుండా.. అతి ముఖ్యమైన అంశంగా రాజధాని నిర్మాణాన్ని ప్రజల ముందుంచారు. ఎన్నికలలో ఓటర్లు తమ పార్టీవైపు మొగ్గు చూపించే ఒక ప్రధాన అంశంగా ఈ ముప్పైవేల ఎకరాల రాజధాని రియల్ ఎస్టేట్ అంశాన్ని రూపొందించారు. అందుకోసం పుస్తకాలు ప్రచురించారు. మేధావులతో మాట్లాడించారు.
Also read: మనిషి నిజనైజం పోరాడడమే!
తిప్పికొట్టలేకపోయిన ప్రచారం
అప్పటి ఎన్నికలలో ప్రజలు ఎన్నుకోబోయే ప్రభుత్వపు ప్రాధాన్యతలలో ఏయే అంశాలు ఉండాలో వారు ఎంచుకునేలా జగన్ మైండ్ గేమ్ ఆడారు. అప్పటివరకు ప్రజలతో చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్ కంటే ఇది చాలా విభిన్నమైన పొలిటికల్ గేమ్. ప్రతిపక్షపు ఎత్తులకు పై ఎత్తులు వేసి, దీటుగా సమాధానం చెప్పగలిగిన అస్త్రాలు చంద్రబాబు దగ్గర లేకుండా పోయాయి. తన అనుకూల మీడియాతో అప్పటికి తొమ్మిదేళ్లుగా చేయిస్తున్న ‘అవినీతి’ ప్రచారంపైనే ఆధారపడక తప్పింది కాదు. లక్షకోట్ల అవినీతినే అరిగిపోయిన గ్రామఫోను రికార్డులాగా పేపర్లలో పేజీల కొద్దీ, టీవీ చానెళ్లలో గంటలకొద్దీ ప్రజలచేత చదివించారు, చూసేలా చేశారు. ప్రజలు తీసుకునే నిర్ణయం గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఫలితం అందరికీ తెలిసిందే. యాభై రెండు శాతం ఓటర్లు జగన్ మాటలు నమ్మగా, నలభై తొమ్మిది శాతం జనం చంద్రబాబు వైపు నిలిచారు.
Also read: తప్పు ఎక్కడ జరిగింది!
అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం జగన్ చేతుల్లో
ఇదంతా ఇంకా అందరి జ్ఞాపకాలలో ఇంకీఇంకక ముందే అదే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జగన్ ప్రభుత్వం తీసుకోవడం ప్రపంచ వింతల్లోకెల్లా గొప్ప వింత. ఒకే చోట ముప్పైవేల ఎకరాలలో సాగుభూమిని నిర్లక్ష్యం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నమాట వాడకుండా, రాజధాని కడతామని అప్పటి ప్రభుత్వం చేసిన పని తప్పని నానాయాగీ చేసిన వారే ఇప్పుడు రాష్ట్రమంతటా కొన్ని వేల ఎకరాలలో జగనన్న స్మార్ట్ టౌన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడడం విడ్డూరం. ఇప్పటికే ఈ వ్యాపారానికి పైలట్ జిల్లాలుగా అనంతపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలను ఎన్నుకోవడమే కాదు, రియల్ వ్యాపారం చెయ్యడానికి అనువైన ప్రదేశాలను కూడా గుర్తించారు. ఈ జిల్లాలలో ధర్మవరం, కావలి, రాయచోటి, కందుకూరు, ఏలూరు, మంగళగిరి ప్రాంతాలలో జగనన్న స్మార్ట్ టౌన్లు నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టేశారు. అంటే స్థలాలు గుర్తించడమే కాదు, అప్పుడే భూసేకరణ కూడా పూర్తి చేశారు.
Also read: మింగమన్నా కోపమే, కక్కమన్నా కోపమే!
తేలు కుట్టిన దొంగల్లా ప్రతిపక్షాలు
ప్రజల నుంచి భూమిని సేకరించి, రియల్ ఎస్టేట్ డెవలపర్ల చేతిలో పెట్టి, వారి చేత ఇళ్లు కట్టించి, అవి ప్రజలకు అమ్మి, దానినుంచి డబ్బులు సేకరించి, ఆయా రైతులకు అందులో కొంత వాటా చెల్లిస్తారన్న మాట. ఇందులో చంద్రబాబు చేసిందానికి, జగన్ చేస్తున్న దానికి తేడా ఇసుమంతైనా లేదు. అక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు. అదొక్క తేడా తప్ప మిగిలినదంతా సేమ్ టు సేమ్, 150, 200, 240 గజాల ఇళ్లు నిర్మించి ప్రజలకు అందజేయడంలో తన ప్రమేయం ఎక్కడా లేకుండా ప్రభుత్వం డబ్బులు సంపాదిస్తున్న ఈ వ్యాపారంలో ప్రతిపక్షానికి తప్పు కనిపించక పోవడం విడ్డూరం. తేలు కుట్టిన దొంగల్లాగా ప్రతిపక్షం దీనిమీద చడీచప్పుడు చెయ్యకుండా నిల్చుంది. ఈ ఆరు నియోజకవర్గాలలో పథకం విజయవంతమైతే మిగిలిన అన్ని నియోజక వర్గాలలో దీనిని విస్తరిస్తారు కాబోలు. అనంతపురంలో 55 ఎకరాలలో 160 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నోటిఫికేషన్ వెలువడడమే కాకుండా పనులు కూడా మొదలయ్యాయి. డెవలపర్లకున్న సందేహాలను గత శనివారం సమావేశంలో సిఆర్‌డీఏ పెద్దలు నివృత్తి కూడా చేశారు. ఒక్కో టౌన్షిప్ కోసం ఇరవై నుంచి యాభై ఎకరాలు సేకరిస్తున్నారు.
Also read: ‘జైైభీమ్’ సినిమా మన ఆలోచనను మారుస్తుందా!
పది వేల ఎకరాల పంటభూములు
అంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పదివేల ఎకరాల సస్యశ్యామలమైన పంటభూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం పూనుకుంటోంది. దీనిని ప్రశ్నిస్తున్న రాజకీయ పార్టీ గానీ, సామాజిక సంస్థ గానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం లేకపోవడం మన సామాజిక దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రభుత్వ పాలన విధానాలలో మంచిచెడులను విశ్లేషించే సామాజిక సంస్థలకు పూర్తి స్పేస్ లేకపోవడం సామాజిక స్తబ్దతను చూపిస్తోంది. పత్రికలు, టీవీ చానెళ్లు వారివి, వీరివిగా విడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసినా చెడుగా చూపించడమే వారి పనవ్వగా, అన్నింటిని ఆకాశానికెత్తేయడం వీరి పనయింది. అసలు భవిష్యత్ తరాల మీద ప్రస్తుత పథకాల ప్రభావాన్ని చర్చించే ఒక తటస్థ సామాజిక మేధావులుగానీ, పత్రికలు గానీ, చర్చ జరిపే వాతావరణంగానీ లేకపోవడం ఆ సమాజపు వెనుకబాటుతనానికి నిదర్శనం. మనం ఇప్పుడు ఆటవిక యుగంలో లేకపోవచ్చు గాని, ఖచ్చితంగా పురోగామి సమాజంలో మాత్రం లేము అని వర్తమాన ఆంధ్రప్రదేశ్ మనల్ని వెక్కిరిస్తోంది.
Also read: సైన్యం చేసిన హత్యలకు శిక్షల్లేవా?
దుప్పల రవికుమార్
మొబైల్: 9989265444