షణ్మఖశర్మ, ఉషశ్రీ
20న హైదరాబాద్‌లో సన్మానం
హైదరాబాద్, మార్చి 3: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మను ఉషశ్రీ మిషన్ ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని అందించనుంది. ఈ నెల 20న సోమాజీగుడాలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటవుతుందని ఉషశ్రీ మిషన్ కార్యదర్శి డాక్టర్ పురాణపండ వైజయంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత, బ్యాంకింగ్ రంగ నిపుణుడు డాక్టర్ ఎ.ఎస్. రామశాస్త్రి అధ్యక్షత వహిస్తారు. డాక్టర్ రామశాస్త్రి రచించిన ‘అక్షరాంజలి’ ఆడియోను కూడా ఇదే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఈ ఆడియోను అపర ఘంటసాల బిరుదాంకితులు, విజయవాడకు చెందిన గుడిపాటి హరికృష్ణ గానం చేశారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి సుమారు రెండు దశాబ్దాల కాలం ‘రామాయణ, భారత ప్రవచనం,’ ‘ధర్మసందేహాలు’ కార్యక్రమాలు నిర్వహించిన ‘ఉషశ్రీ’ తెలుగువారికి సుపరిచితులు. ఆయనది ఒక సంస్కృతి. ఉషశ్రీ మార్గంలో ఉన్నవారిని ఎంపిక చేసి ఉషశ్రీ జయంతి రోజున పురస్కారం అందచేస్తోంది ఉషశ్రీ మిషన్. కిందటి సంవత్సరం ఈ సత్కారాన్ని పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావుకు అందచేశారు. ఈ సంవత్సరం, ఉషశ్రీ 94వ జయంతి పురస్కరించుకుని, ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మకు అందచేస్తున్నట్లు ఉషశ్రీ మిషన్ కార్యదర్శి పురాణపండ వైజయంతి తెలిపారు.