బైబిల్ ఎవరైనా కొంటారా? ఖురాన్ కొంటారా ఎవరైనా? మరి భగవద్గీతనూ, వేదాలనూ, రామాయణాన్నీ, భాగవతాన్నీ, భారతాన్ని ఎందుకు కొనాలి? ఈ ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పుకొని గత ఇరవై రెండు సంవత్సరాలుగా మహాగ్రంథాలను సొంతడబ్బుతో అచ్చు వేయించి ఉచితంగా పంచిపెడుతున్నారు చల్లా సాంబిరెడ్డిగారు. నేను వార్త, ఆంధ్రజ్యోతి, హెచ్ఎంటీవీ, సాక్షిలో పని చేసే సమయంలో ఆయా ఆఫీసులో కలుసుకున్నారు. ఈ రోజు నాకు ఆఫీసంటూ లేదు కనుక ఇంటికి వచ్చారు. ‘పురాణదర్శనం’ మూడు భాగాలూ నాలుగు సెట్లూ నాకూ, నా శ్రీమతికీ ప్రదానం చేశారు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేను అడిగిన మీదట మరోసారి ఆయన జీవనయానం గురించి క్లుప్తంగా చెప్పారు.
హిందూ కళాశాల పట్టభద్రుడు, ఉస్మానియా ఎల్ఎల్ బి
గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర రెడ్డిపాలెంలో 84 సంవత్సరాల కిందట సాంబిరెడ్డి జన్మించారు. గుంటూరు శివారు గ్రామానికి ఆయన చిన్నతనంలోనే వారి తండ్రి సకుటుంబంగా ఇల్లరికం వెళ్ళారు. గుంటూరు హిందూ హైస్కూలులో, హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు సాంబిరెడ్డి. ఆయనే ఇంటికి తన తరంలో పెద్ద. తమ్ముడు ఇటీవల ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఇద్దరు చెల్లెళ్ళు. ఒకరు కాలం చేశారు. ఒక చెల్లెలు గుంటూరు జిల్లాలలో ఉంటున్నారు.
సాంబిరెడ్డిగారిది పేద కుటుంబం. హైదరాబాద్ వచ్చి హైకోర్టు గుమాస్తాగా 16 జనవరి 1961నాడు చేరారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే బలమైన కోరిక ఉండేది. ఉస్మానియా సాయంకళాశాలలో లా చదివారు. మార్చిలో పరీక్ష రాసి స్వర్ణపతకం సాధించారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ వచ్చారు. గుమాస్తా ఉద్యోగానికి రాజీనామా చేశారు. కోర్టు రిజిస్ట్రార్ పిలిచి రాజీనామా వద్దన్నారు. సెలవు పెట్టి చదువుకోమన్నారు. ఎల్ఎల్ బీ పూర్తయిన తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఎల్ఎల్ఎంలో చేరారు. స్వగ్రామంలో చిన్న కమతం ఉంటే దాన్ని అమ్మేసి పోచంపాడు ప్రాజెక్టుకింద 35 ఎకరాల పొలం కొన్నారు. ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి నిజామాబాద్ లో స్థిరపడిన కుటుంబంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎల్ఎల్ఎం లో మర్కంటైల్ లా సబ్జెక్టు కొత్తగా ప్రవేశపెట్టారు. అందుకు అవసరమైన పుస్తకాలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండేవి కావు. అందుకని మద్రాసు వెళ్ళి నెలరోజులు అక్కడే ఉండి ఆ సబ్జెక్టు క్షుణ్ణంగా చదువుకొని హైదరాబాద్ వచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరంలో ఉండగానే నిజాంసాగర్ నిర్వాసితులకు వారు కోల్పోయే భూములకు గాను నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమంలోకి దిగారు. రామగుండంలో మకాం పెట్టారు. ఆయనా, ఆయన మిత్రులూ కలసి కొనుగోలు చేసిన 250 ఎకరాలు జలాశయం కిందికి వెళ్ళిపోయాయి. తమ భూములకు పరిహారం కోసం కొట్లాడటంతో పాటు ఇతర పేద రైతుల, దళితుల భూముల పరిహారం కోసం కూడా పోరాటం చేశారు.
నష్టపరిహారం కోసం ప్రయాస
అప్పటి నుంచి సాంబిరెడ్డిగారికి ధర్మనిష్ఠ ఉండేది. ధర్మాగ్రహం ఉండేది. ధర్మానికి సత్యం మూలమని విశ్వసించేవారు. మొత్తం 13 గ్రామాలు జలాశయం వల్ల ఉనికి కోల్పోయాయి. ఆ గ్రామాలకు చెందినవారికి పరిహారం ఇప్పించే కార్యక్రమంలో పూర్తిగా దిగిపోయారు. గ్రామ పట్వారీలనూ, రైతులనూ, రెవెన్యూ అధికారులనూ కూర్చోబెట్టుకొని భూముల వివరాలు, యజమానుల తబ్శీళ్ళు నమోదు చేశారు సాంబిరెడ్డి. యజ్ఞం వంటి ఈ కార్యక్రమంలో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లూ, నలుగురు తహసీల్దార్లూ, ఎనిమిదిమంది డిప్యూటీ తహసీల్దార్లూ కలిపి మొత్తం 50 మంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భూముల రిజస్ట్రేషన్ లో చూపించే ధరలు మరీ తక్కువ అనిపించింది. సొంత డబ్బు ఖర్చు చేసి ఎక్కువ ధరలు చెల్లించి పదిహేను భూముల రిజిస్ట్రేషన్ చేయించారు. వెంకటస్వామి అనే న్యాయవాది సహకారం తీసుకున్నారు.
నక్సలైట్లు (అన్నలు) వచ్చారు. వాళ్ళు చెప్పినట్టు చేయమన్నారు. కుదరదన్నారు సాంబిరెడ్డి. ‘మీరు చెప్పినట్టు చేస్తే రైతులకు నష్టం జరుగుతుంది,’ అని స్పష్టం చేశారు. ‘మీరు దుర్మార్గులను చంపేస్తే మీ వెంటే నేనూ ఉంటా. లంచాలు తీసుకొని దుర్మార్గులను రక్షిస్తూ అమాయకులను చంపడం అధర్మం. ఎట్లా చంపుతారు?’’ అని ప్రశ్నించారు.
‘మందు నిన్ను చంపేస్తాం,’ అన్నారు నక్సలైట్లు.
‘మీ వల్ల కాదు. పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఇద్దరు ముసలివాళ్ళను చంపివేయాలని మీ వాళ్ళు వాళ్ళని నరికిపోయారు. వారు చనిపోలేదు. ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నమ్మేవాడిని నేను. నన్నేమీ చేయలేరు,’ అని సాంబిరెడ్డి ధైర్యంగా సమాధానం చెప్పారు.
రామలక్ష్మణుల రక్షణ
‘మీకు ప్రోటెక్షన్ ఇస్తాం’ అన్నారు డీఎస్ పీ.
‘నాకు రామలక్ష్మణుల రక్షణ ఉంది. వారు బాణాలు ఎక్కుబెట్టి నాకు చెరో పక్కనా ఉంటారు. నాకేమీ కాదు,’ అని సాంబిరెడ్డి అన్నారు.
‘‘రైతులు అమాయకులు. సత్యహరిశ్చంద్రులు. ఎంఎల్ఏలు నాపైన దుష్ప్రచారం చేశారు. అయిదుగురు ఎంఎల్ఏలు నేను దళితుల భూములు లాక్కొంటున్నట్టూ, వారి డబ్బు కొట్టివేస్తున్నట్టూ అసెంబ్లీలో ఆరోపించారు. అసెంబ్లీ ఒక దర్యాప్తు సంఘాన్ని నియమించింది. ఆ సంఘంలో ఉన్న అధికారులలో కలెక్టర్ ఒకరు,’’ అని వివరించారు. జంగారెడ్డిగారు అప్పుడు ఎంఎల్ఏ. ఏమైనా సహాయం కావాలా అని అడిగారు. ఆ తర్వాత ఆయన ఎంపీ అయ్యారు. 1984లో దేశం మొత్తం మీద ఎన్నికైన ఇద్దరు బీజేపీ లోక్ సభ సభ్యులలో ఆయన ఒకరు. ‘ధర్మం జయిస్తుంది సార్. సత్యం ధర్మానికి మూలం. అదే నా విశ్వాసం,’ అని సాంబిరెడ్డి జగ్గారెడ్డితో అన్నారు.
దర్యాప్తు సంఘం వచ్చింది. ‘మీరు డబ్బులు తిన్నారట కదా,’ అని సంఘం అధికారులు సాంబిరెడ్డిని అడిగారు.
సాంబిరెడ్డిని స్టేట్ మెంట్ ఇవ్వాలని సంఘం సభ్యులు కోరారు. ‘మేము రైతులకు వచ్చిన పరిహారం నుంచి పది శాతం ఖర్చుల నిమితం అడిగిన మాట వాస్తవమే. రైతులు ఎనిమిది శాతం ఇచ్చారు. అందులో నాలుగు శాతం డిప్యూటీ కలెక్టర్ కు ఇచ్చాం. అడగండి. ఇక్కడే ఉన్నాడుగా సిగ్గులేకుండా. ఆయననే అడగండి ఇచ్చామో లేదో. ఒక శాతం కలెక్టరేట్ లో సిబ్బందికి ఇచ్చాం. అలాగే తక్కిన సొమ్మును పంచిపెట్టాం. నేను ఒక్క రూపాయ తీసుకోలేదు. దళితులను పిలిపించండి,’ అన్నారు సాంబిరెడ్డి.
కలెక్టర్ జిల్లాపరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ‘నాకు డబ్బు ఎవరు ఇచ్చారో చెప్పమనండి,’ అన్నారు సాంబిరెడ్డి. ఒక్కడు చెప్పలేదు. ‘మాకే లెక్కలు తెలవవయ్యా. ఆయనకు లెక్కలన్నీ తెలుసు. ఆయన ఉండటం వల్లనే మాకు పరిహారం వస్తోంది. ఆయన నయాపైసా తీసుకోకుండా పని చేసిపెడుతున్నారు,’ అని దళితులు చెప్పారు. సాంబిరెడ్డిపైన చాడీలు చెప్పిన నలుగురూ మర్నాడు తెల్లవారుజామునే ఆయన ఇంటికి వెళ్ళారు. తప్పు జరిగిపోయిందనీ, చెప్పుడు మాటలు విని ఫిర్యాదు చేశామని లెంపలేసుకున్నారు.
ధర్మం నెగ్గడానికి అబద్ధం ఆపద్ధర్మం
‘ధర్మం నెగ్గడానికి అబద్ధం దోహదం చేస్తుంది. అటువంటి సందర్భాలలో అబద్ధం చెప్పడం కూడా పుణ్యమే,’ అంటారు సాంబిరెడ్డి. ‘‘ఒక గ్రామంలో అన్ని ఇళ్ళూ అయిదేళ్ళ లోపు కట్టినవే అని వాదించాం. అదెట్లా సాధ్యం అన్నాడు దిల్లీ నుంచి వచ్చిన అధికారి. కొత్తగా కట్టిన ఇల్లు అయితే ఎక్కువ పరిహారం వస్తుందని అట్లా చెప్పాం. అధికారులు అడిగిన ప్రశ్నకు అతికే విధంగా జవాబు చెప్పవలసి వచ్చింది. అయిదేళ్ళ కిందట ఇక్కడ పచ్చటి పొలాలు ఉండేవనీ, వారంతా సింగరేణి కాలరీ ఉద్యోగులనీ, వారికి ఒక్కాసారే బోనస్ లాగా డబ్బు వచ్చినప్పుడు ఇక్కడ ఇళ్ళు కట్టుకోవాలని అనుకున్నారనీ, ఒకటి రెండు పాత ఇళ్ళు ఉంటే వాటిని పడగొట్టి అన్నీ కొత్త ఇళ్ళు కట్టుకున్నారనీ కట్టుకథ చెప్పారు. దిల్లీ అధికారి సంతృప్తి చెందినట్టు తలలాడించాడు. సంతోషంతో సాంబిరెడ్డిని కావలించుకున్నాడు. సమస్యకు ఒక పరిష్కారం లభించినందుకు ఆనందించాడు. ఒక సారి అధికారులు వచ్చే సరికి ఒక ఇంటిమీద కప్పులేదు. ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే చుట్టుపక్కలవారు చూరు పీకి పొయ్యిలో ఇంధనంలాగా వాడుకున్నారు. కొన్ని రోజులకు కప్పులేని ఇల్లు మిగిలింది. అదే విషయం నివేదికలో రాస్తామని అధికారులు చెప్పారు. ఆ సంగతి సాంబిరెడ్డికి తెలిసింది. వెంటనే ఆయన ఆ గ్రామానికి వెళ్ళి గ్రామస్థులను పిలిచి ఆ ఇంటికి తక్షణం కప్పువేయాలనీ, లేకపోతే అందరికీ నష్టపరిహారం తగ్గుతుందనీ చెప్పారు. కొన్ని గంటలలో కప్పు పడింది. మర్నాడు కలెక్టర్ తనిఖీకి వచ్చినప్పుడు ఇంటిమీద కప్పు ఉంది. ‘కప్పు ఉంది కదా,’ అంటూ కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ఆ విధంగా ఆపద్ధర్మం కోసం అబద్దాలు చెప్పడం తప్పుకాదని సాంబిరెడ్డి విశ్వాసం.
రైతులు ఆశించిన మొత్తానికి కొన్ని రెట్లు ఎక్కువ పరిహారం
ప్రాజెక్టు కింద మునిగిపోయే భూములకు రైతులు ఆశించినదాని కంటే చాలా రెట్లు ఎక్కువ ఇప్పించారు సాంబిరెడ్డి. రైతులను అడిగారు ఎంత రావాలని అనుకుంటున్నారు అని. ‘ఎకరం వెయ్యి రూపాయలు చేస్తుందనుకుంటున్నాం. ఎకరానికి మూడు వేలు ఇప్పిస్తే సంతోషిస్తాం అన్నారు. పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. జగ్గారెడ్డి అనే న్యాయవాది బాగా సహకరించారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్ టీపీసీ)వాళ్ళు ఎకరానికి రూ. 12 వేలు ఇవ్వడానికి అంగీకరించారు. జడ్జి పొరబాటున ఎకరానికి రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలని రాశారు. అంత ఎక్కువ అక్కర లేదనీ, మరో ఆర్డరు ఇవ్వమనీ అడిగితే ఒక సారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత దానిని మార్చే ప్రసక్తి ఉండదని చెప్పారు. ఎన్ టీపీసీ వారు హైకోర్టులో పిటిషన్ వేస్తే రైతుల తరఫున నారాయణరావు అనే అడ్వకేటు వాదించారు. ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఎక్కువ కానేకాదన్నది ఆయన వాదన. రైతులు ఊరు వదలాలి. చింతచట్టు వదిలిపోవాలి. పోచమ్మను వదలాలి. వారి జీవితాలలో వెలుగు తీసివేశారు. అందుకని వారికి ఎంత పరిహారం ఇచ్చినా తక్కువేనని వాదించారు. జస్టిస్ పాండురంగారావు ఎకరానికి రూ. 20వేలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రకంగా రైతులు ఆశించిన మొత్తం కంటే దాదాపు ఏడు రెట్లు అధికంగా పరిహారం ఇప్పించామని సాంబిరెడ్డి చెప్పారు.
రైతులకు డబ్బు బాగా వచ్చింది. సైకిల్ పోయి మోటార్ సైకిలు వచ్చింద. అదిపోయి కారు వచ్చింది. అందరూ బాగుపడ్డారు. రైతులంతా కలిసి సాంబిరెడ్డికి రూ. 45 లక్షలు ఇచ్చారు. అందులో చాలా భాగం దానాలూ, ధర్మాలూ చేశారు. రైతుబిడ్డలకోసం పాఠశాలలు కట్టించారు. ఆస్పత్రులు కట్టించారు. ప్రత్యర్థులు అసూయపడకుండా అక్కడ వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం అక్కడే ఖర్చు చేశారు. ‘నా ఆస్తి, నా బంధువుల ఆస్తి అంతా మీకు రాసిస్తా. నయాపైసా లేకుండా వెళ్ళిపోతా’ అని ప్రత్యర్థులతో సాంబిరెడ్డి అన్నారు. వారంతా కాళ్ళమీద పడి క్షమాపణ కోరారు. వారికి భోజనాలు పెట్టించి దారి ఖర్చులు ఇచ్చి పంపించారు.
చదువుకున్నవాళ్ళే దొంగలు
‘‘చదువుకున్నవారంతా దొంగలు. చదువురాని రైతులు అమాయకులు. ధర్మాత్ములు,’’ అని సాంబిరెడ్డి తీర్మానించారు. కెఎస్ శర్మ, ఎల్ వి సుబ్రహ్మణ్యం వంటి ఉన్నతాధికారులతోనూ, ముత్యాలనాయుడు వంటి మాజీ వైస్ చాన్సలర్ తోనూ కలిసి అనేక కార్యక్రమాలను సాంబిరెడ్డి చేశారు. దశాబ్దం కిందట ‘తెలుగు పద్యం – అందచందాలు’ అనే అంశంపైన దూరదర్శన్ లో వంద ఎపిసోడ్లు చేశారు. రామబ్రహ్మం, సుమతీ నరేంద్ర వంటి అధ్యాపకుల సహకారంతో పుస్తకాలు రాయించి, ప్రచురించి, ఉచితంగా పందేరం చేస్తున్నారు. కొంతమంది పండితులు రాయకుండా తిప్పుకొని అవస్థలు పెట్టారనీ, కొందరు రాశారనీ, మొత్తం మీద యాభై పుస్తకాలు అచ్చువేశాననీ, వాటిని వేల సంఖ్యలో ఉచితంగా పంపిణీ చేశాననీ చెప్పారు. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం కూడా తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితో కొన్ని మంచిపనులు చేయించాలని ప్రయత్నిస్తున్నాని అన్నారు. తిరుపతి ప్రసాదంగా భక్తులకు లడ్డూతో పాటు రామాయణమో, భాగవతమో, భారతమో ఏదో ఒక పుస్తకాన్ని కూడా ఉచితంగా బహుకరించాలని సూచించారు. లడ్డూ, పుస్తకం కలిపి ప్రసాదం ఇచ్చే అయ్యవారు ‘ఈ పుస్తకం చదవండి శుభం జరుగుతుంది, పుణ్యం వస్తుంది’ అని చెబితే ఎక్కువమంది చదువుతారని ఆయన ఆశ. ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న చిన్నపిల్లలకు పురాణ గ్రంథాల పఠనం పట్ల ఆసక్తి కలగజేస్తే తెలుగు ప్రజల సంస్కృతి పూర్తిగా సకారాత్మకంగా మారిపోతుందని ఆయన విశ్వాసం. ఎల్ వి ప్రసాద్ కంటి ఆస్పత్తి దగ్గర, నిలోఫర్ ఆస్పత్రి దగ్గర, ఇతర చోట్లా అన్నదానం చేశారు. తనకు ఉన్న భూములను అమ్మి వచ్చే డబ్బుతో దానధర్మాలు చేస్తున్నారు. తన పెద్దకొడుకు లండన్ లో స్థిరపడిన వైద్యుడు. తాను అప్పులు చేస్తే అతడు తీర్చుతున్నాడనీ, తనకు కోటి రూపాయల అప్పుందని చెబితే ఆ అప్పు తీర్చి తన పేరుమీద ఉన్న తొమ్మిది ఎకరాల పొలం వాల్చుకున్నాడనీ, ప్రింటర్ కు ఆరేడు లక్షలు ఇవ్వాలని చెబితే ప్రింటర్ కే నేరుగా పైకం పంపించాడనీ, తనకు ఇప్పడు అప్పులు లేవనీ, ఆస్తులు ఉన్నాయనీ సాంబిరెడ్డి చెప్పారు. శతకాలు, భారతీయ సనాతన ధర్మం, భగవద్గీత ప్రచురిస్తే తన ప్రణాళిక పూర్తవుతుందని చెప్పారు. కుప్పా వేంకట కృష్ణమూర్తి పుస్తక రచన బాధ్యత నిర్వహిస్తూ ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పారు.
పురాణదర్శనం
ఈ రోజు (గురువారం) మాకు ప్రదానం చేసిన పురాణదర్శనం మూడు భాగాలూ శ్రీపావని సేవా సమితి ప్రచురించింది. ఇది ఆయన నిర్వహిస్తున్న సాహిత్య సేవా సంస్థ. అష్టాదశ పురాణాలనూ ఈ మూడు భాగాలలో కుదించారు. సంస్కృత మూలం వేదవ్యాసమహర్షి అయితే తెలుగు వచనం డాక్టర్ జయంతి చక్రవర్తిది. ప్రకాశకులు చల్లా సాంబిరెడ్డి. ఇరవై రెండు సంవత్సరాల కిందట నెలకొల్పిన పావని సేవా సమితికి అధ్యక్షులు సాంబిరెడ్డి, ఉపాధ్యక్షులు జి.సి.హెచ్. రామారావు, ప్రధాన కార్యదర్శి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు. శ్రీపావని సేవాసమితికి విద్యార్థులూ,ఉపాధ్యాయులూ రెండు కళ్ళు. ఉపాధ్యాయులకు కూడా ప్రముఖ గ్రంథాలైన రామాయణ, భారత, భాగవత, భగవద్గీతలపై పరిచయం, అవగాహనా ఎంతో అవసరం. అందుకనే ఈ నాలుగు సద్గ్రంథాలనూ సరళభాషలో, అందరికీ అర్థమయ్యే రీతిలో శ్రీపావని సేవాసమితి ప్రచురించి లోకానికి ఉచితంగా అందించింది. ఈ గ్రంథాలను ఆంగ్లంలోకి కూడా అనువదించి ముద్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రామాయణ, భగవద్గీత గ్రంథాలు ఇప్పటికే అనువాదం పూర్తయి ముద్రణలో ఉన్నాయి.
పురాణేతిహాసాలను ముద్రించి ఉచితంగా తెలుగు లోగిళ్ళకు అందించాలనీ, పిన్నవయస్సులోనే విద్యార్థినీవిద్యార్థులపైన ప్రభావం వేయాలనే బృహత్ సంకల్పంతో తాను తలబెట్టిన అక్షర యజ్ఞాన్ని జయప్రదం చేసేందుకు అహరహం శ్రమిస్తున్న సాంబిరెడ్డిగారి జీవితం ధన్యమైనది.
Puranas or epics ithihasam historicalal concern there maybe little historical volition in puranas but they are fabricated stories ,the puranas what we call them as Ithihasas are ‘’ Raja kadha Prahasalu’’
Little historical content
Sri Mad Ramayana mahakayam and Bharatha, Bhagavatas are Visnavite Puranas depicting Sri.Mahavishunu incornation stories They have agreat impacts on Relgions and culture
Raja kadha prahasnalu
వారి తో నాకు 3 సం.పరిచయం…పుస్తకాలు చదివే అలవాటు ఉన్న సరైన మంచి పూజారులు., ఉపాధ్యాయులు… సమాజహితం కోరే వ్యక్తులు అని నమ్మకం తో… హైదరాబాద్
నగరంలో….2019 లో వేసవిలో వాల్మీకి రామాయణం.,కవిత్రయం మహాభారతం.,
పోతన భాగవతం.. దేవాలయాలు తిరిగి యోగ్యులైన అర్చకులకు పంచడం జరిగింది….. విద్యారంగంలో.కూడా.
In distribution of books…Ramayanam.,Mahabharatham., Bhagavatham…with HIM…(Sri Challa SambiReiddy
garu) to temple archakas. and school teachers from 2019 is my great golden opportunity…in my life….great satisfaction…